ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ''నవరత్నాలు -పేదలందరికీ ఇళ్లు'' పధకంలో నిర్మిస్తున్న గృహాలు ఉగాదికి ఐదు లక్షల నిర్మాణాలు పూర్తి చేయాలని, అదే రోజు ఐదు లక్షల మంది లబ్ధిదారులు గృహ ప్రవేశాలు చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. విజయవాడలోని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ప్రధాన కార్యాలయంలో బుధవారం గృహ నిర్మాణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజరుజైన్‌తో కలిసి 26 జిల్లాల ప్రాజెక్టు డైరెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గృహ నిర్మాణాలు వేగవంతంగా లక్ష్య సాధనకు కృషి చేసిన ఉద్యోగులకు సిఎం పాల్గొనే సభలోనే అవార్డులతో సత్కరిస్తామన్నారు. ఇళ్ల నిర్మాణాల్లో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. రాష్ట్ర గృహ నిర్మాణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజరుజైన్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యాలను పూర్తి చేయడానికి ఇంజనీరింగ్‌అసిస్టెంట్ నుంచి జిల్లా కలెక్టర్ వరకు నిరంతరం పనిచేయాలన్నారు. ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని, ఆప్షన్-3 లే అవుట్లలో 36 క్వాలిటీ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గృహనిర్మాణ శాఖ ఎండి లక్ష్మీషా మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడానికి అధికారులు నిరంతరం లే -అవుట్లను సందర్శించాలన్నారు. రోజు వారీ లక్ష్యాలను నిర్ధేశించుకుని ఉగాధి నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం శివప్రసాద్, చీఫ్ ఇంజనీరు జివి ప్రసాద్, అన్ని జిల్లాల గృహనిర్మాణశాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్లు పాల్గొన్నారు.










