యాలకులంటేనే గుర్తొచ్చేది మంచి రుచి, సువాసన. నోటి దుర్వాసన తగ్గించడంలో, శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో వీటికి మించినవి లేవు. స్వీట్లు, కొన్ని రకాల వంటకాల్లో ఇవి తప్పనిసరి. వీటిలో అనేక ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
- మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసే గుణాలు యాలకుల్లో ఉంటాయి. జీవక్రియను వేగవంతం చేయగల సామర్థ్యం వీటికి ఎక్కువ. యాసిడ్ రిఫ్లెక్ట్స్, గ్యాస్ట్రిక్ రుగ్మతలను ఎదుర్కొంటాయి.
- యాలకుల్లో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పొటాషియం, క్యాల్షియం, మెగ్నిషీయం, ఎలక్ట్రోలైట్లూ ఉంటాయి. ఇవి గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. అధిక రక్తపోటును, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుతాయి.
- డిప్రెషన్ నుంచి బయటపడేందుకు యాలకులు ఎంతోగానో ఉపయోగపడతాయి. యాలకులతో మరిగించిన టీ తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.
- ఆస్తమాను అదుపులో ఉంచగలిగే గుణాలు యాలకుల్లో ఉంటాయి. గురక, దగ్గు, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలను తగ్గిస్తాయి.
- డయాబెటిస్‌ను యాలకులు కొంత మేరకు అదుపులో ఉంచగలవు. వీటిలోని మాంగనీస్ మధుమేహాన్ని అడ్డుకునే గుణాన్ని కలిగి ఉంటుంది.
- యాలకుల్లోని రసాయనాలు నోటిలోని బాక్టీరియాపై ప్రభావవంతంగా పోరాడతాయి. రోజూ రెండు యాలకులను నమిలి తింటే నోటి దుర్వాసన పోయి శ్వాస తాజాదనంతో ఉంటుంది. చిగుళ్లు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.
- కొందరికి ఆకలి సరిగ్గా వేయదు. తినాలనివున్నా తినలేకపోతుంటారు. ఈ సమస్యల వల్ల క్యాన్సర్, అనోరెక్సియా వంటి అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. అలాంటి సమయాల్లో యాలకులు తింటే ఆకలి పెరుగుతుంది.
- ఎక్కిళ్లు వచ్చినప్పుడు యాలకులు నమిలితే ఆగిపోతాయి. ఒక కప్పు వేడి టీలో యాలకులను వేసుకుని తాగినా ఎక్కిళ్లు ఆగిపోతాయి.
- యాలకులు గొంతులో గరగర నుంచి ఉపశమనం కలిగిస్తాయి. గోరువెచ్చని నీటిలో 1 గ్రా. యాలకులు, 1 గ్రా. దాల్చినచెక్క, 125 మి.గ్రా. నల్ల మిరియాల పొడి, ఒక స్పూన్ తేనె కలిపి తాగితే ఎలంటి గొంతు సమస్యలూ తలెత్తవు.