'ఎప్పుడూ వంటగదిలో గడిపే అమ్మ ఎన్నో పనులు చకచకా చేసేస్తుంది. ఒకటా రెండా.. అమ్మ చేసే పనుల జాబితా చాలా పెద్దదే. ఒక కచ్చితమైన నిర్ణయంతో మహిళలు ఎంత కష్టమైన పనినైనా చాలా సులువుగా చేసేస్తార'ని నేను బలంగా నమ్ముతాను అంటున్నారు ఢిల్లీకి చెందిన ఆన్య విగ్ అనే 33 ఏళ్ల యువతి. బాల్యంలో అమ్మను చూసి ఆమెలో ఏర్పడిన ఈ అభిప్రాయం పెరిగి పెద్దదైన తరువాత మరింత బలపడింది. అయితే మహిళల శక్తి సామర్య్థ్యాలను తాను గుర్తించినవిధంగా ఈ సమాజం గుర్తించడం లేదన్న సంగతి అర్థమయ్యేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. లింగ వివక్ష, మూసధోరణి, సాంప్రదాయ ముసుగులో ఆంక్షలు వంటివి మహిళల శక్తి సామర్థ్యాలను మరుగున పడేస్తున్నాయని స్పష్టమై ఆలోచనల్లో పడింది. ఆ క్షణాన తనలా సమాజం కూడా మహిళలను గుర్తించాలని లక్ష్యం పెట్టుకుంది. ఆ లక్ష్యంలో నుండే 'హర్ హక్' స్వచ్ఛంద సంస్థకు బీజం పడింది.

'చిన్నప్పటి నుండి సమాజాన్ని ప్రభావితం చేయాలని బలంగా నాటుకుపోయింది. అయితే ఏదైనా మంచి హోదా గల ఉద్యోగం పొందితే నా లక్ష్యం చాలా సులభంగా నెరవేరుతుందని భావించేదాన్ని. లాయర్, జర్నలిస్టు, పోలీసు ఇలా ఉన్నత ఉద్యోగాలు సాధించాలని కలలుగన్నాను. కానీ అవేమీ అవసరం లేకుండానే సమాజాన్ని ప్రభావితం చేయగలనని నిదానంగా తెలుసుకున్నాను' అంటున్న ఆన్య 2018లో 'శ్రీరామ్ మహిళా కాలేజీ, ఢిల్లీ యూనివర్శిటీలో చేరిన దగ్గర నుంచీ తన చిరకాల కలను నెరవేర్చుకునే పనిలో శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు.
హర్ హక్ ఇలా ఏర్పడింది..
కాలేజీ మహిళల్లో రుతుక్రమ పరిశుభ్రతపై అవగాహన తెచ్చేందుకు యునైట్‌డ్ నేషన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పనిచేయడం ప్రారంభించారు. 'అది చాలా సులభం అని మొదట్లో భావించాను. కానీ చదువుకునే పిల్లల్లోనే రుతుక్రమంపై సరైన అవగాహన లేదు. పరిశుభ్రత పాటించాలంటే ముందు దాని గురించి తెలుసుకోవాలి. కాని అమ్మాయిలకు దానిపై ఎన్నో అనుమానాలు, భయాలు ఉన్నాయని నా పరిశీలనలో తెలిసింది. 2022 సెప్టెంబరు వరకు నేను ఆ ప్రోగ్రామ్‌లో పనిచేశాను. కాని నేను అనుకున్న లక్ష్యం పూర్తి కావాలంటే ఇది చాలదు. అందుకే సొంతంగా 'హర్ హక్' అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించాను' అంటూ సంస్థ స్థాపనకు తనను ప్రేరేపించిన అంశాల గురించి ఆమె చెబుతున్నారు.
ఇలా పనిచేస్తోంది..
మూడు అంశాలపై ఈ సంస్థ పనిచేస్తోంది. రుతుక్రమ పరిశుభ్రత- అవగాహన, న్యాయం, ఆర్థిక అక్షరాస్యత వంటి మూడు అంశాలపై 'హక్' పనిచేస్తోంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా ఈ సేవలను మరింత ముందుకు తీసుకెవెళ్తున్నారు. ప్రజలను తమవైపు ఆకర్షించుకునేందుకు ప్రత్యుత్పత్తి, రుతుక్రమ అవగాహన, పరిశుభ్రత వంటి అంశాలను ఆటపాటల రూపంలో ప్రదర్శిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. 2021 మార్చి 8 నుండి 'గాళ్ అప్ రైజ్' పేరుతో స్కూళ్లల్లో శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేస్తున్నారు.

ఆర్థికంగా ఎదగాలని..
18 ఏళ్ల వయసు నుండి సంపాదించడం మొదలుపెట్టిన ఆన్య మహిళలు ఆర్థికంగా బలవంతంగా ఉండాలంటారు. ఇప్పటికీ చాలామంది మహిళలు ఆర్థిక విషయాలల్లో ఇంటి యజమానిపై ఆధారపడుతుంటారు. అది వారిని మరింత నియంత్రణలోకి నెట్టేస్తుంది. అందుకే ఆర్థికంగా ఎదిగి ఎవరికి వారే తమ భవిష్యత్తును నిర్దేశించుకోవాలి అంటారు. మహిళల ఆర్థిక పరిణతి కోసం 'హక్' తరపున పర్సనల్ ఫైనాన్స్, బడ్జెటింగ్, టాక్స్ ప్లానింగ్, సైబర్ క్రైమ్స్, లైంగిక వేధింపుల చట్టాలు వంటి వాటిపై అవగాహన కల్పిస్తున్నారు.
'హర్ హక్' ద్వారా ప్రతి స్త్రీ తనను తాను నిర్మించుకుంటూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలి. సమాజం ఆమెని గుర్తించాలి. ఈ ప్రయాణంలో ఎన్నో ఎదురుదెబ్బలు చూశాను. శానిటరీ ప్యాడ్లను పంచుదామని ఒక స్కూలుకు వెళితే ... వాళ్లు నిర్మొహమాటంగా మా ఆఫర్‌ను తిరస్కరించారు. ఆ విషయం బయటికి చెప్పేది కాదన్నది వారి అభిప్రాయం. ఇటువంటి ఎన్నో అనుభవాలు నా ప్రయాణంలో ఉన్నాయి. ప్రశంసలతో పాటు వాటిని కూడా స్వీకరించానే గాని నిరుత్సాహ పడలేదు. మహిళల కోసం ఆదర్శవంతమైన ప్రపంచాన్ని సృష్టించడమే నా లక్ష్యం. ఆ కలను నెరవేర్చుకోవడంలో 'హర్ హక్' ఓ చిన్న అడుగు' అంటున్న ఆన్య విగ్ ... ఇంకా మున్ముందుకు సాగాలని ఆశిద్దాం.










