Jul 07,2023 08:38

తన సోదరుడు డయాబెటిస్‌తో పడుతున్న బాధను చూడలేక దివా ఉత్కర్ష చలించింది. అటువంటి పరిస్థితి ఏ పిల్లవాడికి రాకూడదని పాఠశాల స్థాయి నుంచే అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. వ్యాధిగ్రస్తుల జీవనశైలి మార్పు కోసం నిరంతరం కృషి చేస్తోంది. 'ప్రాజెక్ట్‌ సూర్య' ద్వారా పదిహేను వేల మంది పిల్లలకు వైద్యసేవలు, మందులు ఉచితంగా అందజేస్తూ అంతర్జాతీయ అవార్డును అందుకుంది.

            దేశంలో డయాబెటిస్‌తో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజూకూ పెరిగిపోతుంది. కాని ఇప్పుడు ఇది చిన్న పిల్లల్లోనూ కనిపిస్తోంది. ఈ క్రమంలో బెంగుళూరుకు చెందిన దివా ఉత్కర్ష టైప్‌ 1 డయాబెటిస్‌ భారిన పడ్డ పిల్లలకు అండగా నిలిచారు. డయాబెటిస్‌ వల్ల కలిగే మానసిక కుంగుబాటును దూరం చేస్తున్నారు. కనీసం పద్నాలుగేళ్లు కూడా నిండని దివా ఉత్కర్ష ఈ బృహత్తర కార్యానికి నాయకత్వం వహిస్తూ పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తుంది. అందుకు తన సోదరుడు సూర్యానే కారణమంటుంది. దివాకు పన్నెండేళ్ల వయస్సులో, తొమ్మిదేళ్ల సూర్యకు టైప్‌ 1 డయాబెటిస్‌ ఉందని నిర్ధారణ అయ్యింది. రోజులో రెండు పూటలా ఇన్సులిన్‌ ఇవ్వాలని వైద్యులు సూచించారు. అది విన్న తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. ఇద్దరూ వైద్యులే. అయినా తన బిడ్డకు డయాబెటిస్‌ రాకుండా చూసుకోలేకపోయారు. అందుకు వారు కుంగిపోయారు. అప్పటి నుంచి ఆమె తల్లిదండ్రులు సూర్యకు సమయానికి ఇన్సులిన్‌ ఇవ్వడం, వ్యాయామాలు చేయించడం చేస్తున్నారు. అన్ని వనరులు ఉన్నా సూర్య దాన్ని తట్టుకుని మామూలు పిల్లవాడిలా జీవనం సాగించడం కష్టంగా ఉండేది. నిత్యం బలహీనంగా కనిపించేవాడు. ఏదైనా పని చేస్తే వెంటనే అలసిపోయి పడిపోయేవాడు. అది చూసిన దివా తమ్ముడిలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదనుకుంది. అప్పటి వరకూ ఈ వ్యాధి చిన్నారులకు వస్తుందని తెలియదు. అందుకే డయాబెటిస్‌తో బాధపడుతున్న వారిని ఆదుకోవాలని నిర్ణయించుకుంది.
 

                                                                             తల్లిదండ్రుల్లో...

పిల్లల్లో డయాబెటిస్‌ లక్షణాలు కనిపిస్తున్నా కొంతమంది తల్లిదండ్రులు గుర్తించకపోవడంతో పరిస్థితి మరింత తీవ్రం అవుతుంది. రోగం ముదిరిన తర్వాత వైద్యులను సంప్రదించినా లాభం ఉండదని దివా 14 సంవత్సరాల వయస్సుకే అర్థం చేసుకుంది. అప్పటి నుంచి అసలు మధుమేహం వ్యాధిపై అధ్యయనం చేయడం మొదలుపెట్టింది. దాని గురించి తన పాఠశాల్లోనే కాకుండా చుట్టుపక్కల స్కూలు పిల్లలకు అవగాహన కల్పించింది. పిల్లలకు వైద్యం అందించాలంటే కష్టంగా ఉంటుందని, ఆ సమయంలో వారు సహకరించరు. అందుకే పిల్లలకు నచ్చినట్లు వైద్యం చేయాలని సూచిస్తుంది. వ్యాయామం, ఆహారం, మందులు, గ్లూకోజ్‌ పర్యవేక్షణ మొదలైన అనేక మార్పులను ఎదుర్కోవలసి ఉంటుంది. వాటి గురించి పిల్లల తల్లిదండ్రులకు వైద్యులచేత, నిపుణుల చేత అవగాహన కల్పిస్తోంది. అందుకు తన తల్లిదండ్రుల సహకారం తీసుకుంది.
 

                                                                            ప్రాజెక్టు సూర్య ద్వారా

2022లో విడుదల చేసిన ఐసిఎంఆర్‌ నివేదిక ప్రకారందేశంలో 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల్లో టైప్‌ 1 మధుమేహం 95,600 కేసులు ఉన్నాయి. ఈ వయస్సులో ప్రతి సంవత్సరం 15,900 కేసులు నిర్ధారణ అవుతున్నాయి. ఈ నేపధ్యంలో కర్నాటకలో నిరుపేద పిల్లలకు వారి జీవన నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో ఆమె రెండేళ్ల క్రితం 'ప్రాజెక్ట్‌ సూర్య'ను ప్రారంభించింది. డయాబెటిస్‌తో బాధపడుతున్న పిల్లలకు అవగాహన కల్పించి, వారికి సహాయం అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యంగా పెట్టుకుంది. బెంగుళూరులో 100 కన్నా ఎక్కువ మధుమేహ పిల్లల కుటుంబాలను కలిసింది. వీరి కోసం ఎండోక్రినాలజిస్టులు, డైటీషియన్లు మరియు ఇతర వైద్యుల చేత సెషన్‌లను నిర్వహిస్తుంది. డయాబెటిస్‌ మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది కాబట్టి వారు కౌన్సెలింగ్‌ సెషన్‌లను కూడా నిర్వహిస్తుంది. అటువంటి పిల్లల్లో ఇతర రోగాలు ప్రభలకుండా జాగ్రత్తలూ తీసుకుంటుంది. ఇన్సులిన్‌ మరియు గ్లూకోజ్‌ స్ట్రిప్స్‌, సిరంజిలు అందిస్తుంది. మధుమేహ నిర్వహణ వనరులను స్పాన్సర్‌ చేయడానికి క్రౌడ్‌ ఫండింగ్‌ మరియు ఫండ్‌ రైజింగ్‌ ఈవెంట్‌ల ద్వారా నిధులను సేకరిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా 15,000 మంది వైద్యం పొందుతున్నారు. అతి చిన్న వయస్సులోనే ఎంతో ఓర్పుతో తోటి పిల్లల కోసం కష్టపడుతున్న దివాను చూసి అందరూ అభినందిస్తున్నారు. ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్న దివా చేస్తున్న సేవాకార్యక్రమాలను గుర్తించిన అధికారులు 'దివా డయానా అవార్డ్‌ 2023' అంతర్జాతీయ అవార్డు ఇచ్చి అభినందించారు.