Aug 01,2023 13:03

విశాఖ : విశాఖలోని కైలాసపురం వద్ద ఇనార్బిట్‌ మాల్‌కు సిఎం వైఎస్‌.జగన్‌ భూమి పూజ చేశారు. మంగళవారం ఉదయం విశాఖపట్నానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్‌కు నేతలు, కార్యకర్తలు, ప్రజలు పూలవర్షంతో స్వాగతం పలికారు. ఇనార్బిట్‌ మాల్‌ కు భూమి పూజ అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడుతూ ... ఇనార్బిట్‌ మాల్‌తో 8 వేల మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు. రెండున్నర ఎకరాలను ఐటీ కోసం కేటాయిస్తారని.. విశాఖలో ఒక ఆణిముత్యంగా నిలిచిపోయే ప్రాజెక్టు అని తెలిపారు. విశాఖ అభివృద్ధికి ఈ మాల్‌ దోహదపడుతుందని.. మాల్‌ నిర్మాణంతో విశాఖ రూపురేఖలు మారిపోతాయని అన్నారు. ఫైవ్‌ స్టార్‌ హౌటల్‌ కూడా నిర్మించాలని రహేజా గ్రూప్‌ ఆసక్తిగా ఉందని సిఎం చెప్పారు. రహేజా గ్రూప్‌కు అన్ని విధాలుగా సపోర్టు ఇస్తామని, ఒక్క ఫోన్‌కాల్‌తో అందుబాటులో ఉంటాం అని ముఖ్యమంత్రి జగన్‌ హామీ ఇచ్చారు.

                                          రూ.135.88 కోట్ల విలువైన 50 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు...

ఇనార్బిట్‌ మాల్‌కు భూమి పూజ కార్యక్రమం అనంతరం నగరంలో జీవీఎంసీ చేపడుతున్న మౌలిక సదుపాయాలు, రహదారులు, ముఖ్య కూడళ్ల అభివృద్ధి, స్మార్ట్‌ రోడ్డు, యూరోపియన్‌ తరహా ఈట్‌ స్ట్రీట్స్‌, అమృత్‌ 2.0లో భాగంగా చెరువుల అభివృద్ధి లాంటి రూ.135.88 కోట్ల విలువైన 50 పనులకు ముఖ్యమంత్రి జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం క్యాంపస్‌ చేరుకొని విద్యార్థులకు కొత్త కోర్సులు, ఉపాధి అవకాశాలు, స్టార్టప్‌లకు చేయూతనందించేలా రూ.129 కోట్లతో నిర్మించిన ఐదు భవనాలను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 1.20 గంటలకు బీచ్‌ రోడ్డు నుంచి బయలుదేరి 1.40కి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.50 గంటలకు విశాఖ నుంచి సిఎం జగన్‌ తిరుగు పయనమవుతారు.

                                                          2026 నాటికి అందరికీ అందుబాటులో మాల్‌ ...

దేశంలోనే అతి పెద్ద ఇనార్బిట్‌ మాల్‌ ను 17 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో మూడు దశల్లో కె.రహేజా గ్రూపు అభివృద్ధి చేయనుంది. ఈ ఇనార్బిట్‌ మాల్‌ తొలి దశ పనులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు భూమి పూజ నిర్వహించారు. సుమారు రూ.600 కోట్ల వ్యయంతో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇనార్బిట్‌ మాల్‌ నిర్మాణం కానుంది. దీనికి అదనంగా పార్కింగ్‌ కోసం ఏకంగా నాలుగు లక్షల చదరపు అడుగులను అభివృద్ధి చేయనున్నారు. 2026 నాటికి ఈ మాల్‌ను అందుబాటులోకి తేవాలని రహేజా గ్రూపు నిర్దేశించుకుంది. 250కిపైగా అంతర్జాతీయ బ్రాండ్లకు ఈ మాల్‌ వేదిక కానుంది.

                                                                   మూడు దశలుగా మాల్‌ నిర్మాణం..

ఈ మాల్‌ ద్వారా 8,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుందని అధికారులు తెలిపారు. మాల్‌ నిర్మాణం కోసం పోర్టు అథారిటీకి చెందిన 17 ఎకరాలను 30 ఏళ్ల పాటు లీజుకు తీసుకున్నారు. రెండో దశలో ఐటీ క్యాంపస్‌ను అభివృద్ధి చేస్తారు. 3,000 మంది పనిచేసే విధంగా సుమారు 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ క్యాంపస్‌ను 2027 నాటికి అందుబాటులోకి తెస్తారు. మూడో దశలో ఫోర్‌ స్టార్‌ లేదా ఫైవ్‌ స్టార్‌ హౌటల్‌ను 200 గదులు, బాంకెట్‌ హాళ్లతో నిర్మిస్తారు. పూర్తి పర్యావరణహితంగా భవనాన్ని నిర్మించనున్నట్లు రహేజా గ్రూపు వెల్లడించింది.