న్యూఢిల్లీ : న్యూస్ క్లిక్ వెబ్‌సైట్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న విష ప్రచారాన్ని నాలుగు మీడియా సంఘాలు ఖండించాయి. ఈ విధమైన ప్రచారం అసమంజసమైనదిగా విమర్శించాయి. మీడియా సంస్థలు దేశభక్తి లేనవి లేదా ఏ విదేశీ సాధనాలు కావని స్పష్టం చేశాయి. ఈ మేరకు నాలుగు మీడియా సంఘాలు ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఉమెన్స్ ప్రెస్ కార్ప్స్, ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్, ప్రెస్ అసోసియేషన్ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. 'న్యూస్‌క్లిక్ సంస్థ సమగ్రత, అనుభవం ఉన్న వ్యక్తుల సహకారంతో నడుస్తున్నది. ఈ సంస్థ ప్రచురించే ప్రభుత్వ విధానాలపై విమర్శనాత్మకమైన కథనాలను తప్పుగా భావించ కూడదు. వాటిని దేశ వ్యతిరేక లేదా దేశ ద్రోహంగా ముద్ర వేయకూడదు' అని ప్రకటనలో తెలిపాయి. ఒకవేళ న్యూస్‌క్లిక్ యొక్క నిధుల మూలాలపై ప్రభుత్వం విచారణ చేస్తున్నట్లయితే... ఈ విధమైన విచారణను ఇతర మీడియా సంస్థలకు కూడా వర్తింపచేయాలని, కేవలం న్యూస్‌క్లిక్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని విచారణ చేయకూడదని ప్రకటనలో తెలిపాయి. న్యూస్‌క్లిక్‌కు వ్యతిరే కంగా జరుగుతున్న ప్రచారంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. దేశంలో మీడియా సంస్థలు భారతీయ చట్టాలకు లోబడే పని చేస్తాయని, ప్రభుత్వ ఏజెన్సీలు కూడా ఈ ప్రమాణాలకు కట్టుబడి ఉండటం అంతే ముఖ్యమని ప్రకటనలో స్పష్టం చేశాయి.










