దీపాలక్ష్మి సాధారణ గృహిణి. చెన్నై నుంగంబక్కంలో నివసిస్తోంది. కుటుంబ బాధ్యతల్లో తలమునకలై క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. కానీ, ఆమె చదువుకునే రోజుల్లో చురుకైన విద్యార్థిని. పరీక్షల్లో ఎప్పుడూ టాప్ మార్కులే స్కోరు చేసేది. అయితే తనకు వచ్చిన పరిజ్ఞానాన్ని ఇతరులకు చెప్పేటప్పుడు మాత్రం తడబడేది. ఒకింత బెరుకు, భయం ఆమెను వెంటాడేవి. జువాలజీలో డిగ్రీ పట్టా పుచ్చుకున్నా పెళ్లి, పిల్లలతో కాలం గడుపుతోంది. ఇలాంటి మహిళలకు తోడుగా నిలిచింది శ్రద్ధా మాను ఫౌండేషన్. వారి ప్రతిభను ఉపయోగంలోకి తెస్తోంది.
దీపాలక్ష్మి మాదిరే జయచిత్ర పోలీస్ కానిస్టేబుల్ శిక్షణలో ఉత్తీర్ణత సాధించింది. కానీ పెళ్లి తరువాత ఉద్యోగం వద్దన్న అత్తింటి ఆంక్షలతో ఇంటికే పరిమితమైంది. ఇలా మనచుట్టూ ఎంతోమంది మహిళలు విద్యలో బాగా రాణించి, డిగ్రీ పట్టా పుచ్చుకుని కూడా ఇంటికే పరిమితమై ఉంటారు.

- ఇంగ్లీషు పేపరు చదువుతూ..
ఇప్పుడు అటువంటి వారంతా తమిళనాడులోని శ్రద్ధా మాను ఫౌండేషన్ తరపున నిర్వహించే ఓ బృహత్తర ప్రాజెక్టులో భాగమై మొట్టమొదటిసారి తమ డిగ్రీ పట్టాలకు అర్హమైన ఉద్యోగంలో భర్తలతో సమానంగా ఆర్జిస్తున్నారు. ఇది వారు ఊహించనిది. కాని ఇది సాధ్యమయ్యేలా చేశారు ఫౌండేషన్ నిర్వాహకురాలు మధుమతి నారాయణ్. 'సాధారణంగా ఇంటి పనులు చేసుకునే మహిళలను ఆ ఇంటివారు చాలా తక్కువగా చూస్తారు. పిల్లలు, భర్త, కుటుంబ బాధ్యతలతో సతమతమయ్యే వారంతా ఎంతో నైపుణ్యం కలవారని నాకు తెలిసేలా చేసింది మా ఇంటి సహాయకురాలు రమ్య. ఒకరోజు ఒక చేతిలో చీపురు, మరో చేత్తో ఇంగ్లీషు న్యూస్‌పేపరుతో రమ్య నాకు కనిపించింది. చెత్త వేయడానికి ఆ పేపరు వాడుతున్నావా.. నేను ఇంకా దాన్ని చదవలేదు. అక్కడ పెట్టు అని గట్టిగా చెప్పాను. కాని ఆమె 'నేను కూడా దీన్ని చదువుతున్నాను మేడమ్. ఈ ఆర్టికల్ చాలా బాగా రాశారు. అందుకే పని మధ్యలో చదువుతున్నాను' అని చెప్పింది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ప్రశ్నార్థకంగా చూస్తున్న నాతో 'నేను పోస్టుగ్రాడ్యుయేట్ చేశాను మేడమ్' అని చెప్పింది. ఆ సంఘటన నాలో ఎన్నో ఆలోచనలకు దారితీసింది. అప్పటి నుండి నా ఇంటి చుట్టుపక్కల ఉన్న గృహిణులను గమనించడం ప్రారంభించాను. డిగ్రీ పట్టాలు పుచ్చుకున్న ఎంతోమంది మహిళలు అమ్మలుగా, భార్యలుగా, అత్తింటి సేవలో తీరికలేకుండా గడుపుతున్నారు. వారి భర్తలు కనీసం ప్రాథమిక విద్య కూడా చదివి లేరు. రోజు కూలీకి వెళ్లే ఆ పురుషులు ఇంటి యజమానులుగా, ఈ మహిళలు వారి కనుసన్నల్లో మగ్గుతున్నారు. తమలో టాలెంట్ ఉన్నా దాన్ని గుర్తించని వ్యక్తుల మధ్య నిత్యం అవమానాలతో కాలం వెల్లదీస్తున్నారు. వారి శక్తిసామర్థ్యాలు గుర్తించి, తమ కాళ్లపై తాము నిలబడే భరోసా కల్పించాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నాను' అంటూ చెబుతున్నారు మధుమిత.

- 'బడి తరువాత'లో బీజం పడింది..
'బడి తరువాత' అనే ప్రోగ్రామ్‌ని ఫౌండేషన్ చాలా కాలంగా నిర్వహిస్తోంది. ప్రాథమిక అభ్యసనంతో పాటు పిల్లల అభిజ్ఞా, నైతిక, భావోద్వేగ, ఊహాత్మక, సామాజిక సామర్థ్యాలను వెలికితీయడమే లక్ష్యంగా ఈ ప్రోగ్రామ్ నడుస్తుంది. అమెరికాకు చెందిన హార్వర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్, సైకాలజిస్ట్ రూపొందించిన బహుళ మేథస్సు అభ్యసన కేంద్రంగా ఇది పనిచేస్తోంది. 2022-23 ఏడాదిలో 732 మంది విద్యార్థులు ఈ ప్రోగ్రామ్‌లో భాగస్వామ్యులయ్యారు. వచ్చే ఏడాదికి 2 వేల పైచిలుకు పిల్లలను భాగస్వామ్యులను చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు.
- 'ఉపాసన' బతుకు దారి చూపింది..
'పూర్తికాలం పనిచేసే టీచర్లు లేక 2019 ఏడాదిలో మా ప్రోగ్రామ్ నత్తనడకన సాగింది. విధుల్లో ఉన్న టీచర్లే 'బడి తరువాత' బాధ్యత తీసుకోవడం వల్ల వారిపై ఒత్తిడి పెరిగి ఈ ప్రోగ్రామ్ నుండి బయటికి వెళ్లిపోయారు. అప్పుడే నాకు ఈ టాలెంట్ గృహిణులు గుర్తుకువచ్చారు. అర్హత ఉండీ, అవకాశం లేక ప్రోత్సాహం కరువైన ఎంతోమంది ఈ మహిళలనే టీచర్లుగా తయారుచేయాలనుకున్నాను. 'ఉపాసన' పేరుతో టీచర్ శిక్షణా తరగతులను మొదలుపెట్టాం. ఆరు నెలల కాలపరిమితితో ఉచిత శిక్షణ ఇప్పించాం. ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వహించడం, కొన్ని ప్రత్యేక తరగతుల పిల్లలకు ఈ ట్రైనీ టీచర్లతో స్థానిక పాఠశాలల్లో పాఠాలు చెప్పించాం. శిక్షణ పూర్తయిన మహిళల్లో కొంతమంది ప్రోగ్రామ్‌తో సంబంధం లేకుండా సొంతంగా ఉపాధి అవకాశాలు పొందారు. అప్పుడు నాకు చాలా సంతోషమేసింది. నా లక్ష్యం అదే. ఆ మహిళలు ఇంటి నుండి బయటికి వచ్చారు. ఇప్పుడు వారికి ఓ ప్రత్యేక గౌరవం ఉంది. అలా మా 'ఉపాసన'లో శిక్షణ తీసుకున్న మహిళలు తొలిసారి వారి డిగ్రీ పట్టాలతో ఉపాధి పొందారు' అని సంతోషంగా చెబుతారు మధుమిత.

- నా భర్త బహుమతలు ఇస్తున్నారు..
'నేను బిఎస్‌సి కంప్యూటర్ సైన్స్ చేశాను. తమిళ మీడియంలో చదవడం వల్ల ఇంగ్లీషు రాక అవకాశాలు రాలేదు. 'ఉపాసన'లో చేరి ఇంగ్లీషుపై పట్టు సాధించాను. నాపై నాకు నమ్మకం ఏర్పడింది. ఆ శిక్షణ ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో ప్రభుత్వ స్కూల్లో ఉద్యోగం సాధించాను. ఇప్పుడు నా ఇంట్లో నన్ను చాలా బాగా ప్రోత్సహిస్తున్నారు. నా భర్త నా కోసం బహుమతులు తెస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇది నేను ఊహించనిది' అని చెన్నై కొదంబక్కమ్ ప్రభుత్వపాఠశాల్లో విధులు నిర్వహిస్తున్న గాయత్రి టీచర్ చెబుతున్నారు. ప్రతి ఇంట్లో ఇటువంటి మహిళలు ఎందరో ఉంటారు. అర్హత ఉండీ అవకాశాలు లేని వారందరికీ తగిన ప్రోత్సాహమివ్వాలి. వారి శక్తి సామర్థ్యాలను గుర్తించి ఆత్మస్థైర్యాన్ని నింపాలి.










