అతడు
యుగాలను రవళించే పాలధారలాంటి
సూర్యుడు
ఆమె !
నాలుగు చినుకుల కలవరింతయ్యే
భూమి
పిల్లలు!
రంగురంగుల పిట్టల మాటల కేరింతల్లాంటి
ఋతువులు
సూర్యుడు
రాత్రంతా అక్షరాల్లో నలిగి
ఉదయాన్నే పుస్తకాల పుటలలోంచి నిద్రలేచే
అతడు !
భూమి
చిటికెడు వెలుతురు కోసం
పుస్తకాల గది చుట్టూ ప్రదక్షిణ చేసే
ఆమె !
ఋతువులు
తలపు తలపుకీ
కొత్త కవితావాక్యాల రూపమెత్తే,
పిల్లలు!
అతడు
ఆమె
పిల్లలే
ఆ ఇల్లు...
ఆ ఇళ్లే,
అక్షర నక్షత్రశాల!
కవితా పాదాల పాలపుంత!!
పుస్తకాల ఫ్యూజన్!
(కవిమిత్రుడు అంకే శ్రీనివాస్ కోసం...)
- కొత్తపల్లి సురేశ్










