Sep 20,2022 10:54
  • ధరల పెరుగుదలతో ఆక్వా రంగం అతలాకుతలం
  • రొయ్యల మేత టన్ను రూ. 90 వేలు
  • చేపల మేతదీ అదే తీరు
  • కృష్ణాలో ఆక్వా రైతులపై
  • రూ. 445 కోట్ల అదనపు భారం

ప్రజాశక్తి - కృష్ణాప్రతినిధి : అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న మేతల ధరలు ఆక్వా రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. రెండు నెలలకొకసారి వీటి ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. రొయ్యల మేత టన్ను (వెయ్యి కిలోలు) రూ.72 వేలు ఉండగా ఈ నెల 7న మరో రూ.3 వేలు పెరిగింది. ఏడాదికాలంలో పలు దఫాలుగా రూ.18 వేలు పెరిగి టన్ను ధర రూ.72 వేల నుంచి రూ.90 వేలకు చేరింది. చేపల మేత ధర టన్ను రూ.14 వేల నుండి రూ.22 వేలకు చేరుకుంది. మేతల ధరలు గణనీయంగా పెరిగినా ఆ మేరకు ఆక్వా ఉత్పత్తుల ధరలు పెరగకపోవడంతో ఆక్వా సాగు గిట్టుబాటుకావడం లేదని పెంపకందారులు వాపోతున్నారు. మేత తయారీలో ఉపయోగించే ముడి పదార్ధాల ధరలు పెరగడం, జిఎస్‌టి, విద్యుత్‌ ఛార్జీల పెంపు తదితర కారణాలతోనే మేత ధరలు భారీగా పెరిగాయని ఫీడ్‌ కంపెనీల నిర్వాహకులు చెబుతున్నారు.
       కృష్ణా జిల్లాలో 51,440 ఎకరాల చెరువుల్లో చేపలు, 37,348 ఎకరాల్లో రొయ్యలు సాగు చేస్తున్నారు. ఎగుమతులకు అవసరమైన 40 కౌంట్‌ సైజ్‌ రొయ్యలు పెరగడానికి 90 రోజుల నుంచి వంద రోజుల సమయం పడుతుంది. ఈ కాలంలో వైరస్‌, తెగుళ్లు, ఇతరత్రా వ్యాధులు సోకకుండా సంరక్షించుకోవడంతోపాటు వీటిపెంపకానికి అత్యంత నాణ్యమైన మేతను ఆహారంగా అందించాలి. ఎకరం విస్తీర్ణంలో రొయ్యల పెంపకానికి నాలుగు టన్నులు వినియోగించాలి. ఏడాది క్రితం మేతకు రూ.2.88 లక్షలు ఖర్చుకాగా, ప్రస్తుతం ఆ ఖర్చు రూ.3.30 లక్షలకు చేరింది. మొత్తం 37,348 ఎకరాల్లో రొయ్యలు సాగు చేసే రైతులకు ఒక్క మేతపైనే రూ.156 కోట్లా 86 లక్షల 16 వేల రూపాయల మేర అదనపు భారం పడుతోంది. ఎకరంలో చేపల పెంపకానికి ఏడు టన్నుల మేత వినియోగించాలి. దీని ధర రూ.98 వేల నుంచి లక్షా 54 వేల రూపాయలకు చేరింది. ఎకరానికి రూ.56 వేల చొప్పున 51,440 ఎకరాల్లో చేపల పెంపకానికి ఏడాది క్రితంతో పోలిస్తే 288 కోట్లా 6 లక్షల 40 వేల రూపాయల భారం పడుతోంది. జిల్లాలోని రొయ్యలు, చేపల రైతులు ఒక్క మేతపైనే 444.92 కోట్ల రూపాయలను అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది.
 

                                                                    గిట్టుబాటు కాదు

20 ఎకరాల్లో రొయ్యలు సాగు చేస్తున్నా. వాటి పెంపకానికి వాడే మేత ధరలు నెలనెలా పెరిగిపోతున్నాయి. టన్ను మేత ధర రూ.72 వేల నుంచి ఏడాది కాలంలో రూ.90 వేలకు చేరింది. చెరువులపై వచ్చే ఆదాయంలో ఎక్కువగా మేత ఖర్చుకే పోతోంది. చెరువుల కౌలు, రొయ్య పిల్ల కొనుగోలు, మోటార్ల కరెంటు ఛార్జీలు అన్నింటినీ లెక్కలోకి తీసుకుంటే గిట్టుబాటుకావడంలేదు.
                                                  సిహెచ్‌,బాబూరావు, రొయ్యల పెంపకం దారులు, సాలెంపాలెం, కోడూరు మండలం

                                          కిలో చేప రూ.120 అమ్మితేనే ఖర్చులు వచ్చే అవకాశం

16 ఎకరాల్లో చేపలు పెంచుతున్నాను. పది టన్నుల మేత ధర రూ.1.40 లక్షల నుంచి రూ.2.20 లక్షలకు చేరింది. ఏడాదిపాటు పెంచడానికి ఏడు టన్నుల మేత అవసరం. బొచ్చె, రాగండి రకం చేపలు కిలో రూ.120 అమ్మితే ఖర్చులు మాత్రమే వస్తాయి. వ్యాపారులు కిలో రూ.115కు మాత్రమే అడుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఖర్చులు వచ్చినా చాలనుకుంటున్నాం.
                                                          - సువారి శ్రీనివాసరావు, చేపలపెంపకం రైతు, ఇలపర్రు, నందివాడ మండలం
 

                                                          ముడి పదార్ధాల ధరలు పెరిగాయి

రొయ్యలు, చేపల మేత తయారీకి ఉపయోగించే ముడి పదార్ధాల ధరలు విపరీతంగా పెరిగాయి. తవుడు కిలో రూ.23 నుంచి రూ.34కు, నూకలు రూ.16 నుంచి రూ.22, మొక్కజొన్న రూ.16 నుంచి రూ.26, డిఒబి రూ.12 నుంచి రూ.20కి చేరుకున్నాయి. ఫిష్‌ మీల్‌ కిలో రూ.90 నుంచి రూ.130కు, ఫిష్‌ ఆయిల్‌ రూ.140 నుంచి రూ.200కు పెరిగాయి. విద్యుత్‌ చార్జీలు ఒక యూనిట్‌కు రూపాయి పెరిగింది. 25 కిలోల రొయ్యల మేత ఏడాది కాలంలో రూ.1850 నుంచి రూ.2,250కు చేరుకుంది.
                                                                                        - కె.రాము, కోస్టల్‌ ఆక్వా ఫీడ్స్‌ ప్రొప్రైటర్‌