ఆ ఊరు నుంచి క్రితం ఏడు కొందరు
వెళ్లిపోయారు
ఈసారి అతని వంతు వచ్చింది
మునుపు వెళ్లినవాళ్లలాగే అతనూ
కదిలి వెళ్లిపోతుంటే -
ఎవరిదో తెలిసిన గొంతే ఎక్కడనుంచో
వినిపించింది!
ఆగి చుట్టూ చూశాడు ...
ఎవరూ కనిపించకపోయేసరికి
మళ్లీ నడక మొదలుపెట్టాడు
ఎవరో మళ్లీ పిలుస్తున్నారా?
పిలిచినట్టే అనిపించి ఆగి మళ్లొకసారి
చుట్టూ పరికించాడు
లేరు, పిట్ట మనిషైనా కనిపించలేదు !
ఇక వెనక్కి తిరగడానికి మనసొప్పక
ముందుకే నడిచాడు
అతను నడిచిన తోవంతా నీళ్లులేని
ఎండిన నది పరుచుకుని వుంది
ఇంతవరకూ అతనిని పిలిచినది నదో
వూరిని వదిలి వెళ్లిపోతున్నాడని తెలిసి
బోరున ఏడ్వలేక
లోలోపలే కుమిలిపోతున్న
అతనో
ఆ ఊరి నుంచి ఇంకొంతమంది
రెప్పలు మూసిన నది వొడ్డున అతని వెనుకే
నడుస్తున్నారు !
- బాల సుధాకర్
96764 93680










