Nov 01,2023 07:44

పిల్లలు పిల్లలు
పసిపిల్లలు వాళ్ళు
స్త్రీలు స్త్రీలు వాళ్ళు
నిరాయుధులు కదా.
నువ్వెలా విరుచుకుపడుతున్నావో
నీకు తెలుస్తోందా?
యుద్ధం చేస్తున్నానంటు
ఎవరి మీద
నీవు బాంబులు కురిపిస్తున్నావు?
ఇళ్ల మీద, ఆసుపత్రుల పైనా
కుళాయి నీటి గొట్టాలపైన కదా
నువ్వు బాంబులేస్తున్నది.
మరి ఉగ్రవాది ఎవరు
తమ నేల కోసం తెగించి
తిరగబడ్డవారిని బతికుండగానే
నీ సరిహద్దు దాటకుండా
పాశవికంగా హత్య చేసావు.
మీడియా ఇప్పుడు గుడ్డిది కాబట్టి
నువ్‌ చెబుతున్నదే చూపుతోంది.
నేల లేని వారి పాదాలు
ఎటూ పారిపోలేవని
నీవు నిస్సంకోచంగా
విరుచుకు పడుతున్నావు.
పసిపిల్లలూ స్త్రీలూ
ఒంటరయి వున్నారు కదా
చీకటిగా వున్న ఇళ్లలో
ఆకలి కడుపులతో
గాయాలతో దు:ఖిస్తూ
దిక్కులన్నీ బాంబుల మోతలతో
భయం భయంగా ఉన్నారు కదా.
తెల్ల భాస్వరం బాంబుల
మోతలతో దేహమంతా
కమిలి కళ్ళు కానరాక
ఎటు పారిపోవాలో తెలీక
శిధిలాలలో దుమ్ము
కొట్టుకు పోయిన తమ బతుకును
చూస్తూ వెర్రిగా తిరగబడితే
నువ్వు నిలబడగలవా?
 

- కెక్యూబ్‌ వర్మ
సెల్‌: 9493436277