విప్లవ కార్మిక వర్గం వెల్లువలా కదలడం బ్రిటిష్ పాలకులను గంగవెర్రులెత్తించింది. ఆ వెలువను అడ్డుకునేందుకు కమ్యూనిస్టులపై తీవ్రమైన అణచివేతకు బ్రిటిష్ ప్రభుత్వం తెగబడింది. కమ్యూనిస్టులను, కార్మిక, కర్షక ఉద్యమాల్లో పనిచేస్తున్న క్రియాశీల కార్యకర్తలను కుట్ర కేసుల్లో ఇరికించి కటకటాల పాల్జేసింది. అయినా పట్టు వీడని విక్రమార్కుల్లా కమ్యూనిస్టులు ఈ కుట్ర కేసులు, నిర్బంధాలను ఎదుర్కొని, సంపూర్ణ స్వాతంత్య్రం కోసం ఉద్యమించారు.
పెషావర్ కుట్ర కేసు
కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావం తరువాత తోటి కమ్యూనిస్టు బృందం సోవియట్ నుంచి భారత దేశా నికి తిరిగి వస్తుండగా, 1921 జూన్‌లో పెషావర్‌లో అరెస్టు చేశారు. దేశంలో బోల్షివిక్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపిస్తూ, రాజద్రోహ నేరం మోపి మొహమ్మద్ అక్బర్‌ను తొలుత అదుపులోకి తీసుకున్నారు. ఖిలాఫత్ వ్యతిరేక ఉద్యమం నుంచి కమ్యూనిస్టులుగా మారిన తొలి ముస్లిం కమ్యూనిస్టు విప్లవకారులపై 1921-27 మధ్య కాలంలో ఐదు కుట్ర కేసులు బనాయించారు. పెషావర్ బోల్షివిక్ కుట్ర కేసులుగా చరిత్ర ప్రసిద్ధినొందాయి. బోల్షివిక్ లకు సమాచారం పంపేవారిగా పనిచేస్తూ బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర పన్నారని వీరిమీద అభియోగాలు మోపారు. నామమాత్రంగా విచారణ జరిపి, ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిం చారు. అక్రమ అరెస్టులకు గురై, అన్యాయంగా జైలు పాలైనా, అక్రమంగా శిక్షలు విధించినా కాంగ్రెస్, ముస్లింలీగ్ బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఏమాత్రం విమర్శిం చలేదు. కొమింటర్న్ బ్రిటిష్ దమన నీతిని ఖండించింది.
కాన్పూర్ కుట్ర కేసు
పెషావర్ కుట్ర కేసుతో కమ్యూనిస్టు భావజాల వ్యాప్తిని అడ్డుకోవాలని బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నిం చినా, కార్మికులు, రైతుల్లో కమ్యూనిస్టుల ప్రభావం పెరుగుతూనే వచ్చింది. 1923 జూన్ 23న దేశం లోని కమ్యూనిస్టు బృందాలన్నీ కలిసి ఐక్య సదస్సు నిర్వహించాలని నిర్ణయించాయి. ఆ మరుక్షణం కమ్యూనిస్టు పార్టీ ప్రధాన నాయకత్వాన్ని బ్రిటిష్ సర్కారు అరెస్టు చేసింది. దేశంలోనూ, విదేశాల్లోనూ ఉండి పనిచేస్తున్న ప్రధాన కమ్యూనిస్టు పార్టీ నాయకులందరి పేర్లను ఈ కేట్ర కేసులో ఇరికించింది. ఎంఎన్ రారు, ముజఫర్ అహ్మద్, షౌకత్ ఉస్మాన్, గులామ్ హుస్సేన్, ఎస్‌ఎ డాంగే, సింగార్‌వేలు, ఆర్‌సి శర్మ, నళిని గుప్తా, షంషుద్దీన్ హాసన్, ఎంపిఎస్ వేలాయుధన్, డాక్టర్ మణిపాల్ షా, సంపూర్ణానాంద, సత్యభక్తల మీద కేసులు పెట్టారు. చివరికి మొదటి ఎనిమిదిమందిపై ఛార్జి షీట్ బనాయించి, మిగిలిన వారిని విడిచిపెట్టారు. ఈ ఎనిమింది మందిలో కుట్ర కేసు బనాయించే సమయానికి ఎంఎన్ రారు జర్మనీలోనూ, శర్మ ఫ్రెంచ్ పాలిత పాండిచ్ఛేరిలో ఉంటున్నారు. రారు తదితర ప్రవాసీ కమ్యూనిస్టులు, భారతీయ కమ్యూనిస్టులు, కొమింటర్నుల మధ్య నడిచిన ఉత్తర ప్రత్యుత్తరాలను బ్రిటిష్ ప్రభుత్వం చేజిక్కించుకుంది. అవి ఢిల్లీలోని జాతీయ పురాతన గ్రంథాలయంలో నేటికీ అందుబాటులో ఉన్నాయి. 1924 ఏప్రిల్‌లో బ్రిటిష్ జడ్జి హోమ్స్ ముందు ఈ కేసు విచారణకు వచ్చింది. చౌరీచౌరి కేసులో 172 మంది రైతులకు మరణశిక్ష విధించిన హోమ్స్, ఈ కేసు విచారణ నెలరోజుల్లోనే పూర్తి చేసి నిందితులందరికీ నాలుగేళ్ల కఠిన కారాగార శిక్ష విధించాడు. ఈ కేసుకు వ్యతిరేకంగా జాతీయంగానూ, అంతర్జాతీయం గానూ సంఘీభావం వెల్లడైంది. కమ్యూనిస్టులు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న యోధులేనని నాటి ప్రజల్లో వ్యాప్తి చెందింది. ప్రధాన కమ్యూనిస్టు బృందాల నేతలంతా అండమాన్ జైలులో ఉన్నం దున 1923లో ఐక్య సదస్సు రద్దవగా, ఆ తరువాత 1925 డిసెంబర్ 26-28 తేదీలలో దేశంలోని కమ్యూనిస్టు బృందాలన్నీ కలిసి అక్కడ తొలి మహా సభ నిర్వహించాయి.
1929 మీరట్ కుట్ర కేసు
కమ్యూనిస్టులకు, ట్రేడ్ యూనియన్ ఉద్యమా నికే కాకుండా మొత్తం స్వాతంత్య్రోద్యమానికి సమీకరణ కేంద్రంగా మారిందే మీరట్ కుట్ర కేసు విచారణ. 1929 మార్చి 20న బ్రిటిష్ ప్రభుత్వం దేశంలోని వివిధ ప్రాంతాల్లోని 31 మంది కీలకమైన కమ్యూనిస్టు, కార్మిక నాయకులను అరెస్టు చేసింది. ఇండియాలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి కుట్ర పన్నారని ఆరోపిస్తూ దేశంలోని పలు ప్రాంతాల్లో ఒకేసారి పలు గృహాలు, ఆఫీసులపై దాడులు నేసింది. నిందితుల్లో 13 మంది కమ్యూ నిస్టు పార్టీ సభ్యులు. వీరిలో కొందరు వేరేచోట్ల కమ్యూనిస్టు పార్టీలకు అనుబంధంగా ఉన్నవారు ఉన్నారు. ఫిలిప్ స్ప్రాట్, బెంజమిన్ బ్రాడ్లే ఈ కోవకు చెందిన మిగతా ట్రేడ్ యూనియన్ నాయకులపై విచారణ మీరట్‌లో 1933 ఆగస్టు వరకూ సాగింది. బ్రిటిష్ వారు 25 వాల్యూమ్‌ల కేసు ఫైలు సిద్ధం చేశారు. 3,500 ఆధారాలు, 320 మంది సాక్షులను ప్రవేశపెట్టారు. వీరంతా కార్మికులను, రైతులను సమీకరించే సాధారణ కార్యకలాపాల్లో పాల్గొంటు న్నట్టే ఆధారాలు చూపించగలిగారు. ఇదంతా ప్రజాస్వామ్య దేశాల్లో సర్వసాధారణంగా లభించే హక్కు.
మీరట్ విచారణను తమ ఆలోచనలను ప్రచారం చేసే వేదికగా ఉపయోగించుకోవాలని భావించిన జైలులో ఉన్న 18 మంది కమ్యూనిస్టులు ఒక సాధారణ ప్రకటన చేశారు. వర్గపోరాటంలో ఒక దశగా దీనిని అభివర్ణించారు. జాతీయ పరిస్థితి గురించి ఆ ప్రకటన సమగ్రమైన విశ్లేషణ చేసింది. కార్మికుల, రైతుల సమస్యలను ప్రస్తావించింది. మహిళల సమస్యలు చెబుతూ మహిళా విముక్తి పట్ల మార్క్సిస్టు అవగాహనను, కమ్యూనిస్టుల నిబద్ధతను వివరించింది. జాతీయ విముక్తి సాధించే ఎత్తుగడల గురించి, కమ్యూనిజం మౌలిక భావాలను గురించి తెలియజెప్పింది. ఈ తొలి ప్రకటన దేశంలోనూ, విదేశాల్లోనూ సంచలనం రేపింది. విచారణ జరిగిన తీరు, ఖైదీల ప్రకటనకు విస్తారమైన మద్దతు లభిం చింది. గాంధీతోసహా అనేకమంది జాతీయ నాయ కులు ఖైదీలను కలిసి, బ్రిటిష్ వారికి నిరసన లేఖలు రాశారు. అనేక నగరాల్లో సమ్మెలు, నిరసనలు జరి గాయి. న్యాయపోరాటానికి నిధులు సేకరించారు. ఇందులో బ్రిటిష్ కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు, కమ్యూ నిస్టు చరిత్రకారుడు, భారతీయ కమ్యూనిస్టులకు మార్గదర్శి రజనీ పామీదత్ ప్రముఖ పాత్ర పోషిం చారు. బ్రిటన్‌లోనూ సంఘీభావకార్యక్రమాలు జరిగాయి.
1933లో సెషన్స్ కోర్టు నిందితులకు కఠిన శిక్షలు విధించింది. 16 మందికి వివిధ కాలాలపాటు ప్రవాస శిక్ష, మరో 11 మందికి కఠిన కారాగార శిక్ష విధించారు. శిక్ష పడిన వారంతా అలహాబాద్ హైకోర్టులో అప్పీలు చేసుకున్నారు. హైకోర్టు తన తీర్పులో 'కుట్ర ఆచరణ యోగ్యమైనది కాదు. ఇంకా చెప్పాలంటే నిరూపించడం అసాధ్యం' అని పేర్కొంటూ 11 మందిపై అభియోగాలను కొట్టే సింది. ఇతరులకు శిక్ష తగ్గించింది. అప్పటికే నాలు గేళ్లు జైలులో గడిపారు కనుక 1933 నవంబర్‌లో అందరినీ విడిచిపెట్టేశారు. మీరట్ విచారణ బ్రిటిష్ వారు కోరుకున్నట్లు కమ్యూనిస్టులను అంతం చేయకపోగా, దేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి మరింత ఊతమిచ్చింది. తరువాతి సంవత్సరాల్లో సంస్థాగతంగానూ, పోరాటాల పరంగానూ శీఘ్ర విస్తరణకు ఒక మెట్టులా ఉపయోగపడింది. 'మేము ఎంతగా బాధలు పడినపపటికీ కాన్పూర్ బోల్షివిక్ కుట్ర కేసు మన ఉద్యమానికి మంచి ఉత్సాహాన్ని చ్చింది. 1928 వరకూ మన ఉద్యమానికి చేకూరిన బలంలో దీని భాగస్వామ్యం కూడా ఉంది.' అని ముజఫర్ అహ్మద్ తన జ్ఞాపకాలలో పేర్కొన్నారు.










