
తిరుమల: తిరుమలలో యాత్రికుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ ఏడు కొండల స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులకు నేరుగా దర్శనానికి అనుమతినిస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. టోకెన్లు లేని యాత్రికులకు సర్వదర్శనం 18 గంటల్లో సర్వదర్శనం అవుతుందని వివరించారు. తిరుమలలో యాత్రికుల సౌకర్యార్థం అన్నప్రసాదం కాంప్లెక్స్, ప్రధాన కల్యాణ కట్ట కాంప్లెక్స్‌లలో పాదరక్షలు భద్రపరచు కౌంటర్లను టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ తిరుమలకు వచ్చే యాత్రికుల పాదరక్షల భద్రపరచడానికి టీటీడీ పలు ప్రాంతాల్లో కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. యాత్రికుల పాదరక్షలను భద్రపరచడానికి, టీటీడీ పది ప్రాంతాల్లో కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
ఇందులో భాగంగా బుధవారం రెండు కౌంటర్లు ప్రారంభించినట్లు తెలిపారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం వద్ద 1187 ర్యాక్‌లు, ప్రధాన కల్యాణ కట్ట వద్ద 4 వేల ర్యాక్‌లను భక్తుల కోసం అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. త్వరలో పిఎసి 1,2,3, నారాయణగిరి క్యూ లైన్లు, రాంభాగీచా, సుపదం, ఏటీసీ సర్కిల్, వీక్యూసీలో పాదరక్షల భద్రపరుచు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు వివరించారు.
ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం
భువనేశ్వర్‌కు చెందిన శివం కాండెవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బుధవారం ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం అందించారు. ఈ సంస్థ తరఫున ప్రతినిధి వై.రాఘవేంద్ర ఈ మేరకు విరాళం డీడీ ని తిరుపతిలోని పరిపాలన భవనంలో టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు.
మంగళవారం స్వామివారిని 65,314 మంది యాత్రికులు దర్శించుకోగా 24,715 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. యాత్రికులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ ,4.48 కోట్లు వచ్చిందని తెలిపారు.