Oct 19,2023 17:25

ప్రముఖ నటుడు బాలకృష్ణ నటించిన తాజా చిత్రం 'భగవంత్‌ కేసరి'. దర్శకుడు అనీల్‌ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రలో నటి శ్రీలీల, సీనియర్‌ హీరోయిన్‌ కాజల్‌ నటించారు. దసరా కానుకగా అక్టోబర్‌ 19వ తేదీ శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు మెప్పించిందో తెలుసుకుందామా..?!

కథ
నేలకొండ భగవంత్‌ కేసరి (బాలకృష్ణ) వరంగల్‌ జైలులో శిక్ష అనుభవిస్తుంటాడు. జైలర్‌ శ్రీకాంత్‌ (శరత్‌కుమార్‌) కేసరి సన్నిహితంగా ఉంటారు. ఓ రోజు రోడ్డు ప్రమాదంలో శ్రీకాంత్‌ మరణిస్తాడు. దీంతో అతని కుమార్తె విజ్జిపాప (శ్రీలీల) బాధ్యతను కేసరి తీసుకుంటాడు. శ్రీకాంత్‌ కోరిక మేరకు విజ్జిని ఆర్మీలో చేర్చాలనుకుంటాడు. కానీ తండ్రి మరణంతో విజ్జి మానసిక సమస్యతో బాధపడుతుంది. ఈ ఫోబియా నుంచి విజ్జిని ఎలాగైనా బయటపడేయాలని, ఆమెను శారీరకంగా, మానసికంగా దృఢంగా చేయాలని కేసరి ప్రయత్నిస్తుంటాడు. కానీ విజ్జి మాత్రం ఒక అబ్బాయిని ప్రేమించి.. కేసరిని దూరం పెడుతుంది. మరోవైపు వ్యాపారవేత్త రాహుల్‌ సంఘ్వీ (అర్జున్‌ రాంపాల్‌) ప్రాజెక్టు వి విషయంలో విజ్జిని చంపాలనుకుంటాడు. ఆ సమయంలో భగవంత్‌ కేసరి విజ్జిని కాపాడతాడు. అప్పటికే రాహుల్‌కి, కేసరి మధ్య వైరం ఉటుంది? వారిద్దరి మధ్య వైరం ఎందుకొచ్చింది? కేసరి జైలుకి ఎందుకెళ్లాల్సి వచ్చింది? అతను చేసిన నేరం ఏంటి? విజ్జి తన తండ్రి కోరిక మేరకు ఆర్మీలో చేరుతుందా? లేదా వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

vijji


విశ్లేషణ
దర్శకుడు అనీల్‌ రావిపూడి ముందే చెప్పినట్టు ఈ చిత్రంలో బాలకృష్ణను సరికొత్తగా చూపించారు. ఇక సినిమా విషయానికొస్తే వరంగల్‌ జైలులో కేసరి పాత్రను పరిచయం చేస్తూ కథ ప్రారంభమవుతుంది. జైలర్‌ శ్రీకాంత్‌.. కేసరి సన్నిహితంగా మెలగడం, జైలర్‌గా నిబంధనలను అతిక్రమించి కేసరి తన తల్లి చివరి కోరికను తీర్చేందుకు సహాయపడడం.. దీంతో శ్రీకాంత్‌ సస్పెండ్‌ అవ్వడం వంటి సన్నివేశాలు సాదాసీదాగానే ఉన్నాయి. అయితే చివరిగా సత్ప్రవర్తన కింద రిలీజయ్యే ఖైదీల లిస్టులో భగవంత్‌ కేసరి పేరును శ్రీకాంత్‌ చేరుస్తాడు. ఆ తర్వాత కేసరి రిలీజయ్యే రోజే..శ్రీకాంత్‌ మృతి చెందడం.. దీంతో జైలర్‌ కుమార్తె విజ్జిని కేసరి తన కూతురిలా భావించి పెద్ద చేయాలనుకోవడం వంటి సన్నివేశాలు పాత సినిమాలనే తలపిస్తాయి. ఇక తండ్రి మరణంతో ఫోబియాతో బాధపడుతున్న శ్రీలీలని కేసరి సింహంలా చేయాలనుకుంటాడు. ఇందులో భాగంగానే సైకాలజిస్ట్‌ కాత్యాయని (కాజల్‌) పాత్ర తెరపై కనిపిస్తుంది. అయితే ఎవరో ఒకరు సీనియర్‌ హీరోయిన్‌ తెరపై కనిపించాలన్న ఉద్దేశంతో డైరెక్టర్‌ కాజల్‌ పాత్రను సృష్టించారనిపిస్తుంది. ఈ పాత్ర కథపై ఏమంత ఇంపాక్ట్‌ చూపించదు. అనుకున్న స్థాయిలో నవ్వులు పండవు. ప్రతినాయకుడు రాహుల్‌ విజ్జి జోలికి వెళ్లడంతో కథనంలో వేగం పెరుగుతుంది. ఇంటర్వెల్‌ ముందు వచ్చే ట్విస్టు సెకండాఫ్‌పై ఆసక్తి కలిగిస్తుంది. సెకండాఫ్‌లో కేసరికి, రాహుల్‌కి మధ్య వైరాన్ని ఫ్లాష్‌బ్యాక్‌లో చూపాస్తారు. ప్లాష్‌బ్యాక్‌లో బాలయ్య మార్క్‌ కనిపిస్తుంది. ఆ తర్వాత తండ్రి కోరికను తీర్చే ప్రయత్నంలో భాగంగా విజ్జి ప్రయత్నించే సన్నివేశాలు అలరిస్తాయి. క్లైమాక్స్‌లో శ్రీలీల నటన హైలెట్‌గా ఉంది. తండ్రీ కూతుళ్ల అనుబంధాన్ని డైరెక్టర్‌ అనిల్‌ తెరపై చక్కగా చూపించారు. ఈ చిత్రంలో కథ, కథనం పాతదే అయినా.. బాలకృష్ణ, శ్రీలీల నటనతో మెప్పించారు. ఈ సినిమాలో బాలకృష్ణ లుక్స్‌ కొత్తగా ఉంది. ఈ చిత్రంలో ట్విస్టులతోపాటు బాలకృష్ణ నటన అద్భుతంగా ఉంది. విలన్‌గా రాంపాల్‌ నటన బాగుంది. బాలకృష్ణ డైలాగ్స్‌ ఫ్యాన్స్‌ చేత ఈలలు వేయిస్తాయి. తమన్‌ అందించిన సంగీతం అఖండ సినిమా రేంజ్‌లో లేకపోయినా.. ఈ చిత్రంలో ఒకట్రెండు పాటలు అలరిస్తాయి. కాజల్‌, బ్రహ్మాజీ, రవిశంకర్‌, మురళీధర్‌ గౌడ్‌ తదితర నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు. ఓవరాల్‌గా ఈ చిత్రం బాలకృష్ణ అభిమానులకే కాదు.. ఫ్యామిలీ ఆడియన్స్‌ని అలరిస్తుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
 

bla krishna

 

kesari