ప్రతిసారి కలల ఒడ్డున
నిలబడి, చేతులు చాచి
ఊరిస్తూ ఆహ్వానిస్తావు
తీరా ఆనందాల ఒడి చేరి
సేదదీరుదామనే సమయానికి
మెరుపులా అదృశ్యమవుతావు
నీ గురించిన ఆలోచనలలో
రాబోయే రోజులన్నీ
రంగుల తోరణాలు కట్టుకుని
గుండెల్లో తీపి తీపి ఆశలు
రేపుతుంటాయి
ఇక్కడ
ఆమెల ఆర్తనాదాలు
ముళ్ళదేహాల కౌగిలింతలు
వసివాడని కసురుమొగ్గలపై
పడగనీడల చప్పుళ్ళు
లోపల గుబులు రేపుతుంటాయి
ఆరని జ్వాలలై దహిస్తుంటాయి
స్వేదజలాలను చిలకరించి
మెతుకు మొలకలతో పలకరించే అతడు
శ్రమదేహాన్ని పునాదిగా
ఆకాశహర్మ్యాలు నిర్మించే ఇతడు
దిగులు బరువును మోసుకుంటూ ఎదురొస్తారు
సింహాసనాలు రాచరికాలు
విర్రవీగుతూ
భోగలాలసతో మీసాలు మెలేస్తుంటాయి
వేప పూత కన్నా
జీవితం మరింత చేదుగా అనిపిస్తుంటే
పచ్చడి తీయదనం కమ్మదనం
పెదవులపైనే ఇగిరిపోయింది
భవిష్యత్ ఆకుపచ్చని స్వప్నం
చేతులకు అందకుండా ఎగిరిపోయింది!
- పద్మావతి రాంభక్త,
99663 07777










