- సేకరణ బాధ్యత అప్పగించనున్న కేంద్రం
- ఎఫ్‌సిఐపై వేటుకేనన్న అనుమానాలు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆహార ధాన్యాల సేకరణనూ ప్రైవేటు సంస్థలకు ఆప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ కూడా రాసినట్లు ఆయన తెలిపారు. ఇప్పటిదాకా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో పాటు రాష్ట్ర ప్రభుత్వాల ఏజెన్సీలు ఆహార ధాన్యాల సేకరణ బాధ్యతను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ బాటలోనే తాజా చర్యకు దిగినట్లు భావిస్తున్నారు. ప్రారంభంలో ప్రైవేటు సంస్థలకు స్వల్పంగా బాధ్యతలు అప్పగించినప్పటికీ క్రమేణా ఎఫ్‌సిఐపై పూర్తిస్థాయిలో వేటు పడే అవకాశంం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రాలకు రాసిన లేఖలో ఖర్చు తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం పేర్కొనడం ఈ సందర్భంగా గమనార్హం. ఈ లేఖలో రెండు అంశాలను కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించినట్లు సమాచారం, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే కొనుగోళ్లపై కేంద్రం రెండు శాతం వరకు మాత్రమే అనుకోని ఖర్చులను ఇస్తుందన్నది మొదటి అంశం కాగా, రెండవది సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, సేకరణ వ్యయాన్ని తగ్గించడానికి సెంట్రల్ బఫర్ స్టాక్ కోసం ఆహార ధాన్యాలను సేకరణకు ప్రైవేటు రంగానికి అనుమతిస్తున్నామని, దీనిని స్వాగతించాలని పేర్కొన్నట్లు తెలిసింది. కరువుకాటకాలు, తుపానులు వంటి అనూహ్య సంఘటనలు ఏర్పడినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 6 నుండి 8 శాతం మేర రాష్ట్రాలకు చెల్లిస్తోంది. తాజా లేఖలో దానిని 2 శాతానికి కుదిస్తున్నట్లు పేర్కొనడంతో భవిష్యత్తులో ఈ రంగం నుండి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తప్పుకునే అవకాశం ఉంది.
పాండే ఏమన్నారు...?
రోలర్ ఫ్లోర్ మిల్లర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 82వ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆహారమంత్రిత్వశాఖ కార్యదర్శి సుధాన్షు పాండే '' ఎఫ్‌సిఐ, రాష్ట్ర ఏజెన్సీలు మాత్రమే ఆహారధాన్యాలు ఎందుకు సేకరించాలి?విదేశాల్లో ప్రైవేట్ వ్యక్తులే సమర్థంగా ఆ పని చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఏజెన్సీల కంటే వారే తక్కువ ఖర్చుతో ఎక్కువ సమర్ధవంతంగా ఆహార ధాన్యాలను సేకరిస్తే ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందేమీ లేదు. అందుకే ఈ ప్రైవేట్ రంగాన్ని కూడా కొనుగోళ్ల ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలని రాష్ట్రాలను కోరాం.' అని చెప్పారు. రాష్ట్రాలు కొనుగోళ్ల వ్యవస్థను మెరుగుపరచకుంటే రెండు శాతం అనుకోని వ్యయాన్ని కూడా కేంద్రం భరించదని ఆయన హెచ్చరించారు. భాగస్వామ్య దారులందరికీ ప్రయోజనం చేకూర్చే విధంగా కార్యాచరణ వ్యవస్థను మెరుగుపరచడం, బలోపేతం చేయడం మినహా తమకు వేరే మార్గం లేదని రాష్ట్రాలకు తెలుసని పేర్కొన్నారు.










