- మధ్యప్రదేశ్‌లో గిరిజనుల సమస్యలు పట్టని బిజెపి సర్కార్
- ఎక్కడ చూసినా భూస్వాముల సంఘానిదే పైచేయి
న్యూఢిల్లీ : గిరిజనులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ ఒకటి. ఇక్కడ పలు జిల్లాల్లో భూ యాజమాన్య హక్కులు పొందలేక గిరిజినులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎన్నికల సమయంలో ఎన్నో వాగ్దానాలు చేసిన బీజేపీ, ఇప్పుడు వారి సమస్యల పట్ల పూర్తి ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. సుకువాసా అనే గ్రామంలో 70శాతానికిపైగా గిరిజనులే నివసిస్తున్నారు. విచిత్రం ఏంటంటే గిరిజనుల్లో ఒక్కరంటే ఒక్కరికి భూమి హక్కును కలిగిలేరు. గ్రామంలోని 95శాతం సాగు యోగ్యమైన భూములు ఆ ఊరి పెత్తందార్ల చేతిలో ఉన్నాయి. భిల్లులు, భిలాలు, గోండులు..ఎన్నో ఏండ్లుగా భూ హక్కుల కోసం పోరాడుతున్నారు. దగ్గర్లో ఉన్న ఇండోర్‌కు వెళ్లి కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. మరికొంత మంది నైపుణ్యంలేని కార్మికులుగా బతుకు వెళ్లదీస్తున్నారు. కొద్ది మంది గిరిజనులకు కొంతమేరకు పంట భూములున్నా, తీవ్రమైన పేదరికంతో బాధలు పడుతున్నారు.
తమ గ్రామంలోని ఈ సమస్య గురించి హరిసింగ్ అనే 60 ఏండ్ల రైతు మాట్లాడుతూ, ''నా భూ యాజమాన్య పత్రాల కోసం విచారించిన ప్రతిసారీ, సంబంధిత అధికారి కాగితాలు సిద్ధమవుతున్నాయని చెబుతున్నారు. మా సర్పంచిని కలిసినా ఫలితం లేదు. ఈ సమస్య దశాబ్దాలుగా కొనసాగుతోంది'' అని ఆవేదన వ్యక్తం చేశారు. మరో గ్రామస్థడు నర్సింగ్ దావ్రా మాట్లాడుతూ, ''పెత్తందార్లు తమ డబ్బు, అధికారాన్ని ఉపయోగించి భూ యాజమాన్య పత్రాలను లాక్కుంది. పర్వతాపురా పంచాయతీ నుండి ఒక సామాజికవర్గం వారే సర్పంచ్‌గా ఎన్నికవుతున్నారు. కారణం వారు ధనవంతులు, శక్తివంతులు. గిరిజనులకు భూ యాజమాన్య హక్కులు రాకుండా చేస్తున్నారు'' అని ఆరోపించారు. భూ యాజమాన్యాన్ని తెలిపే కాగితాలు లేకపోవటం వల్ల అనేకమంది గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారని స్థానిక మీడియాలో వార్తా కథనాలు వచ్చాయి.ఈ రాష్ట్రంలోని గ్రామాల్లో పెత్తందార్లకు ప్రభుత్వ వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. వారికి అధికార బీజేపీతో బలమైన సంబంధాలున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో భూ యాజమాన్య హక్కులకు సంబంధించి పత్రాల అందజేత నిలిచిపోయింది. ప్రతి గ్రామంలో 'భూస్వాముల సంఘం' అనేది ఒకటుంది. ప్రభుత్వ పథకాలను సైతం వీరే నిర్దేశిస్తున్నారు. సుకువాసా గ్రామంలో చాలామంది గిరిజనులకు నరేగా కార్డులు లేవు. పథకంలో ఎలా చేరాలన్నది తెలియదు. పలు గ్రామాల్లో ఉపాధి హామీ పనులను పెత్తందార్లు, భూస్వాములు చేపడుతున్నారని, యంత్రపరికరాలతో ఆ పనుల్ని పూర్తిచేస్తున్నారని వార్తా కథనాలు వెలువడుతున్నాయి.










