Aug 13,2022 07:32

భారత స్వాతంత్య్రోద్యమం మన దేశ చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టం. ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితం. అశేష ప్రజానీకం కుల, మత, భాషా, ప్రాంతీయ భేదాలకతీతంగా ఐక్యంగా పాల్గొన్నారు. ఆ ఉద్యమంలో ప్రధాన, నాయకత్వ పాత్ర నేషనల్‌ కాంగ్రెస్‌ పోషించింది. అదే సమయంలో కమ్యూనిస్టులు అమోఘమైన పాత్ర పోషించారు. కాని తమదే నిజమైన దేశభక్తి అని ప్రచారం చేసుకునే ఆర్‌ఎస్‌ఎస్‌ కు...జాతీయోద్యమంలో చెప్పుకోదగిన పాత్ర అంటూ ఏమీ లేదు. సంఫ్‌ు పరివార్‌కు వున్నదంతా...ఆ ఉద్యమాన్ని దెబ్బతీయడానికి బ్రిటిష్‌ వలస పాలకులతో చేయి కలిపి కుమ్మక్కైన చరిత్రే.

నేడు 75 సంవత్సరాల స్వాతంత్య్ర ఉత్సవాలు జరుగుతున్నాయి. అవి జరిగే సమయంలో ఆనాడు విద్రోహపూరిత పాత్ర పోషించిన హిందూత్వ శక్తులే కేంద్రంలో అధికారంలో ఉండడం దేశం ముందున్న అత్యంత విషాద ఘట్టం.
     ఆర్‌ఎస్‌ఎస్‌ గాని, హిందూ మహాసభ కాని స్వాతంత్య్రోద్యమంలో ఏనాడూ, ఏ దశలోనూ పాల్గొనలేదు. ఈ కాలం అంతా ముస్లింలను దేశ వ్యతిరేకులుగా చిత్రీకరిస్తూ ప్రచారం చేయడం, మత కల్లోలాలను రెచ్చగొట్టడం వారి కార్యక్రమంగా పెట్టుకున్నారు. నిజానికి స్వాతంత్య్రోద్యమంలో అన్ని దశల్లోనూ ముస్లింలు ముఖ్యమైన పాత్రనే పోషించారు. త్యాగాలకు ముందున్నారు.
     సావర్కర్‌ ను 'గొప్ప దేశభక్తుడు' అని ఆర్‌ఎస్‌ఎస్‌ కీర్తిస్తుంది. అతడి చరిత్ర ఏమిటి? తొలి నాళ్ళలో హిందూ తీవ్రవాద సంస్థలు సాయుధ దళాలను తయారు చేసి బలప్రయోగం ద్వారా ఈ దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలని ప్రయత్నించాయి. ఆ విధమైన తీవ్రవాద కార్యకలాపాలకు గాను బాబారావ్‌ అనే హిందూ నాయకుడికి యావజ్జీవ శిక్ష విధించారు. శిక్ష విధించిన అధికారి విలియం కర్జన్‌ వైల్‌. అతనిని చంపి ప్రతీకారం తీర్చుకోవడానికి కుట్ర పన్నారు. దానికి సూత్రధారి వి.డి సావర్కర్‌. తన అనుచరుడైన మదన్‌లాల్‌ ధింగ్రాను పురికొల్పి హత్య చేయించాడు సావర్కర్‌ (1909 జులై 1వ తేదీన). తీవ్రవాద కార్యకలాపాలమీద విచారణకు ఆదేశించిన జాక్సన్‌ అనే అధికారిని కూడా హత్య చేయించిన కుట్ర సావర్కర్‌ దే. 1909 డిసెంబర్‌లో జాక్సన్‌ హత్య జరిగింది. ఈ రెండవ హత్య కేసులో సావర్కర్‌కు యావజ్జీవ శిక్ష పడింది. 1911 జులై 4న అండమాన్‌ పంపారు. అప్పుడు సావర్కర్‌ బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని క్షమాభిక్ష కోరుతూ అర్జీ పంపాడు. ''ప్రభుత్వం ఏ విధంగా సేవ చేయమన్నా చేస్తాను....నన్ను విడుదల చేయడం ద్వారా మీరు పొందగలిగేంత, నన్ను జైలులో ఉంచడం ద్వారా పొందలేరు...'' అంటూ లొంగుబాటును ప్రదర్శించాడు. విడుదలైన తర్వాత 1925లో ఆర్‌ఎస్‌ఎస్‌ స్థాపించాడు. ఆ తర్వాత ఒక సందర్భంలో రాసిన వ్యాసం మత ఘర్షణలను రెచ్చగొట్టేవిధంగా ఉందంటూ బ్రిటిష్‌ ప్రభుత్వపు జిల్లా మెజిస్ట్రేట్‌ ఒక తాఖీదు కూడా పంపాడు. అందులో 'స్వరాజ్య' అన్న పదం వాడినందుకు అభ్యంతరం పెట్టాడు. దానికి సమాధానంగా సావర్కర్‌ ఆ పదం వాడినందుకు క్షమాపణ కోరాడు. హత్యలకు కుట్రలు పన్నడమే తప్ప ప్రత్యక్షంగా భాగస్వామి కాలేదు.
    1948 జనవరి 30న గాంధీజీని నాధూరాం గాడ్సే హత్య చేశాడు. గాడ్సే ఆర్‌ఎస్‌ఎస్‌ బౌద్ధిక కార్యకర్త. ఆ హత్యకు సూత్రధారి సావర్కర్‌. ఈ విషయాన్ని ఆ కేసులో అప్రూవర్‌గా మారిన దిగంబర్‌ బాగ్డే తన సాక్ష్యంలో చెప్పాడు. ఐతే అప్రూవర్‌ సాక్ష్యం బట్టి శిక్ష విధించడం కుదరదు కనుక సావర్కర్‌ శిక్ష నుండి తప్పించుకున్నాడు.
1939లో రెండో ప్రపంచ యుద్ధం మొదలవగానే సావర్కర్‌ వైస్రాయి లార్డ్‌ లిన్‌లిత్‌గో ను కలిసి హిందువుల మద్దతు తీసుకోవాలని కోరాడు.
1942లో కాంగ్రెస్‌ 'క్విట్‌ ఇండియా' తీర్మానం చేసినప్పుడు దానిని ఆర్‌ఎస్‌ఎస్‌ బహిరంగంగానే వ్యతిరేకించింది. తన సభ్యులెవరూ ఆ ఉద్యమంలో పాల్గొనరాదని, బ్రిటిష్‌ ప్రభుత్వానికి సహకరించాలని సర్క్చులర్‌ పంపింది.
హిందువులు, ముస్లింలు రెండు వేరు వేరు జాతులని, రెండింటి ప్రయోజనాలు పరస్పరం శతృపూరితమైనవని సిద్ధాంతం తెచ్చింది సావర్కర్‌. ఆ తర్వాత దానిని జిన్నా కూడా అందుకుని పాకిస్తాన్‌ నినాదం ముందుకు తెచ్చాడు. దానిని సమర్ధిస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవహరించింది.
1946-48 మధ్య దేశంలో వివిధ ప్రాంతాల్లో మత కల్లోలాలు చెలరేగాయి. వీటన్నింటిలో ఆర్‌ఎస్‌ఎస్‌ పాత్ర ఉన్నట్టు సాధికారిక నివేదికలు స్పష్టం చేశాయి.
     కాశ్మీర్‌కు వున్న రాష్ట్ర ప్రతిపత్తిని, 370 అధికరణను రద్దు చేయడం గొప్ప విజయంగా మోడీ ప్రభుత్వం చెప్పుకుంటోంది. కాశ్మీర్‌ను ఈ చర్యల ద్వారా దేశంలో అంతర్భాగం చేసినట్టు చెప్పుకుంటోంది. కాని వాస్తవానికి 1947లో కాశ్మీర్‌ను పాలించిన రాజు హరిసింగ్‌ భారతదేశంలో విలీనం చేయడాన్ని వ్యతిరేకించాడు. అప్పుడు అతడిని సమర్ధించింది హిందూ మహాసభ. అక్కడ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ షేక్‌ అబ్దుల్లా నాయకత్వంలో భారతదేశంలో విలీనం చేయాలని ఉద్యమించింది. ఆ ఉద్యమాన్ని కూడా హిందూ మహాసభ వ్యతిరేకించింది.
    నైజాం ప్రభువు హైదరాబాద్‌ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి వ్యతిరేకంగా ఉన్నాడు. ఆ నైజాం మీద కమ్యూనిస్టుల నాయకత్వంలో ప్రజలు పోరాడుతున్నారు. ఆ పోరాటానికి ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతునివ్వలేదు సరికదా మత విద్వేషాలు రెచ్చగొట్టి ఉద్యమాన్ని చీల్చడానికి ప్రయత్నించింది. ఆ తర్వాత నైజాం కమ్యూనిస్టుల ధాటికి తట్టుకోలేక విదేశాలకు పారిపోయాడు. అప్పుడు భారత సైన్యం వచ్చి కమ్యూనిస్టులను ఊచకోత కోసింది. 4000 మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఉద్యమ నేతలతో శాంతియుత చర్చలు జరిపి హైదరాబాద్‌ ను దేశంలో విలీనం చేయడానికి ప్రయత్నించవలసిన ప్రభుత్వం క్రూరంగా వ్యవహరించింది. ఆ సైనిక చర్యను తెలంగాణ విముక్తి దినం అని చెప్పి సంబరాలు చేసుకుంటుంది ఆర్‌ఎస్‌ఎస్‌.
    ఇప్పుడు ప్రతి ఇంటి మీదా త్రివర్ణ పతాకం ఎగరాలని హడావుడి చేస్తోంది మోడీ ప్రభుత్వం. కాని ఆర్‌ఎస్‌ఎస్‌ మొదటి నుండీ ఈ జాతీయ జెండాను గుర్తించడానికి నిరాకరించింది. 2000 తర్వాత మాత్రమే జాతీయ జెండా విషయంలో వైఖరి మార్చుకుంది. భారత రాజ్యాంగాన్ని కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ అంగీకరించదు. దానిని విదేశీ రాజ్యాంగంగా పరిగణిస్తుంది. మనుధర్మ శాస్త్రమే మన దేశానికి రాజ్యాంగంగా ఉండాలన్నది ఆర్‌ఎస్‌ఎస్‌ వైఖరి.
    జాతీయోద్యమానికి ద్రోహం చేసిన హిందూత్వ శక్తులే నేడు అధికారంలో ఉంటూ ఆ జాతీయోద్యమ లక్ష్యాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. ఆ నాటి ప్రజల ఆకాంక్షలను కొంతమేరకైనా భారత రాజ్యాంగం ప్రతిబింబిస్తున్నది. ముఖ్యంగా ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, సామాజిక న్యాయం, ఫెడరలిజం, స్వావలంబన అనే లక్ష్యాలను రాజ్యాంగం స్వీకరించింది. నేడు ఆ లక్ష్యాలనే దెబ్బ తీసి మళ్ళీ సామ్రాజ్యవాదుల తొత్తుగా దేశాన్ని దిగజార్చడానికి హిందూత్వ శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఈ పరిస్థితులలో జాతీయోద్యమానికి నిజమైన వారసులైన కార్మిక, కర్షక పీడిత ప్రజల తరఫున కమ్యూనిస్టులు నిలవాలి. ఆ నాటి జాతీయోద్యమ స్ఫూర్తిని ప్రజలలో మళ్ళీ రగిలించాలి. ఆనాటి విశాల ఐక్యతను మళ్ళీ నిర్మించాలి. ఈ 75 ఏళ్ళ స్వాతంత్య్రాన్ని పరిరక్షించుకోవాలి.