Jun 13,2023 08:01

హాయ్ ఫ్రెండ్స్‌! నేను వేసవి సెలవుల్లో కోయంబత్తూరు వెళ్లా. అక్కడ జి.డి నాయుడు కార్‌ మ్యూజియం చూశా. చాలా బాగుంది. అలనాటి కార్లు మోడల్స్‌ చూసి చాలా సంతోషంగా అనిపించింది. అసలు జి. డి. నాయుడు పూర్తి పేరు గోపాలస్వామి దొరస్వామి నాయుడు. ఈయన పూర్వీకులు తెలుగువారే. వీరు ప్రఖ్యాతిగాంచిన ఇంజనీరు. నిరంతర అన్వేషకుడు. దక్షిణ భారతంలో పారిశ్రామిక విప్లవానికి కారణభూతుడై భారతదేశపు ఎడిసన్‌ అని కూడా పిలువబడ్డాడని మాకు అక్కడి గైడ్‌ అంకుల్‌ చెప్పారు. మూడవ తరగతి వరకు మాత్రమే చదువుకున్న ఈయన భారతదేశపు మొట్టమొదటి విద్యుత్‌ మోటారును తయారు చేశాడని చెప్తే చాలా ఆశ్చర్యపోయాను. 1893 మార్చి 23వ తేదీన కోయంబత్తూరు దగ్గరలోని కలంగల్‌ అనే గ్రామంలో జన్మించాడు. 1920లో ఒక చిన్న మోటారు వాహనాన్ని కొనుగోలు చేసి పొల్లాచి, పళనిల మధ్య నడిపాడు. అతి చిన్న వయస్సులో యునైటెడ్‌ మోటార్‌ సర్వీస్‌ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా 1937లో భారతదేశపు మొదటి మోటారు వాహనాన్ని తయారు చేసింది.
 

                                                                        తయారుచేసిన పరికరాలు

తొలి విద్యుత్‌ రేజర్‌, బహు పదునైన బ్లేడు, దూరము సరిచేసే కెమేరా భాగము, పండ్ల రసము తీయు పరికరం, ఎన్నికల యంత్రం, కిరోసిన్‌తో నడిచే ఫ్యాను (పంఖా), ఐదు వాల్వులు గల రేడియో (డెబ్బయి రూపాయలు), రెండు సీట్ల మోటారు కారు (రెండు వేల రూపాయలు) - 1952, ఇలా...... చెప్పుకొంటూ పోతే చాలా ఉన్నాయి. నాయుడు తయారు చేసిన పరికరాలు, పనిముట్లు, సేకరించి పెట్టిన అలనాటి వస్తువులు వేల కొద్దీ ఉన్నాయి ఈ మ్యూజియంలో...
      దీని పక్కనే సైన్స్‌ మ్యూజియం, అలాగే 'ఇన్స్ట్రుమెంటా' అనే పేరుతో ఒక ప్రయోగశాల కూడా ఉన్నాయి. ఒక రోజంతా పడుతుంది మొత్తం చూడాలంటే. ఈసారి మీరు ఏదైనా ట్రిప్‌ ప్లాన్‌ చేస్తే చేస్తే కోయంబత్తూరు గురించి ఆలోచించండి. ఇక్కడి నుంచే ఊటీ ,తంజావూరు లాంటి ప్రదేశాలకు వెళ్లొచ్చు.
 

- పవని కృష్ణ ప్రణయిని
5వ తరగతి, చీరాల