Aug 02,2023 14:38
  • ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మంగళగిరిలో విద్యార్థుల నిరసన

ప్రజాశక్తి-మంగళగిరి(గుంటూరు) : జిఓ నెం.108ని రద్దు చేయాలని విద్యార్థులు మంగళగిరి మిద్ది సెంటర్లో బుధవారం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జి.ఓ 108 కాపీల దగ్దం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు యం. బాలాజి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వైద్య విద్యకు సంబందించిన జి.ఓ నెం.108ని ఎస్‌ఎఫ్‌ఐ వ్యతిరేకిస్తుందన్నారు. వైద్యవిద్యను పూర్తిగా వ్యాపారం చేయదలుచుకుని ఈ జిఓను తెచ్చారా? అని ప్రశ్నిచారు. ఈ జీఓలో తెలిపిన సెల్ఫ్‌ ఫైనాన్స్‌ విధానం అత్యంత ప్రమాదకరమన్నారు. వైద్య విద్యా పేద వారికి మాత్రమే అందుబాటులో లేదని ఈ జిఓ అమలు జరిగితే మద్యతరగతి వారికి కూడా అందుబాటులో లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జిఓలో 3 క్యాటగిరీలుగా విభజిచి (ఎ).జెనరల్‌ క్యాటగిరీ రూ.15000, (బి). సెల్ఫ్‌ ఫైనాల్స్‌ క్యాటగిరీ రూ. 12లక్షలు, (సి). ఎన్‌ఆర్‌ఐ క్యాటగిరీ 20లక్షలుగా వసూలు చేయనుంది అని తెలిపారు. ఎస్‌.సి, ఎస్‌.టి, బి.సి, మైనార్టీలకు రిజర్వేషన్లు అమలు అయ్యే పరిస్థితులు ఇందులో కనిపించడంలేదన్నారు. ఈ విధంగా అయితే ప్రభుత్వ,ప్రైవేటు మెడికల్‌ కాలేజీలకు తేడా ఉండదని అన్నారు. వైద్యవిద్యను వ్యాపారం చేయడమే లక్ష్యంగా ఈ జిఓను ప్రభుత్వం తెచ్చినట్లు ఉందని విమర్శించారు. ఈ జీవోను రద్దు చేయకుంటే రాష్ట్రవ్యాప్త ధర్నాకు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మున్నా, రవితేజ, అఖిల్‌, లావణ్య, రమ్య తదితరులు పాల్గొన్నారు.