Jul 10,2023 08:25
  • దిగుబడి ఆధారితానికి 'లోనీ ఫార్మర్సే'
  • నమోదుల్లో తప్పులతో కోత
  • ఇన్సూరెన్స్‌ పరిధిలోకొచ్చింది
  • 25 లక్షల మంది రైతులు 
  • ఎస్‌సి, ఎస్‌టిలు ఒక్క శాతమే
  • కౌల్దార్ల ఎంట్రీ నామమాత్రం

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : నిరుడు ఖరీఫ్‌లో విపత్తు నష్టాలకు ప్రభుత్వం అమలు చేసిన దిగుబడి ఆధారిత పంటల బీమా క్లెయిములకు ఇ-క్రాప్‌ చిదిమేసింది. ఇ-క్రాప్‌లో నమోదైన రైతులందరికీ బీమా అమలవుతుందని ప్రభుత్వం పేర్కొనగా కేంద్ర పథకం ఫసల్‌బీమాలో చేరాక ఆ నిబంధనలు ఇ-క్రాప్‌ డేటాను పక్కన పడేశాయి. కేవలం బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతుల దరఖాస్తులనే పరిగణనలోకి తీసుకొని పంటలకు ఇన్సూరెన్స్‌ వర్తింపజేశాయి. రుణాలు తీసుకోని (నాన్‌లోనీ ఫార్మర్స్‌) వారిని వదిలేశాయి. లోనీ ఫార్మర్స్‌ అప్లికేషన్లు ప్రాసెస్‌ చేసే క్రమంలో మాత్రం ఇ-క్రాప్‌ డేటాతో సరిచూశారు. బ్యాంక్‌ రుణానికి నమోదైన పంట, ఇ-క్రాప్‌లో ఎక్కిన పంట ఒకటైతేనే ఇన్సూరెన్స్‌ పరిధిలోకి తీసుకొచ్చారు. దాంతో బీమా పరిధిలోకొచ్చిన రైతుల సంఖ్య బాగా తగ్గిపోయింది. పలు కొర్రీలతో కంపెనీలు ఆ మేరకు రైతులకు కూడా పరిహారం ఇవ్వట్లేదు. 2022 ఖరీఫ్‌లో 51 లక్షల ఎకరాలకు నోటిఫై చేసిన పంటలకు బీమా చేశారు. బ్యాంకుల్లో లోన్‌ తీసుకున్న 75,87,196 మంది రైతుల దరఖాస్తులురాగా వాటిలో 25,28,680 అర్జీలే ఇన్సూరెన్స్‌ చేయించడానికి అర్హత సాధించాయి. వాటిలో ఆరు లక్షల లోపు రైతులకు ఇప్పుడు పరిహారం ఖరారైందని సమాచారం. గతేడాది ఖరీఫ్‌లో కోటీ పది లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యానవన పంటలు వేయగా నూటికి నూరు శాతం ఇ-క్రాప్‌ జరిగిందని ప్రభుత్వం అప్పట్లో పేర్కొంది. దిగుబడి ఆధారిత బీమాకు సగం దరఖాస్తులు కూడా అర్హత సాధించలేదని తెలుస్తోంది.
 

                                                                  ఎస్‌సి, ఎస్‌టిలు స్వల్పం

నిరుడు ఖరీఫ్‌లో పంటలకు ఇన్సూరెన్స్‌్‌ చేసిన రైతుల్లో ఎస్‌సి, ఎస్‌టి రైతులు ఒక శాతమే ఉన్నారు. బీమా పరిధిలోకొచ్చిన ఎస్‌సి రైతులు 1.25 శాతం, ఎస్‌టిలు 1.11 శాతం. బీమా చేయించే దశలోనే ఆ వర్గాల రైతులు ఇంత తక్కువ ఉంటే పరిహారం పొందే విషయంలో ఇంకెంత తక్కువ మంది ఉంటారో ఊహించవచ్చు. బీమా పరిధిలోకొచ్చిన ఒబిసి రైతులు 79.67 శాతం, జనరల్‌ కేటగిరి రైతులు 17.97 శాతం.
 

                                                                     కౌలు రైతులు నామమాత్రం

దిగుబడి ఆధారిత బీమాలో కౌలు రైతులు రెండు విధాలా నష్టపోయారు. ఇ-క్రాప్‌లో ఎక్కాలన్న నిబంధన ఒక వైపు కౌలు రైతులను బీమాకు దూరం చేసింది. కౌలు గుర్తింపు కార్డులు (సిసిఆర్‌సి) నాలుగైదు లక్షల మందికే ఇచ్చారు. వారిలో 70 వేల మందికే బ్యాంకులు రుణాలిచ్చాయి. ఫసల్‌ బీమాకు లోనీ ఫార్మర్స్‌ను పరిగణనలోకి తీసుకున్నారు. దాంతో కౌలు రైతుల దరఖాస్తులు చాలా తక్కువ సంఖ్యలో పరిశీలనలోకి వచ్చాయి. ఇ-క్రాప్‌లో తప్పుల తడకల వలన ఆ వచ్చిన అర్జీల్లో చాలా మట్టుకు ఇన్సూరెన్స్‌్‌ పరిధిలోకి రాలేదు. పరిహారం దగ్గరకొచ్చేసరికి కౌలు రైతులకు బీమా పరిహారం నామమాత్రం కూడా లేదని సమాచారం. కౌలు రైతుల అర్జీలు తగ్గినందునే ఎస్‌సి, ఎస్‌టి రైతులు చాలా తక్కువగా ఇన్సూరెన్స్‌ పరిధిలోకొచ్చారని విశ్లేషిస్తున్నారు.

11