వర్షాకాలంలో సాధారణంగా తడి కారణంగా షూల నుంచి దుర్వాసన వస్తుంటుంది. షూల అపరిశుభ్రతతో పాటు పాదాల నుంచి వచ్చే దుర్గంధం కూడా దీనికి కారణం కావొచ్చు. ఇంట్లో వుండే వస్తువులతోనే ఈ చెడు వాసనను నియంత్రించవచ్చు.
పాదాల శుభ్రత ఇలా ... : వెడల్పాటి బకెట్లో సగం వరకు నీటిని తీసుకోవాలి. ఆ నీటిలో బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. తర్వాత ఆ నీటిలో పాదాలను పది నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత కాళ్లను బయటకు తీసి కాటన్ గుడ్డతో అరికాళ్లు, కాలి వేళ్లను బాగా తుడవాలి. ఇలా రోజూ చేస్తే పాదాల వాసన క్రమంగా తగ్గుతుంది.
- ఒక బకెట్‌లో పాదాలు మునిగేంత వరకు గోరువెచ్చని నీటిని పోసి, ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, అదే మొత్తంలో నిమ్మరసం వేసి బాగా కలపాలి. తర్వాత ఈ నీటిలో పాదాలను 10 నిమిషాల పాటు ఉంచాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే సమస్య తగ్గుతుంది.
- పాదాలు మునిగేంత నీళ్లను తీసుకుని ఏదైనా నూనె (యూకలిప్టస్, లెమన్ గ్రాస్, పిప్పరమెంటు, ఎసెన్షియల్ ఆయిల్ మొదలైనవి) ఐదు నుంచి ఆరు చుక్కలు వేయాలి. ఆ నీటిలో కనీసం 10 నిమిషాల పాటు పాదాలను ఉంచాలి. తర్వాత పాదాలను బయటికి తీసి బాగా తుడుచుకోవాలి.
- ఒక బకెట్ గోరువెచ్చని నీటిలో ఒక కప్పు ఎప్సమ్ సాల్ట్ మిక్స్ చేసి అందులో పాదాలను ఉంచాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయాలి.
- ఒక బకెట్ గోరువెచ్చని నీటిలో అరకప్పు వెనిగర్ వేసి పాదాలను 15 నిమిషాల పాటు ఉంచాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేస్తే ఉపయోగకరం.
- రోజుకు కనీసం రెండుసార్లు పాదాలను సబ్బుతో శుభ్రం చేసుకున్నా దుర్వాసన సమస్య తగ్గుతుంది.
- రోజూ సాక్స్ మార్చాలి. ఉతక్కుండా పదే పదే ఉపయోగించొద్దు. అలాగే సాక్స్ తడిగా ఉన్నా ఉపయోగించకండి.
షూల శుభ్రత ఇలా ... : రసం పిండేసిన నిమ్మకాయ, నారింజ తొక్కలను రాత్రంతా బూట్లలో వేసి ఉంచితే వాటి నుంచి వచ్చే దుర్వాసన తొలగిపోతుంది.
- వర్షంలో ప్రయాణించి వచ్చిన తరువాత తడిసిన బూట్లలో కొంచెం బేకింగ్ సోడా వేసి రాత్రి అంతా అలా ఉంచేయాలి. ఉదయానికి బూట్లు పొడిగా, దుర్వాసన రహితంగా ఉంటాయి.
- తడిగా ఉన్న బూట్లలో న్యూస్ పేపర్‌ని వేసి రాత్రి అంతా ఉంచినా తేమ, దుర్వాసన ఉండదు.
- బూట్లలోని చెడు వాసనను తొలగించడానికి టాల్కమ్ పౌడర్ కూడా బాగా పనిచేస్తుంది. బూట్ల లోపలి భాగంలో పౌడర్ చల్లి రాత్రంతా ఉంచితే ఇది బూట్లలోని తడిని గ్రహించి, చెడు వాసనను అరికడుతుంది.










