వానంటేనే అద్భుత దశ్య కావ్యం. ఇంక పూలపూల వానంటే ఎంత పరిమళ భరితమో కదా! ఒక్కో చినుకు నేలను తాకుతూ చిన్ని చిన్ని రేణువులుగా విస్ఫోటనం చెంది చిందులేస్తుంటే అది ఒక మనోహర దృశ్యం. పెద్ద వాళ్ళయితే బాల్యపు గది తలుపులు తెరవడమో లేక తలపుల్లో తడవడమో చేస్తారు. పిల్లలయితే అల్లరిగా వెళ్ళి చినుకులను వాళ్ళకు నచ్చిన ఆటల్లోకి ఒంపేసుకుంటారు.
'పూల పూల వాన' డా.ఏనుగు నరసింహారెడ్డి కవిత్వం. ఈ టైటిల్ చూసి కవిత్వం నిండా వాన ఉంటుందని అనుకుంటే పొరబాటే. కవిత్వంలో వాన కాదు, ప్రతి కవిత చినుకంత చిన్నగా చదువుతుంటే వానలో తడుస్తున్నంత హాయిగా ఉంటుంది. ఇది ఒక లఘు కవితల సమాహారం.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి సాహితీవేత్తగా అందరికీ సుపరిచితులైన డా.ఏనుగు నరసింహారెడ్డి ప్రస్తుతం మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరు వచన కవిత్వం, రుబాయీలు, పద్యాలు, అనువాదాలు, విమర్శనా వ్యాసాలు ... ఇలా అనేక ప్రక్రియల్లో తనదంటూ ఓ ప్రత్యేక శైలితో సాహిత్య ప్రయాణం కొనసాగిస్తున్నారు. వీరు ప్రభుత్వ ఉన్నతాధికారి, ప్రముఖ సాహితీవేత్త మాత్రమే కాదు... మృదుభాషి, మంచి స్నేహశీలి.
ఈ పుస్తకంలో మూడు లేదా నాలుగు చిన్ని చిన్ని పాదాల లఘు కవితల్లో కవి తన మనసులోని భావాలను, స్పందనలను అక్షరీకరించారు. ఈ పుస్తకానికి ఈ పేరు పూర్తిగా సరిపోతుంది. తమ ముందుమాటలో మనల్ని ఓ మాట అడుగుతారు. 'ప్రకృతిలో నడుస్తున్నప్పుడో, వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడో, పరవశించినప్పుడో, పస్తాయించినప్పుడో కొన్ని ఊహల ముత్యాలు రాలుతుంటాయి. అవి కాగితం చెట్టుమీద తమకు తాము పోతపోసుకున్న పూలైపోయాయి. అవి రాతల రత్నాలై నేను పాసయ్యానా లేదా మీరు చెబితేనే తెలిసేది...' అని. ఈ కవి నూరు శాతం కన్నా ఎక్కువ మార్కులతోనే పాసయ్యారని చెప్పొచ్చు. ఇది 'పూల పూల వాన' మాత్రమే కాదు; అక్షరాలా 'ముత్యాల పూల వాన'.
'అంత విశాలమంటారా ఆకాశాన్ని/ ఆనందంతో గంతులేయడానికి/ అంతరంగమంత పెద్దదేదీ/ నాకింతవరకు కనపడనే లేదు' .మొదటి లఘు కవిత ఇది. మనసే ఈ విశ్వంలో అత్యంత విశాలమైనది అంటూ మనసుకు పెద్ద పీట వేశారు. మనసు అత్యంత విశాలమైనదే కాదు, అత్యంత సున్నితమైనది కూడా. మనసులో సున్నితత్వం కొరవడితే అది మనకు విశాలంగా కూడా కనిపించదు. 'తాటిచెట్టులో/ కల్లొక్కటే చూస్తే ఎలా/ ఆ తల్లి కావ్యాల్ని మోసింది...' వహ్వా అని అనలేకుండా ఉండలేం. గ్రంథాలు, కావ్యాలు అన్నింటినీ మోసిన తాటిచెట్టులో కల్లొక్కటే చూస్తే ఎలా? పేదవారి ఎన్నో పూరి గుడిసెలకు కూడా తానేగా పైకప్పు, వారి స్వేదాన్ని సాంత్వన పరిచే విసనకర్ర... ఎంత ఆత్మీయురాలు కదా ఈ తాటి చెట్టు. 'ఎదిగిన వాళ్ళను చూసి/ అసలే ఏడ్వలేదా, అయితే నువ్వు/ తప్పక ఎదిగే ఉంటావు'. అక్షర సత్యం ఇది. ఎదుటి వాళ్ళ ఉన్నతిని కాంక్షించే వాళ్ళు ఎంతో సహృదయంతో ఉంటారు. వాళ్ళల్లో ఈర్ష్యా ద్వేేషాలు ఎప్పుడో నశించి ఉంటాయి.
'పదే పదే చెప్పకు/ పునరుక్తి ఎక్కువైతే/ చెప్పేది నిజమే అనే/ సందేహం పురుడు పోసుకుంటది.' ఇది కవిత్వం స్టేజ్ పైన చదివే కవులకు తప్పకుండా వర్తిస్తుంది. ఒక కవితలో ఎక్కడో ఓ చోట కొన్ని పాదాలను పునరుక్తి చేస్తే బాగుంటుంది. కానీ ఇటీవల కొద్దిమంది ప్రతి పాదాన్ని పునరుక్తి చేస్తూ ఎదుటి వాళ్ళు వినలేనంతగా విసిగించడం జరుగుతోంది.
'అందిపుచ్చుకోలేక/ ఆమెను కవిత్వంలో చిత్రించాను/ అక్కడ కూడా నవ్వమని ఎవరన్నారు/ కాస్త భావుకతతో కూడిన ఓ అందమైన ఊహ. ఊహలెపుడూ మనోహరంగా ఉండాలి. మనసును అప్పుడప్పుడు ఉల్లాసంగా ఉంచేందుకు....
'నీ అయ్య జాగీరా?/ అనలేక పోతుంది ప్రజ
ఆఫీసులో చూసి మనల్ని' ఎంత నిష్పక్షపాతంగా ఈ విషయాన్ని రాశారో అనిపించింది ఇది చదివాక. కొన్ని కార్యాలయాల్లో మనం నిత్యం చూస్తూనే ఉంటాము అధికారుల నిర్లక్ష్యాన్ని. మన మనసుల్లో ఉప్పెనలా ఎగసే ఆవేశం, ఆవేదనా ఎన్నో అనాలని అనిపిస్తుంది. ఏమీ అనలేక అసహాయంగా ఇలా మనసులో అనుకుంటాం.
'ఫైళ్ళను నిర్లక్ష్యం చేయకు/ అవి నీ ముందు సాష్టాంగ పడ్డ దైన్యాలు' .... ఇలాంటి ఎన్ని చురకలు వేయాలో, ఎంత సమర్పించుకోవాలో మన పనులు సజావుగా సాగాలంటే... మన ఫైళ్ళు ముందుకు కదలాలంటే...
ఏచపల చిత్తుడు చంద్రుడు/ రోజూ ఒకలా అసలుండడు.' నిజమే... చంద్రుడే కాదు మనుషులు కూడా అస్సలు ఒకలా ఉండడం లేదు. 'తిరుగు ప్రయాణం లేని/ చివరి రైలెక్కక ముందే/ ఎవరికైనా బాకీ పడ్డామేమో/ తరచి తరచి చూసుకోవాలి.' గొప్ప వాక్యాలు ఇవి. ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. జీవితం చరమాంకం ముందే మనం నిర్వహించాల్సిన ఎన్నో పనులను ముగించాలి, బాకీలకు లెక్క చూడాలి. అందరి గుండెల్లో కొంతకాలమైనా మనమో జ్ఞాపకమవ్వాలి. 'వాడు కత్తి పట్టుకుని/ పూవుల్ని కోసేయగలడేమో కానీ/ రాబోయే వసంతాన్ని/ ఏ ఆయుధమూ ఆపలేదు.' ఒక విప్లవ స్వరాన్ని గొంతు నొక్కి అణచేసినంత మాత్రాన విప్లవమనేది అక్కడితో ఆగిపోదు. అది మరింతగా ఉద్భవిస్తుంది వేయి గొంతుకలతో తన స్వరాన్ని విన్పిస్తుంది.
'హృదయం పూర్తిగా పునీతం కావాలంటే/ రెప్ప మూయకుండానే/ కారిపోయేంత కన్నీరు కావాలి.' గుండె బరువును తగ్గించుకోవాలంటే గుండెలోని బాధ నదిలా మారాలి. తేలికయ్యేంత వరకు మనసు తెరిపిన పడేంత వరకు... 'ఎవ్వరికీ తెలియని చీకట్లో/ కొత్త వెలుగుల తారాజువ్వవు కా/ దీపావళి అమావాస్య నాడే/ ఎందుకు పెట్టారో తెలుసుకో.' బతకడమంటే ఏదో ఒకలా బతకడం అందరిలా మరలిపోవడం కాదు... మన బతుకు మరి కొన్ని బతులకు వెలుగవ్వాలని అమావాస్య నాటి దీపావళిలా ప్రభవించాలని అంటున్నారు కవి. ఈ లఘు కవితలన్నీ గొప్ప సందేశాత్మకంగా ఉన్నాయి. చదివితే ఓ సన్నని వాన తుంపరల్లో తడిసిన అనుభూతి కలుగుతుంది. మంచి పుస్తకాన్ని అందించిన డా. ఏనుగు నరసింహారెడ్డి గారికి హదయ పూర్వక అభినందనలు.
- శాంతి కృష్ణ
95022 36670










