Aug 26,2023 21:33
  • సూచీలపై సన్నగిల్లుతోన్న విశ్వాసం

ముంబయి : భారత స్టాక్‌ మార్కెట్లపై ఇన్వెస్టర్లకు విశ్వాసం సన్నగిల్లుతోంది. వరుసగా ఐదో వారంలోనూ నష్టాలు చవి చూశాయి. ఆగస్ట్‌ 25తో ముగిసిన వారంలోనూ సూచీలు క్షీణించాయి. గడిచిన 15 మాసాల్లో ఇదే సుదీర్ఘకాల పతనం కావడం ఆందోళకరం. ఫెడరల్‌ రిజర్వ్‌ (ఫెడ్‌) చైర్‌ జెరోమ్‌ పావెల్‌ ప్రసంగానికి ముందు ప్రపంచ మార్కెట్లు శుక్రవారం అప్రమత్తంగా ఉండటంతో పాటుగా దేశీయంగా ద్రవ్యోల్బణ భయాలు మదుపర్ల విశ్వాసాన్ని దెబ్బతీసింది. గడిచిన ఐదు సెషన్లలోనూ అమ్మకాల వెల్లువ కొనసాగింది. వారాంతం సెషన్‌లో సెన్సెక్స్‌ 366 పాయింట్లు కోల్పోయి 64,886 వద్ద ముగిసింది. నిఫ్టీ 121 పాయింట్ల నష్టంతో 19,266 వద్ద ముగిసింది. వారంలో సెన్సెక్స్‌, నిఫ్టీ50 వరుసగా 0.1 శాతం మరియు 0.2 శాతం చొప్పున క్షీణించాయి. ఇంతక్రితం 2022 మేలో చోటు చేసుకున్న వరుస నష్టాల తర్వాత మళ్లీ ఇప్పుడు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఏప్రిల్‌ 2020లో సెన్సెక్స్‌్‌, నిఫ్టీ సూచీలు వరుసగా ఏడు వారాల పాటు పడిపోయాయి. సమీపకాలంలోనూ ద్రవ్యోల్బణం మరింత పెరగనుందన్న ఆర్‌బిఐ అంచనాలు ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా సరఫరా అంతరాయాల కారణంగా రానున్న నెలల్లో ప్రధాన ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని విశ్లేషించింది. నైరుతి రుతుపవనాల ప్రభావం, భౌగోళిక రాజకీయ ప్రతికూలతల కారణంగా ప్రపంచ ఆహార ధరలపై ఒత్తిడి పెరగొచ్చని హెచ్చరించింది. దేశ ఆర్థిక వ్యవస్థలోనూ పెద్ద సానుకూలతలు, పురోగతి కనబడటం లేదు. ఈ పరిణామమూ సూచీల అమ్మకాలకు పురిగొల్పుతోంది.

రిలయన్స్‌ సూచీ 3.4 శాతం పతనం

గడిచిన ఐదు సెషన్లలో రిలయన్స్‌ ఇండిస్టీస్‌ షేర్‌ అధికంగా 3.4 శాతం నష్టపోయింది. ఆగస్ట్‌ 18న రూ.2,556.7 వద్ద నమోదయిన సూచీ.. 25న రూ.2,470కి పడిపోయింది. సన్‌ ఫార్మా సూచీ 2.3 శాతం, మహీంద్రా అండ్‌ మహీంద్రా 2.1 శాతం, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ 1.8 శాతం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 1.8 శాతం చొప్పున పతనమయ్యాయి. గతవారం అధికంగా లాభపడిన వాటిలో బజాజ్‌ ఫైనాన్స్‌ 5.1 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 4.3 శాతం, ఆసియన్‌ పెయింట్స్‌ 3.1 శాతం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 3.0 శాతం, ఇన్ఫోసిస్‌ 2.3 శాతం చొప్పున పెరిగాయి. ఆగస్ట్‌ 18న బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 64,948 వద్ద ఉండగా.. వారాంతం నాటికి 64,886.5కు పడిపోయింది. ఆగస్ట్‌ 28 నుంచి ప్రారంభం కానున్న వారంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లను ప్రధానంగా విదేశీ పరిణామాలు ప్రభావితం చేయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.