Aug 07,2023 07:36

కన్నీళ్ళతో ఈ మంటలు ఆరేవి కాదు
కవిత్వాలతో ఈ క్రోధం తీరేది కాదు
కాలం ఏదో తీగ మీటుతోంది
యుగే యుగే చీకటిలోంచి
జాగో జాగో పాట పాడుతోంది

ఎంత పెద్ద దేశం ఇది..
ఇంత చిన్న గుండెను ఎన్ని దీపాలు చేసి వెలిగించాలి!
గులాబీ రేకులనైనా
తాకడానికి వణికే చేతులు కదా మనవి
చిన్ని వెన్నెల చినుకు వాలినా చలించిపోయే రెప్పలు కదా మనవి పసిపాపల ముందు
ఎగిరి గంతులేసి ఆడుకునే
ప్రాణం ఉన్న గులకరాళ్ళం కదా మనం
కాలం ఇప్పుడు ఏదో సైగ చేస్తోంది!

కాలం బలి వేదిక మీద
నక్షత్ర ఖచిత సత్యాయుధం
నృత్యం చేస్తోంది
యుద్ధం తప్పదు కాబోలు-
సిద్ధంగా ఉండాలి తమ్ముడూ!
ఆత్మల కాగడాలు పట్టి
అడుగులు వేయాలి అమ్మడూ!

మన నెత్తి మీద ఆకాశం ఎటో పారిపోకముందే
మన కాలి కింద భూమి ఎటో కూలిపోకముందే
ధర్మం వొరలోంచి దేహాలను తీసి
దేశం పాదాల ముందు పెట్టాలి!
మబ్బుల బుగ్గలు నిమిరే మృదువైన అరచేతులతో
పట్టాల్సి వస్తే ఆయుధం పట్టుకో తమ్ముడూ
పూలకు నవ్వుల తిలకాలు అద్దే
లేత చేతి వేళ్ళతో
పట్టాల్సివస్తే ఆయుధం పట్టుకో అమ్మడూ

ఇక మాటలతో సమరం కాదు
ఇది మౌనానికి సమయం కాదు
నువ్వో.. నేనో
ఒక మణిపూర్‌ కాకముందే
ధర్మ రక్షకుల చేతుల్లో
మన ప్రజాస్వామ్యం వివస్త్ర కాకముందే
తిరగబడు తిరగబడు తిరగబడు-
ఈ మాట అరిగిపోయినదే
అయినా లక్షసార్లు అంటాను

తిరగబడు తిరగబడు తిరగబడు-

కన్నీళ్ళతో ఈ మంటలు ఆరేవి కాదు
కవిత్వాలతో ఈ క్రోధం తీరేది కాదు

యుగే యుగే చీకటిలోంచి
జాగో జాగో పాట పాడు !
 

- ప్రసాదమూర్తి
84998 66699