Aug 10,2023 08:18

రెక్కాడితే కాని, డొక్కాడని కుటుంబాలు వారివి. హమాలీ, రోజుకూలీ, తాపీ పనుల్లో భర్తలు రెక్కలు ముక్కలు చేసుకున్నా చాలీచాలని ఆదాయంతో కుటుంబాన్ని సాకలేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వారు కొందరు.. ఒంటరి తల్లిగా పిల్లల ఆలనాపాలన మోస్తున్న మహిళలు ఇంకొందరు... అరకొర చదువుతో ఉపాధికి దూరంగా ఉన్న ఆ మహిళలకు ఆసరాగా నిలబడి, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రం (ఎంబివికె) కృషి చేస్తోంది. మహిళలు స్వయం ఉపాధి సాధించటానికి అవసరమైన బ్యూటీషియన్‌ కుట్టు, ఎంబ్రాయిడరీ, పెయింటింగ్‌ వంటి శిక్షణలను రెండేళ్లుగా కేవలం రిజిస్ట్రేషన్‌ ఫీజుతో అందిస్తోంది. నగరవ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులతో పెద్దగా చదువుకోని, ఒంటరి మహిళలు, గృహిణులు, విద్యార్థినులు, యువతులు ఆయా కోర్సుల్లో శిక్షణ తీసుకుని ఉపాధిమార్గంలోకి అడుగులు వేస్తున్నారు.

               ఎంబివికె ఆధ్వర్యంలో ఇప్పటివరకు 8 బ్యాచ్‌లలో మహిళలు శిక్షణ పొందారు. సాధారణ మహిళలుగా వచ్చిన వారు కోర్సు పూర్తయిన తర్వాత వారిలో సృజనాత్మకత పెంపొందించుకుని సొంతంగా ఎదగగలమనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కుటుంబాల్లో తమ వంతు బాధ్యతను పోషిస్తామనీ, శిక్షణా కార్యక్రమం తమ జీవితాలకు ఓ దారి చూపించిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల 100 రోజులుగా నిర్వహించిన 8వ బ్యాచ్‌ కుట్టు శిక్షణ ముగింపు కార్యక్రమం జరిగింది. ఆ రోజే మిషన్‌ ఎంబ్రాయిడరీ శిక్షణా కార్యక్రమం కూడా ప్రారంబించింది. ఈ సందర్భంగా జీవన అక్కడ శిక్షణ తీసుకున్న మహిళలు, నిర్వాహకులతో ముచ్చటించింది.

44

                                                                      అప్పుడు శిక్షణ.. ఇప్పుడు బోధన

ఎంబివికెలో శిక్షణ ఇస్తున్నారని తెలిసి మా నాన్న ఇక్కడికి తీసుకొచ్చారు. మొదట్లో భయపడుతూ వచ్చా. నాకు టైలరింగ్‌ పెద్దగా రాదు. ఇక్కడకు వచ్చాక మెళకువలు నేర్చుకున్నా. స్వల్ప కాలంలోనే నిపుణత సాధించాను. సాధారణ మోడళ్ల నుంచి నేటి ఆధునిక మోడల్స్‌ వరకు ఏదైనా అవలీలగా కుట్టే స్థాయికి చేరుకున్నాను. నా నైపుణ్యం చూసిన సంస్థ నిర్వాహకులు ఉపాధిమార్గంగా ట్రైనర్‌గా అవకాశం ఇచ్చారు. ఇప్పటివరకు నాలుగు బ్యాచ్‌లకు శిక్షణ ఇచ్చాను. వందల మందికి నేర్పించాను. నగర చుట్టుపక్కల నుండి గృహిణులు, యువతులు వస్తున్నారు. ప్రిన్స్‌ కట్‌ బ్లౌజ్‌, బోట్‌నిక్స్‌ లెహంగాలు, లాంగ్‌ ప్రాక్‌ మోడళ్లు, జంట్స్‌ కుర్తా, కోటు వంటివి కూడా కుట్టడం నేర్పించాను. చిన్నపిల్లలకు లంగా, జాకెట్టు, కాటన్‌ ఫ్రాక్స్‌, ఆటో కలర్‌ నెక్స్‌, యూనిఫాం దుస్తులు, హ్యాండ్స్‌ మోడళ్లు వంటివి బాగా నేర్చుకున్నారు. శిక్షణ ఇవ్వటానికి నాకు అవకాశం కల్పించిన ఎంబివికె యాజమాన్య కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు' అంటూ సంస్థ కల్పించిన అవకాశం గురించి సంతోషంగా చెబుతున్నారు టీచర్‌ గాయత్రి.

22

                                                                    పేద కుటుంబం నుంచి వచ్చాను

మాది చాలా పేద కుటుంబం. అమ్మ సంపాదనే మాకు ఆధారం. ఆమెకు భారం కాకూడనే ఉద్ధేశంతో ఎంబివికె శిక్షణలో చేరాను. చాలా చక్కటి శిక్షణ ఇచ్చారు. పుల్‌ బ్లౌజ్‌, కుచ్చు బ్లౌజ్‌, బుట్ట హ్యాండ్స్‌, వింగ్స్‌ బ్లౌజ్‌, షార్ట్‌ హ్యాండ్స్‌, ఎరోప్లెయిన్‌ వింగ్స్‌, పుల్‌ లంగా విత్‌ డాట్స్‌, ఎల్‌బ్లో, హ్యాండ్స్‌, లాంగ్‌ ఫ్రాక్‌, అంబరిల్లా ఫ్రాక్‌, ప్యాంట్‌ హ్యాండ్స్‌, బాహుబలి హ్యాండ్స్‌ తదితర లేటెస్ట్‌ మోడళ్లకు కూడా నేర్చుకున్నారు. రోటరీ వారు మోటార్‌ కుట్టు మిషన్‌ కూడా ఇస్తుండటంతో నేను కూడా సంపాదించగలననే నమ్మకం కల్గింది.
                                                                           - ఒంగోలు ప్రిన్సి, పెజ్జోనిపేట, విజయవాడ
 

55

                                                                ఆర్థికంగా బలోపేతానికి దోహదం

నేటి రోజుల్లో దుస్తులు కుట్టించుకోవటం సామాన్యులకు చాలా ఖరీదైంది. ఇక్కడికి రాకముందు నాకు టైలరింగ్‌ పెద్దగా రాదు. శిక్షణలో దాదాపుగా అన్ని అంశాలు నేర్పించారు. ఇప్పుడు నేను అన్ని మోడళ్ల దుస్తులు కుట్టగలను. న్యూ మోడల్‌ డ్రెస్‌లు కుట్టే విధానాన్ని సైతం నేర్పించారు. చాలా చక్కగా శిక్షణ ఇచ్చారు. కుట్టుమిషన్‌తో పాటుగా ఎంబ్రాయిడరీ, మిషన్‌ ఎంబ్రాయిడరీ, పెయింటింగ్‌ వంటివి నేర్పిస్తుండటం మహిళలకు ఎంతో ఉపయోగకరం.
                  - కె.ఇందిర, రాణీ గారి తోట, కృష్ణలంక

77


                                                                   నర్సింగ్‌ చేసి మిషను నేర్చుకున్నాను

నేను నర్సింగ్‌ కోర్సు పూర్తి చేశాను. కుట్టుశిక్షణపై నాకు ఉన్న ఆసక్తితో ఎంబివికె ద్వారా ఇస్తున్న శిక్షణలో చేరాను. ఈ 100 రోజుల శిక్షణలో ఎలాంటి మోడల్‌ డ్రెస్సులైనా కుట్టగలననే నమ్మకం వచ్చింది. ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చిన పెప్లమ్‌ టాప్స్‌, కొత్త మోడళ్లయిన శరార గెరార, బెల్‌ హ్యాండ్స్‌, లాంగ్‌ ఫ్రాక్స్‌, ప్రిన్స్‌ కట్‌ బ్లౌజ్‌ వంటివి చాలా వేగంగా కుట్టగలను. ఇలాంటి దుస్తులు బయట కుట్టించుకోవాలంటే రూ.500 నుంచి రూ.1500 ధరల్లో ఉంటాయి. నా దుస్తులను నేనే తయారుచేసుకుని ధరిస్తున్నా. ఆదాయం మార్గంగా ఈ నైపుణ్యం ఉపయోగపడుతుంది.
                                                                                                              - పసుపులేటి సాయిదుర్గ, కృష్ణలంక

 

- పిన్నమనేని విజయ, శిక్షణా కేంద్రం బాధ్యులు, ఎంబివికె మేనేజ్‌మెంట్‌ కమిటీ సభ్యులు
                                                - పిన్నమనేని విజయ,
                     శిక్షణా కేంద్రం బాధ్యులు, ఎంబివికె మేనేజ్‌మెంట్‌ కమిటీ సభ్యులు

                                                               మహిళల స్వయం ఉపాధికి ప్రాధాన్యం

గత రెండేళ్లుగా మహిళలకు స్వయం ఉపాధి నిమిత్తం పలు కోర్సుల్లో శిక్షణా తరగతులు ఇస్తున్నాం. నామమాత్రపు రిజిస్ట్రేషన్‌ ఫీజుతో ఉచితంగా శిక్షణ ఇస్తున్నాం. ఏడాది పొడవునా ఈ కార్యక్రమం నిర్వహించేలా కృషిచేస్తున్నాం. ఇప్పటివరకు 8 బ్యాచ్‌లలో శిక్షణ ఇచ్చాం. బ్యూటీషియన్‌, కుట్టుశిక్షణ; ఎంబ్రాయిటరీ, పెయింటింగ్‌ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నాం. శిక్షణ తీసుకున్న మహిళలు స్వయం ఉపాధి పొందుతామనే ధీమాను వ్యక్తం చేస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది.
                               -  యడవల్లి శ్రీనివాసరావు

99