Sep 09,2023 07:20
  •  డౌన్‌లోడ్‌, ఎర్రర్‌, సబ్మిట్‌ సమస్యలు
  •  రైతులకు పథకాల నష్టం
  •  కొత్త విధానంలోనూ కౌల్దార్లకు అన్యాయం

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ఇ-క్రాప్‌ ఉంటేనే రైతులకు పథకాలని ప్రభుత్వం చెప్పగా సదరు ఇ-క్రాప్‌ నమోదుల ప్రక్రియ ఏడాదేడాదీ మార్పులకు గురవుతోంది. ఒక సారి ఉన్న విధానం మరుసటి సీజన్‌కు ఉండట్లేదు. కొత్త విధానాన్ని క్షేత్ర స్థాయి సిబ్బంది ఆకళింపు చేసుకునేసరికే సమయమైపోతోంది. పై నుంచి వచ్చే ఒత్తిడితో ఆదరాబాదరగా నమోదుల వ్యవహారాన్ని మమ అనిపించడంతో అంతిమంగా రైతులు సర్కారీ స్కీంలను నష్టపోతున్నారు. కడకు పండించిన పంటలను సైతం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకొనే వీల్లేని దారుణ పరిస్థితి. ఇ-క్రాప్‌ నిబంధనల్లో కౌలు రైతుల నమోదుకు స్పష్టమైన గైడ్‌లైన్స్‌ లేకపోవడంతో లక్షలాది కౌల్దార్లు తామే వాస్తవ సాగుదారులైనప్పటికీ గుర్తింపు కొరవడి అన్ని విధాలా నష్టపోతున్నారు. ఈ సంవత్సరం ఖరీఫ్‌ సాగుల నమోదు (ఇ-క్రాప్‌) సెప్టెంబర్‌ 30 నాటికి పూర్తి చేయాలని వ్యవసాయశాఖ లక్ష్యాన్ని నిర్దేశించింది. కొన్ని చోట్ల గడువు సెప్టెంబర్‌ 15 అంటున్నారు. సరైన వానల్లేక ఈ మారు ఖరీఫ్‌ సాగు బాగా తగ్గింది. ఇప్పుడు పడుతున్న వర్షాలకు వీలున్న ప్రాంతాల్లో మెట్ట, ఆరుతడి పంటలు వేస్తున్నారు. సాధారణ సాగులో ఇప్పటికి 63 శాతం పంటలు సాగైనట్లు ప్రభుత్వం వెల్లడించింది.. కొన్ని చోట్ల 30 శాతం కంటే లోపు సేద్యం జరిగింది. అందుకే ఇ-క్రాప్‌ నమోదులు రాష్ట్రంలో 10-20 శాతం లోపే జరిగాయి. త్వరగా పూర్తి చేయాలని ఉన్నతాధికారులు వెంటపడుతున్నారు.

యాప్‌లో కొత్త ఫీచర్లు

అవినీతి, అక్రమాల ఆరోపణలతో ఇ-క్రాప్‌ యాప్‌లో ఈసారి జియోట్యాగింగ్‌ తీసుకొచ్చారు. ఆర్‌బికె సిబ్బంది నమోదు చేయాల్సిన పొలానికి 200 మీటర్ల పరిధిలోనే సర్వేనెంబర్‌ ఓపెన్‌ అవుతుంది. సిబ్బంది పొలాల వద్దకెళ్లి తీరాలి. గతంలో ఆఫీసుల్లో, ఎక్కడంటే అక్కడ కూర్చొని ఎంట్రీ చేసే వీలుండేది. కొత్త విధానంలో ఆ అవకాశం లేదంటున్నారు. మండల వ్యవసాయాధికారి (ఎఒ) సర్వేనెంబర్లను డౌన్‌లోడ్‌ చేసి గ్రామాల వారీగా ఆర్‌బికె సిబ్బందికి సెండ్‌ చేయాలి. వాటిని సిబ్బంది డౌన్‌లోడ్‌ చేసుకొని పొలాల వద్దకెళ్లి నమోదు చేయాలి. చాలా చోట్ల ఇప్పటికీ సర్వేనెంబర్‌ డౌన్‌లోడ్లు పూర్తి కాలేదు. ఒక పట్టాన డౌన్‌లోడ్‌ కావట్లేదు. పొలాల వద్దకెళ్లాక నిర్దేశిత సర్వే నెంబర్లు ఓపెన్‌ కావట్లేదు. ఓపెన్‌ అయ్యాక పది అంశాలు నమోదు చేయాలి. టెక్నికల్‌ ఎర్రర్స్‌ వలన చాలా సమయం పడుతోంది. ఎంట్రీలన్నీ పూర్తి చేశాక రైతుల నుండి డిజిటల్‌ వేలిముద్రలు తీసుకోవాలి. వివిఎ అథంటికేషన్‌ చేయాలి. అనంతరం విఆర్‌ఒ అథంటికేషన్‌ చేయాలి. ఈ ప్రాసెస్‌లో ఎర్రర్స్‌ వస్తున్నాయి. ఒక అధికారి నుంచి మరొక అధికారికి అథంటికేషన్‌ కోసం సెండ్‌, సబ్మిట్‌ చేసే క్రమంలో ఫార్మాట్‌, అందులోని అంశాలు కనిపించట్లేదు. దాంతో రైతులు, సిబ్బంది లబోదిబోమంటున్నారు. భూముల వివరాలను రెవెన్యూ డిపార్టుమెంట్‌ నుంచి తీసుకున్నారు. సర్వేనెంబర్లు, వాటి యజమా నుల సమాచారం తప్పుల తడకగా ఉన్నాయి. కౌలు రైతుల వివరాలు అసలే లేవు. సిసిఆర్‌సి, ఇతర గుర్తింపు పత్రాలు ఉన్నా కౌల్దార్ల పేర్లు ఎక్కించలేదు.

అక్రమాలకు ఆస్కారం

జియోట్యాగింగ్‌ వలన తప్పనిసరిగా సిబ్బంది ఫీల్డ్‌ విజిట్‌ చేయాల్సి ఉన్నా పంటల నమోదులో అక్రమాలకు వెసులుబాట్లు అలానే ఉన్నాయి. యాప్‌లో సర్వేనెంబర్‌ ఓపెన్‌ అయ్యాక రైతు వేయని పంటను వేసినట్లు రికార్డు చేసే అవకాశం ఇప్పటికీ ఉంది. అలా చేస్తే ఇన్సూరెన్స్‌, ఇన్‌పుట్‌ సబ్సిడీ, బ్యాంక్‌ రుణాలు తదితర విషయాల్లో అనర్హులకు లాభం, వాస్తవ రైతులకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కొత్త యాప్‌లోనూ లోపాలున్నాయని రైతులు వాపోతున్నారు.