
- స్తంభించిన ఎగుమతులు
- రూ.200 కోట్ల వరకూ నష్టం
- ఉపాధిని కోల్పోయిన కార్మికులు
ప్రజాశక్తి - మామిడికుదురు, అంబాజీపేట : కోనసీమ ప్రజల ఆర్థిక స్థితిగతులకు కొబ్బరే ఆధారం. రైతులతో పాటు వ్యాపారులు, కార్మికులకు బతుకు తెరువు చూపించే పంట ఇది. ప్రస్తుతం కొబ్బరి పంట వరదపోటుకు గురైంది. ఫలితంగా రైతులు తీవ్ర నష్టాలకు గురి కాగా వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు.
డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 1.35 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు అవుతోంది. ఇందులో 65 వేల ఎకరాలకు పైగా కొబ్బరి తోటలు లంక గ్రామాల్లోనే ఉన్నాయి. ఇక్కడ ప్రతి రోజూ కాయల దింపు జరుగుతూనే ఉంటుంది. అన్ సీజన్ కావడంతో ఇటీవల ధర పడిపోయింది. అంతేకాకుండా రానున్న శ్రావణమాసం, వినాయక చవితి పండుగల నేపథ్యంలో కొబ్బరికి ఎక్కువగా ధర ఉంటుంది. ఈ నేపథ్యంలో కూడా రైతులు, వ్యాపారులు కొబ్బరిని ఎక్కువగా దాచుకున్నారు. దీంతో రైతులు దింపుకున్న కొబ్బరికాయలను ఇళ్ల వద్ద, పొలాల్లో రాశులుగా పోసి ఉంచుకున్నారు. లంక గ్రామాల్లో 7.5 కోట్ల వరకూ కొబ్బరి కాయలు నిల్వ ఉన్నట్టు ప్రాథమిక సమాచారం. గతంలో రోజుకు 300 నుంచి 400 లారీల వరకూ కొబ్బరి ఎగుమతి అయ్యేది. ప్రస్తుతం 30 నుంచి 40 లారీల లోడు మాత్రమే ఎగుమతి అవుతుంది.
వరదలతో తీవ్ర నష్టం
కోనసీమ జిల్లాలో 18 మండలాల్లో 116 లంకగ్రామాలు వరద తాకిడికి గురయ్యాయి. ఈ గ్రామాల్లో ఏడున్నర కోట్లకు పైగా కొబ్బరి కాయలు నీటిలో తడిశాయి. 15 రోజులుగా నీటిలో ఉండటంతో చాలావరకు కాయలు పాడైపోయాయి. కొన్ని మొలకలు సైతం వచ్చాయి. లంకల నుంచి పడవల్లో పది శాతం కాయలను మాత్రమే రైతులు తరలించుకోగలిగారు. మిగిలినవి ఇంటి వద్ద, పొలాల్లో ఉంచేశారు. వరదల కారణంగా రోడ్లన్నీ ఛిద్రంగా మారడంతో లంకల్లో కొబ్బరిని బయటకు తరలించాలంటే మరో పది నుంచి 15 రోజులు వరకూ సమయం పడుతుంది. ఇప్పటికే ఎగుమతులు లేక, వరదల వల్ల సుమారు రూ.115 కోట్ల వరకూ నష్టం వాటిల్లినట్టు రైతులు చెబుతున్నారు.
వేలాది మంది ఉపాధికి దూరం
కోనసీమ జిల్లా వ్యాప్తంగా కొబ్బరి ఒలుపు, దింపు కార్మికులు 15 వేల నుంచి 20వేల మంది వరకూ ఉన్నారు. వీరితో పాటూ లోడింగ్, అన్‌లోడింగ్ కోసం మరో పది వేల మంది కార్మికులు పనిచేస్తుంటారు. ఆయా ప్రాంతాల్లో చిరు వ్యాపారులు మరో ఐదువేల మంది వరకూ ఉంటారు. ప్రస్తుతం వర్షాలు, వరదల నేపథ్యంలో దింపు, ఒలుపు పనులను రైతులు, వ్యాపారులు నిలిపేశారు. ఒక పక్క ఉపాధికి దూరమవ్వడం, మరో పక్క వరద బాధలతో వారంతా సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అందించిన బియ్యం, పప్పులు, దాతలు అందిస్తున్న భోజనం ప్యాకెట్లతోనే బతుకును వెళ్లదీస్తున్నారు. తమకు ఉపాధి దొరికే వరకూ ఆర్థిక సాయం అందించాలని కార్మికులు కోరుతున్నారు.
రూ.2 కోట్ల నష్టం వాటిల్లింది
పాశర్లపూడి లంకను వరద చుట్టుముట్టింది. నివాసాల చుట్టూ పెద్ద ఎత్తున నీరు చేరింది. ఇళ్ల వద్ద, పొలాల్లో ఉంచిన 30 లక్షలకు పైగా కొబ్బరి కాయల రాశులు నీటమునిగాయి. కొన్ని కొబ్బరికాయలు కొట్టుకుపోయాయి. రూ.2కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. ఉన్న కొబ్బరిలో కొన్నికాయలు మొలకలు కూడా వచ్చాయి. ఈ నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది.
- వాశంశెట్టి ఈశ్వరరావు, కనకేశ్వరరావు, కొబ్బరి వ్యాపారులు, పాశర్లపూడి లంక
మొలకలు వస్తున్నాయి
పదివేలకు పైగా కొబ్బరి కాయలు వారం రోజులుగా నీటిలో నానుతున్నాయి. 50శాతానికి పైగా కాయలకు మొలకలు వచ్చాయి. ఇవి ఎగుమతికి పనికిరావు. ఇప్పటికే దిగుబడి తగ్గి నష్టపోయాం. ఇప్పుడు వరద కూడా నష్టాల్లోకి నెట్టేసింది. ప్రభుత్వం ఆదుకోవాలి.
- వివి.నాయుడు, కొబ్బరి రైతు, పెదపట్నం లంక