Jan 15,2023 11:19
  • విచ్చలవిడిగా గుండాట, మూడు ముక్కలాట
  • చేతులు మారిన రూ. వందలకోట్లు !
  • ప్రేక్షకపాత్రలో పోలీసులు

ప్రజాశక్తి - యంత్రాంగం : ఉభయ గోదావరి జిల్లాల్లో యథేచ్ఛగా కోడిపందేలు సాగాయి. బరుల వద్ద గుండాట, మూడు ముక్కలాట, పేకాట సైతం విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. పందేలను అడ్డుకుంటామని నిన్నటి వరకూ బీరాలు పలికిన పోలీసులు భోగి రోజున చేతులెత్తేశారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ప్రతి మండలంలో సరాసరిన పదికిపైగా బరుల్లో కోడిపందేలు కొనసాగాయి.కాళ్ల మండలం సీసలిలో ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, బుట్టాయగూడెం మండలం దుద్దుకూరులో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, పెదవేగి మండలం కొండలరావుపాలెంలో దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బాయి చౌదరి, జడ్‌పి చైర్మన్‌ కవురు శ్రీనివాస్‌, పాలకొల్లులో మాజీ ఎమ్మెల్యే మేకా శేషుబాబు కోడిపందేల్లో పాల్గొన్నారు. పెద్దపెద్ద బరుల్లో ఒక్కో పందానికి రూ.ఐదులక్షల నుంచి రూ.పది లక్షలు వరకూ బెట్టింగ్‌ సాగుతోంది. మధ్యాహ్నం నుంచి గుండాట, మూడు ముక్కలాటలను నిలుపుదలచేయాలని పోలీసులకు ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. బరుల ప్రాతిపదికన ప్రతి పోలీస్‌స్టేషన్‌కు రూ.ఏడు లక్షల నుంచి రూ.ఎనిమిది లక్షలు మామూళ్ల రూపంలో పందేల నిర్వాహకులు అందించినట్లు ప్రచారం సాగుతోంది. భీమవరం ప్రాంతంలోని డేగాపురంలో కోడిపందేలను చూసేందుకు సినీ హీరో కిరణ్‌ అబ్బవరం హాజరయ్యారు. పందేల్లో ఎక్కువగా స్థానిక అధికార, ప్రతిపక్ష నాయకులే కీలకంగా వ్యవహరిస్తున్నారు. తొలిరోజు దాదాపుగా రూ.50 కోట్లకు పైగా పందేల రూపంలో బెట్టింగ్‌ సాగినట్లు ఆంచనా వేస్తున్నారు. రెండు జిల్లాల్లోనూ 47 మండలాల్లో 400కుపైగా బరుల్లో కోడిపందేలు సాగుతున్నట్లు అంచనా. తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాలో ఎప్పటిలానే కోడిపందాలు జరిగాయి. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం జార్జిపేటలో అతిపెద్ద బరిని ఏర్పాటు చేశారు. ఇక్కడ పాస్‌ ఉన్నవారినే లోపలికి అనుమతిస్తున్నారు. ఈ బరి వద్ద ప్రత్యేక డైనింగ్‌ హాల్‌ను సైతం నిర్వాహకులు ఏర్పాటు చేశారు. రాత్రి కూడా పందేల నిర్వహణకు తగ్గట్టుగా ఫ్లడ్‌ లైట్లను ఏర్పాటు చేశారు.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా తొలిరోజు రూ.40 నుంచి రూ.60 కోట్ల వరకూ చేతులు మారినట్టు సమాచారం.
 

                                                            కోనసీమలో తగ్గిన జోరు

డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో గతంతో పోల్చుకుంటే కోడిపందేలు జోరు తగ్గింది. జిల్లాలోని ప్రజాప్రతినిధులు అందరూ కోడిపందేల నిర్వహణ కోసం అమలాపురంలో వైసిపి ఎంఎల్‌ఎలు మంత్రి పినిపే విశ్వరూప్‌ ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశమయ్యారు. అనుమతులు ఇవ్వాలని, కఠినంగా వ్యవహరిస్తున్న ఎస్‌పికి కళ్లెం వేయాలని ఉభయ గోదావరి జిల్లాలో పరిశీలకుడు ఎంపి మిథున్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
              కోడిపందేలను అడ్డుకుంటే ప్రభుత్వమే చూసుకుంటుంది అంటూ రాజోలు ఎమ్మెల్యే రాపాక, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సమావేశం అనంతరం ప్రకటించారు. ఎస్‌పి ఆధ్వర్యంలో పోలీసు బృందాలు వాహనాల్లో తిరుగుతూ పందేలను కట్టడి చేశాయి. రాజకీయ నాయకుల అండతో కొన్ని చోట్ల కోడిపందేలు జరిగాయి.