- ధరాఘాతంతో తగ్గిన నికర వసూళ్లు
- డిపాజిట్లు తక్కువ..ఉపసంహరణలే ఎక్కువ
- 11 ఏళ్లలో తొలిసారి పతనం
న్యూఢిల్లీ : దేశంలో ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలు ప్రజల పొదుపు శక్తిని కుంగదీస్తున్నాయి. కాయకష్టం చేసి కాసోకూసో పొదుపు చేసుకునే సామాన్యులకు ధరాఘాతంతో పొదుపు ఊసే లేకుండాపోతుంది. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో నికర వసూళ్లు తగ్గడమే ఇందుకు నిదర్శనం. పేద, మధ్య తరగతి వారు అత్యధికంగా పొదుపు చేసే పథకాల్లో దశాబ్దం కాలంలో ఎప్పుడూ లేని విధంగా డిపాజిట్లు పడిపోయాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం (2022ా23)లో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్‌ఎస్‌సి), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్) వంటి చిన్న పొదుపు పథకాల నికర వసూళ్లు రూ.3.04 లక్షల కోట్లకు పడిపోయాయి. డిపాజిట్ల కంటే ఉపసంహరణలే ఎక్కువగా ఉండటం గమనార్హం. గత 11 ఏళ్లలో నికర వసూళ్లలో తగ్గుదల చోటు చేసుకోవడం తొలిసారి. 2021-22లో రూ.3.33 లక్షల కోట్ల డిపాజిట్లు నమోదయ్యాయి.
2022-23లో నికర వసూళ్లలో పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్నాటక అగ్రస్థానంలో నిలువగా, ఆ తర్వాత స్థానాల్లో బీహార్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరి, తెలంగాణ, మిజోరం, హిమాచల్ ప్రదేశ్ ఉన్నాయి. ఇవికాకుండా మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ, దాద్రా, నగర్ హవేలీ మినహా అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ చిన్న మొత్తాల నికర వసూళ్లు భారీగా పడిపోయాయి.
1999 నుంచి చిన్న పొదుపు పథకాల క్రింద వచ్చిన అన్ని డిపాజిట్లను నేషనల్ స్మాల్ సేవింగ్స్ ఫండ్స్ (ఎన్‌ఎస్‌ఎస్‌ఎఫ్)లో జమ చేస్తున్నారు. కరోనాకు ముందూ, తర్వాత కూడా కేంద్రం చాలా కాలం పాటు చిన్న మొత్తాలపై వడ్డీ రేట్లను పెంచకుండా యథాతథంగా కొనసాగించడం, కొన్ని సందర్భాల్లో తగ్గించడం వంటి చర్యలకు పాల్పడింది. దీని ప్రభావం చిన్న మొత్తాలపై తీవ్రంగా పడిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. చిన్న మొత్తా పొదుపుపై మోడీ సర్కార్ కక్షపూనిందంటూ విమర్శలు వెల్లువెత్తడంతో 2022-23 మార్చి త్రైమాసికంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ వడ్డీ రేట్లను స్వ్పలంగా పెంచింది. ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వరుసగా 6.6 శాతం, 6.8 శాతం, 6.9 శాతం చొప్పున వడ్డీని అందించింది. కానీ పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను పదేపదే పెంచేస్తూపోవడం, నిత్యావసరాల ధరలు తగ్గించేందుకు ఎటువంటి చర్యలేవీ చేపట్టకపోవడం వల్ల ప్రజల ఆర్థిక పరిస్థితులు కుచించుకుపోయాయి. కోవిడ్ నేపథ్యంలో కోట్లాది మంది ప్రజలు జీవనోపాధులు దెబ్బతినడం, గ్రామీణ భారతావనిలో కాస్తయినా బతుకు భరోసా కల్పిస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి తగిన నిధులు కేటాయించకుండా దానిని నిర్వీర్యం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అనేక ఆంక్షలు, డిజిటల్ ఇబ్బందులు సృష్టించడంతో ఈ ఏడాది 5 కోట్ల మంది పైగా కార్మికుల పేర్లను ఉపాధి కార్డుల నుంచి కేంద్రం తొలగించింది. కేంద్ర ప్రభుత్వ వినాశకర చర్యల వల్లే ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి..ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలపై భారాలు తగ్గింపు చర్యలు చేపట్టకపోతే సంక్షోభం మరింత తీవ్రతరమవుతుందని హెచ్చరిస్తున్నారు.










