సంపూర్ణేష్‌బాబు తాజాగా నటించిన మూవీ 'మార్టిన్ లూథర్ కింగ్'. తమిళంలో సూపర్ హిట్ కొట్టిన 'మండేలా' మూవీకి ఈ చిత్రం రీమేక్. ఈ సినిమాను దర్శకురాలు పూజ కొల్లూరు తెరకెక్కించారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 27వ తేదీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో తెలుసుకుందామా..?!
కథ
పడమరపాడు గ్రామంలో జగ్గు (నరేశ్), లోకి (వెంకట్ మహా) ఇద్దరు అన్నదమ్ములు సర్పంచ్ పదవి కోసం పోటీ పడుతుంటారు. వారు ఊరి బాగుకోసం కాకుండా.. ఆ ఊరికి పెద్ద ఫ్యాక్టరీ వస్తుందని.. సర్పంచ్‌గా ఉంటే.. కోట్లలో కమిషన్ వస్తుందని తెలిసి ఆ ఇద్దరూ పోటీ పడతారు. అయితే ఆ ఇద్దరు అన్నదమ్ములకి సమానంగా ఓటు వచ్చే అవకాశం ఉంది. ఒక్క ఓటు ఎవరికి ఎక్కువ వస్తే వారు సర్పంచ్ అయ్యే అవకాశం ఉంది. ఆ ఒక్క ఓటు స్మైల్ అలియాస్ మార్టిన్ లూథర్‌కింగ్ (సంపూర్ణేశ్‌బాబు)ది అని తెలిసి జగ్గు, లోకి తనని ఎలా ప్రలోభపెడతారు? వీరి ప్రలోభాలకు స్మైల్ లొంగుతాడా? లేదా తన ఓటు హక్కుతో ఊరి సమస్యల్ని తీరుస్తాడా? వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
'మండేలా' చిత్రంలో యోగిబాబు నటించాడు. అదే పాత్రలో తెలుగులో 'మార్టిన్ లూథర్ కింగ్' చిత్రంలో సంపూర్ణేశ్‌బాబు నటించారు. దర్శకురాలు పూజ 'మండేలా' చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి.. ఓటు విలువ తెలియజేసేలా తెరకెక్కించారు. మరుగుదొడ్డి ప్రారంభోత్సవం సీన్‌తో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత స్మైల్ ఎంట్రీ. స్మైల్ ఆ గ్రామంలో చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తాడు. పెద్ద మర్రి చెట్టే అతని నివాసం. ఆ ఊర్లోనే ఎవరు ఏ పని చెప్పినా చేస్తూ.. వచ్చిన చిల్లర డబ్బును దాచుకుని చెప్పుల షాప్ పెట్టుకోవాలని కలలు కంటాడు. ఈ క్రమంలోనే స్మైల్ దాచుకున్న డబ్బుని ఎవరో దొంగతనం చేస్తారు. స్మైల్ స్నేహితుడు బాటా డబ్బును పోస్టాఫీస్‌లో దాచుకోమని సలహా ఇస్తాడు. దానికోసం పోస్టాఫీస్‌లో పనిచేసే వసంత (శరణ్య ప్రదీప్) దగ్గరకు వెళ్లి అకౌంట్ తెరవని కోరతాడు. అప్పుడు వసంత ఆధార్‌కార్డు, ఓటర్ కార్డు అడగ్గా.. అవేమీ లేవని.. తన పేరే తనకు తెలియదని స్మైల్ చెబుతాడు. అప్పుడామె స్మైల్‌కి మార్టిన్ లూథర్‌కింగ్ అని పేరు పెట్టి ఆ పేరుతో ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు ఇలా అన్నింటికి అప్లై చేస్తుంది. మరోవైపు ఆ ఊర్లో ఎన్నికల దగ్గరపడుతాయి. అన్నదమ్ములిద్దరికీ ఉత్తర, దక్షిణం వైపు చెరో దిక్కు కులాల వారీగా ఓట్లు సమంగా వస్తాయని అంచనాకొస్తారు. చివరికి స్మైల్ ఓటే ఎన్నికల్లో కీలకగా మారుతుంది. సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతూ విరామం వస్తుంది. ఇక సెకండాఫ్‌లో జగ్గు, లోకి స్మైల్ ఓటు కోసం పడే తంటాలు నవ్వు తెప్పిస్తాయి. ఒక్కోచోట విసుగు తెప్పిస్తాయి. ఇందులో ప్రధానంగా పోటీదారులు ఓటర్లకు ఎలాంటి ప్రలోభాలకు గురిచేస్తారు? కులాలు అడ్డుపెట్టుకుని ఎలాంటి గొడవలు సృష్టిస్తారనేది దర్శకురాలు స్పష్టంగా చూపించారు. క్లైమాక్స్ ఊహించిందే. ఊహించిందే. ఫస్టాఫ్ పరవాలేదు. దర్శకురాలు సెకండాఫ్‌పై మరింత కసరత్తు చేసి ఉంటే సినిమా మరోస్థాయిలో ఉండేది. ఓవరాల్‌గా ఈ చిత్రం ఓటు ప్రాధాన్యతను తెలుపుతుంది.
ఎవరెలా చేశారంటే..
సంపూర్ణేశ్‌బాబు నటన బాగుంది. గత సినిమాల కంటే ఈ సినిమాలో సంపు నటనతో ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. సీనియర్ నరేశ్ నటన, వెంకట్ మహా నటన ఆకట్టుకుంది. శరణ్యతోపాటు ఇతర నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు. స్మరణ్ సాయి నేపథ్య సంగీతం బాగుంది. దీపక్ యరగెరా సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.