ఏ రోజుకారోజు పని వెతుక్కునే బడుగు జీవులు వారు. ఒక్కసారి పని దొరికితే మండు వేసవి, గడ్డ కట్టే చలి, జోరు వానను సైతం లెక్కచేయకుండా గమ్యం చేరడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. అలా దశాబ్దాల తరబడి ట్రక్కు డ్రైవర్లుగా జీవనం సాగిస్తున్న ఆ వ్యక్తుల బృహత్తర ఆలోచన నేడు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.
కర్ణాటక గడగ్ జిల్లా నారాయణపూర్ గ్రామానికి చెందిన ఆరుగురు ట్రక్కు డ్రైవర్లు నిత్యం పని కోసం పడిగాపులు పడేవారు. పని వచ్చిన రోజు ఎవరి దారి వారిదే.. ఎంత దూరమైనా ప్రయాణించేస్తారు. సాధారణంగా ఎక్కడైనా.. ఏ ట్రక్కు డ్రైవరైనా ఇలాగే ఉంటారు. కాని ఈ ఆరుగురు మాత్రం ప్రత్యేకంగా ఆలోచించారు. తమ పరిస్థితికి కారణమేంటి? తమ అనుభవా లు ఏం నేర్పించాయని ఆలోచన చేశారు. ఆర్థిక ఇబ్బం దులకు తోడు అవమానాలు, ఒత్తిడి తమను నిత్యం వెంటాడుతుంటాయి. దీనికంతటికీ కారణం విద్య లేకపోవడం. అందుకే తమ గ్రామంలో పేద పిల్లల విద్యకు అవసరమైన ఏదేని సాయం చేయాలని తీర్మానించుకున్నారు. 'రాజారత్న' పేరుతో ఓ గ్రూపుగా ఏర్పడ్డారు. గ్రామంలోని ప్రభుత్వ స్కూలుకు వెళ్లి టీచర్లతో మాట్లాడారు. ప్రతి నెలా విద్యార్థుల కోసం చేతనైన సాయం చేస్తామని చెప్పారు. డ్రైవర్ల ఆలోచనకు ఆ ఊరి ప్రజలంతా ఏకమయ్యారు. తాము కూడా వారితో చేయి కలుపుతామని ముందుకువచ్చారు.
డ్రైవర్ల సాయంతో ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి గ్రామంలో వేసవి తరగతులు ప్రారంభమయ్యాయి. అందులో స్పోకెన్ ఇంగ్లీషు క్లాసులను ఉచితంగా అందించారు. శిక్షణ పూర్తయ్యేనాటికి పిల్లలందరూ ఆంగ్లభాషపై పట్టు సాధించారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో టీచర్లుగా విధులు నిర్వర్తించే గ్రామస్తులే ఈ తరగతులను నిర్వహించారు.
అయితే క్లాసులు ముగిసేసరికి విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీషు క్లాసులు ఒక్కటే సరిపోవని, వారికోసం స్మార్ట్ క్లాసులు కూడా నిర్వహించాలని డ్రైవర్లంతా భావించారు. అనుకోవడమే తడవు ఆండ్రాయిడ్ టీవీ, లైబ్రరీ కోసం నిధులు సమకూర్చారు. డ్రైవర్ల చొరవ, విద్య పట్ల వారు చూపిస్తున్న ఆదరణ గ్రామంలోని ఇతర రోజుకూలీలను కూడా కదిలించింది. పేద విద్యార్థుల చదువు కోసం తమ సంపాదనలో ఒక్క రూపాయైనా సాయం చేస్తామన్నారు. 'మా బతుకుల బాగు కోసం రక్తం, శ్రమ, కన్నీళ్లు వెచ్చిస్తాం. ఇప్పుడు ఈ పిల్లల భవిష్యత్తు కోసం ముఖ్యంగా వారి విద్యాభివృద్ధికి సాయం చేయడం చాలా సంతోషంగా ఉంటోంది' అంటున్నారు గ్రామంలోని రోజువారీ కూలీలు.
, 'రూ.500 ప్రాథమిక నిధితో గతేడాది 'రాజారత్న' గ్రూపును ప్రారంభించాం. టీచర్లను కలిసి పిల్లల విద్యకు అవసరమైన కనీస సదుపాయాలను అడిగి తెలుసు కున్నాం. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లలో ఉండాల్సిన సౌకర్యాలపైనా ఆరా తీశాం. ఐదు నెలల పాటు ఈ బృహత్తర కార్యక్రమంపై పనిచేశాం. గత నెలలోనే ఓ ఆండ్రాయిడ్ టీవీని స్కూలుకు ఇచ్చాం. ఇంకా ఇతర సదుపాయాలు సమకూర్చేందుకు కూడా ప్రయత్ని స్తున్నాం' అంటున్నారు ట్రక్కు డ్రైవర్లు. 'డ్రైవర్లు ఇంత పెద్ద సాయం చేయడం చూసి చాలా ఆశ్చర్యపోయాం. వారి కృషిని అభినందించకుండా ఉండలేకపోతున్నాం. గ్రామంలోని రోజు కూలీలంతా డ్రైవర్లతో కలిసి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. విద్య కోసం వీరు పడుతున్న తాపత్రయం నిజంగా హర్షణీయం' అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆ ఊళ్లోని రాజు, ష్రాను.
'మా గ్రామం మారుమూల ఉంటుంది. ఇక్కడి విద్యార్థులకు మెరుగైన విద్య అందదు. ఆ కారణంగానే మేము పై చదువులు చదవలేకపోయాం. ఇంగ్లీషుపై భయం కూడా ఒక కారణం. అందుకే స్పోకెన్ ఇంగ్లీషు క్లాసులు ప్రారంభించి పిల్లల్లో ఆత్మస్థైర్యం నింపేలా చేశాం. మొదట మా ఆరుగురితో మొదలైన ఈ ప్రయాణంలో ఇప్పటికి మరో ఆరుగురు చేరారు. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. ప్రతి నెలా మా సంపాదన నుండి కొంత మొత్తాన్ని గ్రూపు తరపున సాయం చేస్తున్నాం' అంటున్నాడు డ్రైవర్ల బృందంలోని కల్లయ్య. విద్యకు దూరమైన ఈ వ్యక్తులంతా విద్య విలువ తెలుసుకుని విద్యాభివృద్ధి కోసం కృషిచేయడం అభినందనీయం.










