Sep 24,2022 09:06
  • అమరావతి మాస్టర్‌ ప్లానులోనూ మార్పులు ?
  • సర్కారు చర్యలపై అనుమానాలు

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : సిఆర్‌డిఎ చట్టంలో సవరణలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అమరావతి మాస్టర్‌ ప్లాన్‌లోనూ మార్పులు చేయడంపై దృష్టి సారించినట్లు తెలిసింది. పేదలకు లబ్ధి చేయడం కోసమే మార్పులు ప్రతిపాదిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతుండగా, రాజధాని ప్రాంత వాసులతో పాటు, పరిశీలకుల్లోనూ సర్కారు చర్యలపై అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. భూములిచ్చిన రైతుల ప్రయోజనాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వారు అభిప్రాయపడు తున్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు కూడా ఎంతవరకు దక్కుతాయో సందేహాస్పదమే! గత ప్రభుత్వం అమరావతి ప్రాంతాన్ని బృహత్‌నగరంగా ప్రతిపాదిం చగా ప్రస్తుత ప్రభుత్వం దానిని మున్సిపాల్టీ స్థాయికి కుదించిన సంగతి తెలిసిందే. గ్రామసభలలో స్థానికులు ఆ ప్రతిపాదనను వ్యతిరేకించినప్పటికీ, సిఆర్‌డిఎ చట్టంలో చేసిన సవరణతో ప్రభుత్వం మందడుగు వేసే పరిస్థితి ఏర్పడింది. మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేయడానికి గతంలో చేసిన ప్రయత్నా లను హైకోర్టు తీవ్రంగా వ్యతిరేకించింది. తాజాగా చేసిన సిఆర్‌డిఎ చట్ట సవరణతో మాస్టర్‌ప్లాన్‌లోనూ మార్పులకు అవకాశం ఏర్పడింది.
 

                                                                   ఏం మార్పులు చేయనుంది...?

మాస్టర్‌ప్లానులో చేయనున్న మార్పులపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. అయితే, గత ప్రభుత్వం ప్రతిపాదించిన నవ నగరాలతో పాటు, అనేక ఇతర అంశాలు ప్లానులో ఉండవని తెలుస్తోంది. వికేంద్రీకరణ బిల్లు తీసుకువచ్చిన సందర్భంలోనే అమరావతి నిర్మాణం తమ ప్రాధాన్యత కాదని, ఆ స్థాయిలో నిర్మించేంత నిధులు లేదని తేల్చివేసిన సంగతి తెల్సిందే. తాజా చర్యలు సైతం ఆ దిశలోనే ఉండనున్నాయని సమాచారం. గత ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక ప్రకారం విద్య, వైద్య, వాణిజ్య, వ్యాపార, మీడియా, స్పోర్ట్స్‌, కల్చరల్‌, పర్యాటకం, పారిశ్రామిక ఇలా వేర్వేరుగా తొమ్మిది నగరాలను నిర్మించాల్సి ఉంది. దీనికోసం వివిధ ప్రాంతాలను కూడా గుర్తించారు. కొంతమేరకు పనులు కూడా జరిగాయి. అలాగే రైతుల ప్లాట్ల అభివృద్ధి అంశాన్నీ చట్టంలో పొందుపరిచారు. రైతులు కూడా ఇదే ప్లాను చూపించి గతంలో కోర్టును ఆశ్రయించారు. సిఆర్‌డిఎ చట్టంలో చేసిన మార్పులతో రైతుల ప్లాట్ల అభివృద్ధిఖర్చు కూడా గణనీయంగా తగ్గనుందని సమాచారం.
 

                                                                           పేదల సంగతేంటి ?

అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. రాజధానిగా అభివృద్ధి జరిగి, జనాభా పెరగడంతో పాటు వివిధ రంగాలకు చెందిన సంస్థలు ఆ ప్రాంతానికి వస్తేనే పేదలకు అక్కడ పనులు దొరుకుతాయి. లేని పక్షంలో పనుల కోసం విజయవాడ, మంగళగిరి, గుంటూరులకు వెళ్లాల్సి వస్తుంది. ఈ మేరకు రవాణా ఛార్జీల భారం పడటంతో పాటు శారీరక శ్రమ కూడా పెరుగుతోంది. అదే సమయంలో ఈ ప్రాంతానికి తరలిస్తామని ప్రభుత్వం చెబుతున్నా వారందరూ ఇప్పటికే గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లో నివాసముంటున్నారు. వారికి ఆ ప్రాంతాల్లోనే నివాసస్థలాలో, ఇళ్లో ఇస్తే మేలు జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలా కాకుండా ప్రస్తుతమున్న స్థలాల నుండి బలవంతంగా తరలించి, ఏమాత్రం వసతులు, ఉపాధి అవకాశాలు లేనిచోట ఇళ్లు కట్టించి ఇచ్చినా వారికి జరిగే నష్టమే ఎక్కువ! మరోవైపు వారిని ఖాళీ చేయించే స్థలాలను ఎవరికి అప్పగిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదే సమయంలో రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులు కూడా తాజా మార్పుల కారణంగా భారీ నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది.