Jun 10,2023 08:32
  • విద్యార్థులకు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్న విద్యా శాఖ
  • అదే రోజు జగనన్న విద్యా కానుక కిట్లు అందజేత

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : పాఠశాలలు పున:ప్రారంభం అవుతున్న ఈ నెల 12 నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రాగి జావ పంపిణీని పునరుద్ధరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను విద్యా శాఖాధికారులు చేస్తున్నారు. ఈ ఏడాది మార్చి 21న విద్యార్థులకు రాగి జావ అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. కొద్ది రోజులు సరఫరా చేసిన తర్వాత రాగి పిండి లేకపోవడంతో ఏప్రిల్‌ మొదటి వారంలో పంపిణీ నిలిపేసింది. స్కూళ్ల పున:ప్రారంభం నేపథ్యంలో పూర్తి స్థాయిలో అందించేందుకు మళ్లీ ఇప్పుడు ఏర్పాట్లు చేసింది. రాగి జావ పంపిణీ కోసం రాష్ట్రంలోని 46,768 పాఠశాలలకు అవసరమైన 37,58,658 గ్లాసులను ఇప్పటికే పంపింది. రాగి జావ తయారీకి అవసరమైన రాగి పిండి, బెల్లాన్ని పౌరసరఫరాల సంస్థ రేషన్‌ దుకాణాలకు చేరవేసింది. ఐదు కేజీల ప్యాకెట్ల రూపంలో 37,833 క్వింటాళ్లను, కేజీ ప్యాకెట్ల రూపంలో 79,950 క్వింటాళ్ల రాగి పిండిని సరఫరా చేసింది. అదే పరిమాణంలో బెల్లాన్నీ రేషన్‌ డిపోలకు చేరవేసింది. వీటితోపాటు 11 జిల్లాల్లో 2,437 పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని నిర్వహిస్తున్న అక్షయపాత్ర, యాక్తా శక్తి వంటి స్వచ్ఛంద సంస్థలకు 4,293 క్వింటాళ్ల రాగి పిండి, బెల్లాన్ని అందించింది.
 

                                                           అదే రోజున జగనన్న విద్యా కానుకల పంపిణీ

స్కూళ్ల పున:ప్రారంభం రోజునే జగనన్న విద్యా కానుకలను పంపిణీ చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కిట్‌లో భాగంగా బ్యాగులు, బెల్టులు, పుస్తకాలు, డిక్షనరీలు, బూట్లు, రెండు జతల యూనిఫారాలు అందించనుంది. గత విద్యా సంవత్సరంలో చోటుచేసుకున్న జాప్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి అందరికీ ఒకేసారి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలల పున:ప్రారంభానికి ఇంకా రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 39,95,992 బ్యాగులు పంపిణీ కావాల్సి ఉండగా, ఇప్పటివరకు 19,29,941 బ్యాగులు పాఠశాలలకు చేరాయి. 28,53,435 బెల్టులు అవసరం కాగా, 20,69,847 సరఫరా అయ్యాయి. విద్యార్థులకు 2,34,46,064 నోటు పుస్తకాలు కావాల్సి ఉండగా, 1,44,89,664 పుస్తకాలు జిల్లాలకు వచ్చాయి. షూస్‌ 39,83,664 అవసరం కాగా, 23,35,530 చేరాయి. యూనిఫారాలు 39,95,992 రావాల్సి ఉండగా, 30,24,856 వచ్చాయి. విద్యార్థులకు 7,70,729 డిక్షనరీలు అవసరమవుతాయని గుర్తించగా, ఇప్పటివరకు 6,80,548 చేరాయి.
 

                                                                     పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమం

రాగి జావ పంపిణీ, జగనన్న విద్యా కానుక ప్రారంభం నేపథ్యంలో ప్రతి పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. స్కూల్‌లో సభ ఏర్పాటు చేసి స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులను పిలవాలని పేర్కొంది. ఆ కార్యక్రమంలో విద్యార్థులకు కిట్లు అందించాలని సూచించింది.