'నేను 12వ తరగతి చదువుతున్నప్పుడు యూత్ ఇన్నొవేషన్ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించాను. అప్పుడు కొంత బెరుకు ఉండేది. నిజానికి నేను ఎప్పుడూ ప్రశాంతంగా, నవ్వుతూ ఉంటాను. నాకు యుక్త వయసులోనే పెళ్లి చేశారు. కానీ అది ఎంతోకాలం నిలవలేదు. 21 ఏళ్లకే విడాకులు అయిపోయాయి. అప్పుడతడి వయసు 25. ఆ వయసులో మాకు ఏది తప్పు? ఏది ఒప్పు? అనేది కూడా పెద్దగా తెలియదు. బహుశా అమెరికా లైఫ్‌స్టైల్ నాకు వంట పట్టలేదేమో!. డిప్రెషన్, చచ్చిపోదామనుకున్నాను. ఈ విడాకుల వల్ల నాకన్నా నా తల్లిదండ్రులు ఎక్కువ బాధపడ్డారు. చదువులపై ధ్యాస పెడితే ఈ బాధ నుంచి బయటపడొచ్చన్నారు. ఈ బ్రేకప్, కొట్లాటల వల్ల మానసిక ఒత్తిడికి లోనయ్యాను. జీవితం అంటే ఇదేనా? ఎందుకు బతకాలి? అని విరక్తి చెందాను. ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. నా పరిస్థితి చూడలేక నా సోదరి నన్ను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లింది. డిప్రెషన్ నుంచి బయటపడటానికి రెండు నెలలు పట్టింది' అని చెప్పారు నటి స్వర్ణమాల్య. యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత నటిగానూ మారింది. మణిరత్నం దర్శకత్వం వహించిన అలైపుతే సినిమాలో ఓ పాత్రలో నటించింది. నటన, యాంకరింగ్.. రెండింటిలోనూ ఆరితేరిన ఆమె ప్రస్తుతం సాధారణ జీవితం గడుపుతోంది. కష్టాలను చూసిన ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను చెప్పుకొచ్చింది.