- అమెరికాకు నాటో భాగస్వాముల నుంచి వ్యతిరేకత
వాషింగ్టన్ : ఉక్రెయిన్‌కు 80 కోట్ల డాలర్ల గిఫ్ట్ మిలిటరీ హార్డ్‌వేర్ ప్యాకేజి కింద క్లస్టర్ బాంబులను పంపాలని బైడెన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పెంటగాన్ ప్రతినిధి గత వారం వెల్లడించగానే అమెరికాలోని కార్పొరేట్ పత్రికలు సంబరంగా దానిని పతాక శీర్షికలిచ్చి ప్రచురించాయి. అయితే ఆ సంబంర ఎంతో సేపు నిలవలేదు. రష్యాపై క్లస్టర్ బాంబులను ప్రయోగిస్తే దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని నాటో కూటమిలోని పలు దేశాలు అమెరికాను తీవ్రంగా హెచ్చరించాయి. అంతేకాదు, ఆమ్నెస్టీ ఇంటర్నేేషనల్, పలు మానవ హక్కుల సంఘాలు, అమెరికాలోని పౌర సమాజం క్లస్టర్ బాంబులు ఉక్రెయిన్‌కు పంపడాన్ని నిరసిస్తూ వీధుల్లోకి వచ్చాయి. అమెరికాకు ఎప్పుడూ తాన తందానా అనే బ్రిటన్ సైతం పెంటగాన్ చర్యను వ్యతిరేకించింది. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ బహిరంగంగానే తన వ్యతిరేకతను తెలియజేశారు. క్లస్టర్ బాంబుల నిరోధక ఒప్పందంపై సంతకాలు చేసిన 123 దేశాల్లో బ్రిటన్ కూడా ఒకటి అని చెప్పారు. క్లస్టర్ బాంబుల తయారీని నిషేధించా లని, వాటి వినియోగాన్ని నిరుత్సాహపరచాలని ఆ ఒప్పందం చెబుతోందని సునాక్ తెలిపారు. క్లస్టర్ బాంబులు పౌరులకు కూడా ప్రమాదకరమని పేర్కొన్నారు. పేలని బాంబులు సంవత్సరాల తరబడి నేలమీద పడి ఉండి ఏ సమయంలోనైనా పేలవచ్చు అని నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికా ఆయుధ పరిశ్రమ లాబీ మాత్రం దీనిపై ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గొద్దని బైడెన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది. క్లస్టర్ బాంబులను రంగం మీదికి తేవాలన్న అమెరికా ఆలోచన దాని దుర్బలత్వాన్ని తెలియజేస్తోందని రష్యా వ్యాఖ్యానిం చింది. వీటిని ప్రయోగిస్తే యూరప్ మరుభూమిగా మారుతుందని నాటోలోని స్పెయిన్, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ క్లస్టర్ బాంబులను అమెరికా గతంలో వియత్నాం, లావోస్, కంబోడియా దేశాలపై వేసి సామూహిక మానవ హననానికి పాల్పడింది. 1964-1973 మధ్య 26 కోట్ల క్లస్టర్ బాంబులను అమెరికా ఈ దేశాలపై జారవిడిచింది. వీటిలో 8 కోట్ల బాంబులు వెంటనే పేలకుండా అప్పుడప్పుడు పేలుతూ వచ్చాయి. ఈ బాంబులు ఈ ప్రాంతంలోని అనేక మంది రైతులు, పిల్లల ప్రాణలను హరించాయి. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివాన్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, క్లస్టర్ బాంబులు ఫెయిల్యూర్ రేటు బాగా తగ్గిందని అన్నారు. అమెరికా ఉక్రెయిన్ యుద్ధాన్ని సుదీర్ఘ కాలం కొనసాగించాలని చూస్తోందనడానికి ఈ క్లస్టర్ బాంబుల సరఫరా ఒక నిదర్శనమని, ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పడం దాని అభిమతం కాదని పరిశీలకులు భావిస్తున్నారు.










