Jul 27,2023 07:20
  • శ్రీసత్యసాయి, నెల్లూరులో అక్రమాలు
  • సిఎం, మంత్రి సీరియస్‌

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : రైతుల కోసం అమలు చేస్తున్న అన్ని పథకాలకూ ఇ-క్రాప్‌ను ప్రభుత్వం ప్రామాణికం చేయగా, సదరు ఇ-క్రాప్‌ నమోదుల్లో అక్రమాలు ఒక్కొక్కటి బయటికొస్తున్నాయి. నిరుడు ఖరీఫ్‌లో రైతులు సాగు చేయకుండా బీడు పెట్టిన భూముల్లో పంటలు సాగైనట్లు ఇ-క్రాప్‌ రికార్డులు సృష్టించిన ఉదంతాలు శ్రీసత్యసాయి, నెల్లూరు జిల్లాల్లో వెలుగు చూశాయి. ఒక వైపు భూములు ఖాళీగా కనిపిస్తుండగా ఇంకో వైపు ఇ-క్రాప్‌లో పంటలు సాగైనట్లు నమోదు చేశారు. ఇ-క్రాప్‌లో సాగుల నమోదుకు ఒక్కొక్క రైతు నుంచి కనీసం రూ.500-1,000 వసూలు చేశారు. ఒక్కొక్క రైతు భరోసా కేంద్రం (ఆర్‌బికె)కు కనీసం రూ.రెండు లక్షలు వసూలు చేసేలా టార్గెట్‌లిచ్చి మరీ అవినీతికి పాల్పడ్డారు. బీడు భూములే కాకుండా రైతులు సాగు చేసిన పంటకు బదులు వేరే పంటలను నమోదు చేశారు. ఈ అక్రమాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది. సమగ్ర దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ స్పెషల్‌ కమిషనర్‌ను ఆదేశించనట్లు సమాచారం. వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి సైతం ఈ విషయంపై కమిషనర్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. మరికొన్ని జిల్లాల నుంచీ ఇ-క్రాప్‌ అక్రమాలపై ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర వ్యాస్తంగా కూలంకషంగా పరిశీలించాలని మంత్రి సూచించినట్లు సమాచారం.
వాటాలేసుకున్నారు!
శ్రీసత్యసాయి జిల్లాలో ఒక వ్యవసాయశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఎడి) 2022-23 ఖరీఫ్‌లో ఇ-క్రాప్‌ నమోదుల సమయంలో కింది స్థాయిలోని ఎ.ఒ.లకు, ఆర్‌బికె అసిస్టెంట్లకు టార్గెట్‌లు ఫిక్స్‌ చేశారు. బీడు భూముల్లో పంటలు వేసినట్లు ఇ-క్రాప్‌లో నమోదు చేయాలంటే ఒక్కో రైతు నుంచి రూ.500 వసూలు చేయాలని నిర్ణయించారు. ఒక్కో ఆర్‌బికె పరిధిలో వెయ్యి మంది వరకు రైతులుంటారు. వారిలో 400 మంది పంటలు వేయలేదు. వారి నుంచి రూ.500 చొప్పున తీసుకొని పంట వేసినట్లు ఇ-క్రాప్‌లో ఎక్కించేందుకు ప్లాన్‌ చేశారు. మరో ప్యాకేజీనీ ముందుకు తెచ్చారు. ఆర్‌బికె నుంచి ఎంతైనా వసూలు చేసుకోండి తమకు మాత్రం రూ.60 వేలు ఇవ్వండని మాట్లాడుకున్నారు. ఆ డబ్బును ఎ.డి., ఎ.ఒ, ఇంకా పైకి వాటాలు వేశారు. మీడియాకూ వాటా ఇవ్వాలన్నారు. ఈ రకంగా వసూలు చేసిన అమౌంట్‌లో వాటాలు కుదరక ఒక మీటింగ్‌లో తేడాలొచ్చి విషయం బహిర్గతమైంది. సిఎం, మంత్రి వరకు వెళ్లింది. ఇటువంటి ఆరోపణలే వ్యవసాయ మంత్రి జిల్లా నెల్లూరులోనూ వెలుగు చూశాయి.

  • విసిలో వార్నింగ్‌

మంగళవారం కమిషనర్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ (విసి)లో ఇ-క్రాప్‌ అక్రమాల అంశం చర్చకొచ్చింది. ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, అక్రమార్కులను ఎవ్వరూ కాపడలేరు, జాగ్రత్తగా ఉండాలని కమిషనర్‌ హెచ్చరించారు. తాను విసికి ఆలస్యంగా రావడానికి కారణం ఇదేనని, మంత్రి పిలిపించి మాట్లాడారని అధికారులకు చెప్పినట్లు సమాచారం. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇ-క్రాప్‌ అక్రమాలపై ఆరోపణలొస్తున్నాయి. అక్రమాల వెనుక అక్కడక్కడ అధికారపార్టీ నేతల ఒత్తిళ్లు, అండ ఉంటున్నాయని వ్యవసాయశాఖ అధికారులు వాపోతున్నారు.