పారిస్ : నేల్ సంస్మరణార్థం నానిటెల్ లో గురువారం చేపట్టిన నిరసన ర్యాలీపై పోలీసులు విరుచుకుపడ్డారు. మంగళవారం పోలీసులు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 17 ఏళ్ల యువకుడు నేల్ మరణించిన సంగతి తెలిసిందే. పోలీసుల కాల్పుల్లో మరణించిన నేల్ తల్లి నేతృత్వంలో నిర్వహించిన ఈ మార్చ్‌లో వేలాది మంది పాల్గొన్నారు. ''పోలీస్ కిల్స్'' అనే బ్యానర్‌తో పాటు ''కిల్లర్ పోలీస్'' అంటూ నిరసనకారులు నినాదాలు చేశారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ.. అంతర్గత మంత్రి గెరాల్డ్ డర్మానిన్ రాజీనామా చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. ఈ ప్రదర్శన స్థానిక ప్రభుత్వ కార్యాలయానికి చేరుకున్న వెంటనే.. పోలీసులు వారిపై టియర్‌గ్యాస్‌తో విరుచుకుపడ్డారు.
మార్చ్ శాంతియుతంగా ప్రారంభమైందని అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రతినిధి కామిల్లె చైజ్ స్పష్టం చేశారు. అయితే నిరసనకారులు పలు వాహనాలతో పాటు కంటెయినర్‌లు, ఫర్నిచర్‌కి నిప్పటించారని.. దీంతో పోలీసులు జోక్యం చేసుకోవలసి వచ్చిందంటూ పోలీసులు చర్యను సమర్థించారు. ఈ మార్చ్‌లో లా ఫ్రాన్స్ ఇన్సౌమిస్ (ఎల్‌ఎఫ్‌ఐ) పార్టీకి చెందిన రాజకీయ నేతలతో పాటు ఫ్రెంచ్ కమ్యూనిస్ట్ పార్టీ (పిసిఎఫ్) కార్యదర్శి ఫాబియన్ రౌసెల్ కూడా పాల్గొన్నారు.
టీనేజ్ యువకుడు తనపై, తన భాగస్వామిపై దాడి చేసేందుకు యత్నించడంతో తాను కాల్పులకు దిగానని నేల్‌పై కాల్పులు జరిపిన పోలీసు అంతర్గత విచారణలో వెల్లడించినట్లు సమాచారం.
పోలీసుల దుశ్చర్యను ఖండిస్తూ.. వేలాది మంది ప్రజలు ఆందోళనలు చేపడుతున్నారు. పారిస్ శివారు ప్రాంతమైన నానెట్‌ల్‌తో పాటు పలు పట్టణాలకు ఈ నిరసనలు వ్యాపించాయి. వరుసగా రెండు రోజులు ఆందోళనకారులు పలు వాహనాలకు, అధికారిక భవనాలకు నిప్పటించారు. ఇప్పటివరకు 180 మందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.