Oct 09,2023 22:05
  • దాదాపు రూ.6 కోట్ల తప్పుడు బిల్లుల సృష్టి
  • అక్రమంగా రూ.55 లక్షల పన్ను రాయితీలు
  • హీరో మోటో షేర్ల పతనం

న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటో కార్ప్‌ ఛైర్మన్‌ పవన్‌ ముంజల్‌ ఫోర్జరీకి పాల్పడ్డారని అరోపణలు వచ్చాయి. తప్పుడు బిల్లులతో ప్రభుత్వ రాయితీలు పొందడంతో ముంజల్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. సంస్థ ఖాతాల్లో రూ.5.96 కోట్ల లావాదేవీలపై తప్పుడు లెక్కలు రాయడం, మోసపూరితంగా వ్యవహరించినందుకు ఫోర్జరీ కింద ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. అబద్దపు బిల్లులు సృష్టించి రూ.55.5 లక్షల పన్ను రాయితీలను పొందారని ప్రధాన అరోపణ. 2000-2010 మధ్య పవన్‌ ముంజాల్‌ నెలవారీగా రూ.5,94,52,525 విలువైన తప్పుడు బిల్లులు సృష్టించారు. ఈ బిల్లుల పేరుతో ఇంతే మొత్తం నగదు బ్యాంకు ఖాతాల నుంచి ఉపసంహరించుకున్నారు. దీంతో రూ.55,51,777 పన్ను రాయితీని పొందడం ద్వారా ఐటి శాఖను మోసగించారని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. పవన్‌ ముంజల్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు కావడంతో సోమవారం బిఎస్‌ఇలో హీరో మోటో కార్ప్‌ షేర్లు 2.50 శాతం పతనమై రూ.2,960 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ.2,925కు పడిపోయింది.
పవన్‌ ముంజల్‌ మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలతొ గత ఆగస్టులో ఆయన నివాసాలు, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) తనిఖీలు చేసింది. 2018లోనూ లండన్‌లో పవన్‌ ముంజాల్‌ వ్యాపార పర్యటన కోసం థర్డ్‌ పార్టీ సేవల సంస్థ అధికారిని నియమించుకుంది. ఆ థర్డ్‌ పార్టీ సంస్థ అధికారి లండన్‌ బయలుదేరి వెళుతుండగా, సదరు అధికారి బ్యాగ్‌లో రూ.81 లక్షలకు పైగా విదేశీ కరెన్సీ ఉందని కస్టమ్స్‌ అధికారుల తనిఖీల్లో గుర్తించారు. దీంతో విదేశీ మారకపు నిర్వహణ చట్టం కింద ఈ కరెన్సీని కస్టమ్స్‌ అధికారులు జప్తు చేసి, కేసు నమోదు చేశారు. దీని ఆధారంగానే ఇడి తనిఖీలు నిర్వహించింది. ఇంతక్రితం కూడా పన్ను ఎగవేత కేసులో గతేడాది మార్చిలో పవన్‌ ముంజాల్‌ నివాసాలు, ఆఫీసుల్లో ఆదాయం పన్ను అధికారులు తనిఖీలు జరిపారు.