Sep 24,2023 06:59
  •  ఖరీఫ్‌లో భారీగా నకిలీ నమోదుల గుర్తింపు
  •  నాలుగు జిల్లాల డిఎఓలకు మెమోలు
  •  అత్యధిక ఎంట్రీలైన జిల్లాలపై ప్రత్యేక నిఘా
  •  బోగస్‌లతో రైతులకు నష్టం

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : రైతుల కోసం అమలు చేస్తున్న అన్ని పథకాలకూ ప్రభుత్వం ఇ-క్రాప్‌ను తప్పనిసరి చేయగా, సదరు ఇ-క్రాప్‌ నమోదుల్లో డొల్లతనం బయట పడుతోంది. అనర్హుల ఏరివేత, అర్హులకే లబ్ధి, పూర్తి పారదర్శకత.. ఇవన్నీ ఉత్తుత్తి కబుర్లేనని తేలిపోతోంది. ఇ-క్రాప్‌ నమోదుల కోసం ఏటేటా టెక్నాలజీ పరంగా కొత్త ఫీచర్స్‌తో అప్‌డేట్‌ వెర్షన్లు ప్రవేశపెడుతున్నామంటున్నా నకిలీ ఎంట్రీలు ఆగట్లేదు. నియంత్రణల్లోని లొసుగులను ఇట్టే పసిగట్టి తప్పుడు మార్గాలను అన్వేషంచి తమ పని తాము చేసుకుపోతున్నారు. ఈ ఖరీఫ్‌లో ఇ-క్రాప్‌ బుకింగ్‌ల్లో పెద్ద ఎత్తున తప్పిదాలు జరిగినట్లు వ్యవసాయశాఖ గుర్తించింది. బోగస్‌ ఎంట్రీలకు పాల్పడ్డ జిల్లాల అధికారులకు మెమోలు జారీ చేసింది. అతి తక్కువ సమయంలోనే వంద శాతం ఎంట్రీలతో ముందున్న నెల్లూరు, తిరుపతి డిఎఓలకు మెమోలిచ్చినట్లు సమాచారం. అన్నమయ్య, కర్నూలు అధికారులకూ తాఖీదులిచ్చినట్లు తెలిసింది. అలాగే 70 శాతానికిపైన ఇ-క్రాప్‌ అయిందని చెబుతున్న బాపట్ల, కడప, శ్రీకాకుళం, ప్రకాశం, గుంటూరు, నంద్యాల జిల్లాలపై గట్టి నిఘా ఉంచారు.

ప్లేస్టోర్‌లో డౌన్‌లోడ్‌

ఆర్‌బికె సిబ్బంది రైతుల పొలాలను సందర్శించకుండానే ఇళ్లల్లో, ఆఫీస్‌ల్లో కూర్చొని పంట సాగులను నమోదు చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ తడవ యాప్‌ ఫీచర్స్‌లో మార్పులు చేశారు. సిబ్బంది తప్పనిసరిగా పొలాల వద్దకెళ్లి రైతుల ఫొటోలతో సహా వివరాలు నమోదు చేసేలా యాప్‌ను రూపొందించారు. 200 మీటర్ల రేడియస్‌లోకి వెళితేనే యాప్‌లో సర్వేనెంబర్‌ ఓపెన్‌ అవుతుందని, సిబ్బంది అనివార్యంగా పొలాల దగ్గరకెళ్లాల్సిందేనని చెప్పారు. సిబ్బంది దీనికీ లొసుగులు కనుక్కొన్నారు. ఎంఎఓల డౌన్‌లోడ్స్‌ను కాకుండా గూగుల్‌ ప్లేస్టోర్‌లో జియోకోర్డినేట్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని సర్వేనెంబర్లను సెలెక్ట్‌ చేసి ఎక్కడి నుంచైనా ఎంట్రీ చేసే మెథడ్‌ను అనుసరిస్తున్నారు. ఒక ట్యాబ్‌, రెండు మూడేసి స్మార్ట్‌ ఫోన్లు పెట్టుకొని ఇ-క్రాప్‌ ఎంట్రీలు చేస్తున్నారు. వాస్తవంగా పంటలు సాగు కాకపోయినా ఉజ్జాయింపు గణాంకాల ఆధారంగా ఎంట్రీలు చేశారని గుర్తించారు. నాలుగైదు రోజుల్లోనే నెల్లూరు జిల్లాలో వంద శాతం ఇ-క్రాప్‌ కావడంతో అనుమానం వచ్చి పరిశీలించగా నకిలీ ఎంట్రీలుగా గుర్తించారు. వ్యవసాయశాఖ మంత్రి జిల్లాలోనే ఈ విధంగా జరగడంతో డిఎఓకు మెమో ఇచ్చినట్లు సమాచారం. తిరుపతిలోనూ 98 శాతంపైన ఎంట్రీలు కావడంపై డిఎఓకు మెమో ఇచ్చారు. అధిక ఎంట్రీలున్న మరికొన్ని జిల్లాలపైనా దృష్టి సారించారు.

సూపర్‌వైజరీ చెక్స్‌లో బట్టబయలు

ఆర్‌బికె సిబ్బంది ఎంట్రీ, విఆర్‌ఒ అథంటికేషన్‌ తర్వాత రెవెన్యూ, వ్యవసాయశాఖ వివిధ స్థాయి అధికారుల జాయింట్‌ అజమాయిషీ ఉంది. వ్యవసాయశాఖ దగ్గరకొస్తే వివిఎలు చేసిన నమోదుల్లో నుంచి ర్యాండమ్‌గా 10 శాతం ఎంట్రీలను ఎంఎఒ చెక్‌ చేయాలి. ఎ.డి.లు 5 శాతం, డిఎఒలు 2 శాతం సూపర్‌వైజరీ చెక్‌ చేయాలి. ఇప్పటి వరకు డిఎఒలు రాష్ట్ర వ్యాప్తంగా 2,411 ఎంట్రీలను పరిశీలించగా 781 తప్పుగా గుర్తించారు. సుమారు 33 శాతం. నెల్లూరులో 481 ఎంట్రీలను తనిఖీ చేస్తే 287 తప్పు ఎంట్రీలుగా తేలింది. తిరుపతిలో 224 ఎంట్రీలను చెక్‌ చేస్తే 108 తప్పులు, అన్నమయ్యలో 58 చెక్‌ చేస్తే 20 తప్పులు, శ్రీకాకుళంలో 94 చెక్‌ చేస్తే 92 తప్పులు, గుంటూరులో 102 చెక్‌ చేస్తే 22 తప్పులు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎ.డి.లు చేసిన తనిఖీలలో 15 శాతం, ఎంఎఓలు చేసిన తనిఖీలలో దాదాపు 3 శాతం తప్పుల తడకలు. ఎంఎఒ, ఎ.డి, డిఎఒల మొత్తం చెకింగ్‌లలో 5.6 శాతం తప్పులని తేలింది. మచ్చుకు చేసిన తనిఖీల్లోనే ఇన్నేసి తప్పులుంటే అన్ని ఎంట్రీలనూ తనిఖీ చేస్తే ఇంకెన్ని తప్పులుంటాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. నమోదుల్లో లోపాల కారణంగా అర్హులైన రైతులు ప్రభుత్వ పథకాలను, సబ్సిడీలను కోల్పోతున్నారు. కౌలు రైతులు మరింతగా నష్టపోతున్నారు.