May 15,2023 08:51

      'పుస్తకం పిల్లల చేతిలో అలంకారంగా మారాలి అని పరితపించే రచయిత నారంశెట్టి ఉమామహేశ్వరరావు. ఆయన కలం నుంచి వెలువడే బాలల కథల సంపుటే 'వన దేవత తీర్పు'. ఈ సంపుటిలో ఇరవై కథలున్నాయి. ప్రతి కథ సమాజ హితంతో బాలల శ్రేయస్సు కోరి రాసినదే. కొన్ని కథలు నీతిని ప్రబోధిస్తే మరికొన్ని హేతువాద దృక్పథం కలిగిస్తాయి. ఇంకా కొన్ని కథలు పిల్లల్లో ఆలోచన రేకెత్తించేవిగా ఉన్నాయి. కథల్లో విజ్ఞానం వినోదం సరేసరి !
          'సామాన్యుడి సమస్య' కథ సామాన్యుడి సమస్యను తేలికగా తీసుకుని పట్టించుకోకపోతే ఆ సమస్య పెద్దదై సమస్యను పట్టించుకోని పెద్దలకు పెను సవాల్‌గా మారగలదని చెబుతుంది. 'కుందేలు ప్రచారం - నక్క మోసం' కథ భ్రమపడిన సంఘటన ఎలా ప్రచారమై ఒక మూఢనమ్మకంగా మారుతుందో విశదీకరిస్తుంది. లోకంలో సాధారణంగా మహిమల ప్రచారం ఇలాగే కొనసాగుతాయన్న సత్యాన్ని కథ ద్వారా చెప్పి పిల్లల్లో హేతువాద దృక్పథం కలిగించడానికి రచయిత ప్రయత్నించారు. హేతువాద దృష్టితో రాసిన మరో కథ 'వదల బొమ్మాళీ...వదల'. ఈ కథలో ఒక ఊరి చివర చింత చెట్టుపై భూతముందని నిరక్షరాస్యులైన ఆ ఊరి ప్రజల్లో నమ్మకం కలిగిస్తాడు ఒక భూత వైద్యుడు. ఆ భూతం పోవడానికి పూజ చేస్తానంటాడు. అందుకు ఐదు వేల రూపాయలు ఇమ్మంటాడు. అంతలో ఆ ఊరి బడిపంతులు వచ్చి భూతం గుట్టు రట్టు చేసి అలా మోసపోవడానికి చదువు లేక పోవడమే కారణమని చెప్పి పిల్లలను బడికి పంపించేలా ఆ ప్రజల మనస్సులను మార్చుతాడు. భూతం గుట్టు ఎలా రట్టయిందో తెలుసుకోవాలంటే ఆ కథ చదివి తీరాల్సిందే.
          మరికొన్ని కథల్లోని వెళ్తే... మోసం చేయ బోయి మంత్రి పన్నిన యుక్తితో దొరికిపోయిన మోసగాళ్ళ కథ 'మరచెంబు సాక్ష్యం.' మరొక కథ 'సార్ధకత'. ఈ కథలో ఇతరులకు మేలు చేసే వారి జీవితం ధన్యమని చెప్పడానికి మర్రి గింజతో కథ నడిపి రచయిత కృతకృత్యులయ్యారు. 'అపోహ అంటే' కథ ద్వారా పిల్లల్లో శాస్త్రీయ దృక్పథం కలిగించడానికి రచయిత ప్రయత్నించారు. బల్లి పడిన ఆహారం విష మయం కాదని, బల్లి సూర్యకాంతి తగలని ప్రాంతంలో ఉండడం వల్ల దాని చర్మంపై 'సొల్మొనెల్లా' రకానికి చెందిన బ్యాక్టీరియా విపరీతంగా పెరుగుతుందని అది ఆహారంలో కలియడం వల్ల ఆ ఆహారం తిన్న వారికి వాంతులు, విరేచనాలు అవుతాయని చెప్పడం బాగుంది.
       'మాట తీరు' వ్యక్తిత్వ వికాస కథ. 'కుక్క తోక' సామాజిక న్యాయం చెప్పే కథ. 'వనదేవత తీర్పు' ఫాంటసీ కథ. ఎవరికీ ఆశ పెట్టి మోసపరచరాదని చెప్పే కథ. ఇలా 'వనదేవత తీర్పు' బాలల కథా సంపుటిలో ప్రతి కథ బాలల మానసిక వికాసానికి తోడ్పడేదే. ప్రతి కథకు ముందు చక్కని రంగుల బొమ్మతో పిల్లల మనసులను కథ వైపు ఆకట్టుకునేలా చేసే తీరులో తుంబలి శివాజీ చిత్రాలు ఉన్నాయి. ఒక మంచి పుస్తకం ప్రచురించిన నవ తెలంగాణ పబ్లిషింగ్‌ హౌస్‌ వారికి, పుస్తక రచయిత నారంశెట్టి ఉమా మహేశ్వరరావు గారికి అభినందనలు.
 

- బెలగాం భీమేశ్వరరావు
99895 37835