Jul 24,2023 10:40

కాబూల్‌ : మధ్య ఆఫ్ఘనిస్థాన్‌లో ఈ నెల 18న సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించినవారి సంఖ్య 26కు చేరుకుంది. 40 మంది గల్లంతయ్యారు. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్థాన్‌ విపత్తు నిర్వహణ అధికారులు ఆదివారం వెల్లడించారు. ఎడతెరిపి లేని భారీ వర్షాలతో మధ్య ఆఫ్ఘనిస్థాన్‌లో ఈ నెల 18వ తేదీ అర్ధరాత్రి ఆకస్మిక వరదలు సంభవించాయి. దేశవ్యాప్తంగా వరదల కారణంగా శుక్రవారం నుంచి ఇప్పటి వరకూ 31 మంది మరణించినట్లు చెప్పారు. ఆస్థులకు, వ్యవసాయ భూములకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. 604 నివాస గృహాలు పూర్తిగా నాశనమయ్యాయని, వందలాది ఎకరాల వ్యవసాయ భూములు నష్టానికి గురయ్యాయని అధికారులు పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో గత నాలుగు నెలల్లో ప్రకృతి విపత్తుల కారణంగా మొత్తంగా 214 మంది ప్రజలు మరణించారు.