Nov 10,2023 21:45

ప్రజాశక్తి- వేంపల్లె (వైఎస్‌ఆర్‌ జిల్లా):ప్రభుత్వం ఒక పాలసీ, ప్రణాళికా ప్రకారం అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్‌ఆర్‌ జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన ఆర్కే వ్యాలీ పోలీస్‌ స్టేషన్‌ను ప్రారంభించారు. ఇడుపులపాయ నెమళ్ల పార్కు వద్ద ఉన్న ప్రేయర్‌ హాలులో వేముల మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులతో పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పథకాల అమలుకు అన్ని వర్గాల ప్రజల సమ్మతి, సహకారం ఎంతో అవసరమన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలను సంతృప్తికరంగా ప్రజలకు అందిస్తున్నామని పేర్కొన్నారు. వ్యవస్థ సక్రమంగా నడవాలంటే ఎక్కడా వివక్షకు తావివ్వకూడదని అన్నారు. పరిపాలన పారదర్శకంగా ఉన్నప్పుడే ప్రజావ్యవస్థ పటిష్టంగా సాగుతుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రైతుల ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌పై అతి తక్కువ ఖర్చు చేశారని విమర్శించారు. వైసిపి ప్రభుత్వంలో ఈ నాలుగున్నరేళ్లలో రూ.7,800 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. వేముల పరిసర ప్రాంత గ్రామాల్లో గ్రామస్తుల, రైతుల సమస్యలను తెలుసుకొని వారికి పరిష్కార మార్గాలు, ఫలితాలు సంతృప్తికర స్థాయిలో ఉన్నాయో? లేదో? వారితో నిర్ధారించుకొని ముందుకు సాగాలని అధికారులకు సూచించారు. వారికి అందాల్సిన పరిహారం అందించేలా చూడాలని, ఈ ప్రక్రియ రానున్న నాలుగు నెలల్లో పూర్తి చేయాలని ఇరిగేషన్‌, సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమం చివరలో ఈ నెల 14 నుండి 20వ తేదీ వరకు జరిగే 56వ గ్రంథాలయ వారోత్సవాల పోస్టర్‌ను సిఎం ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ఎస్‌బి.అంజాద్‌ బాషా, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్‌, కడప ఎంపి అవినాష్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ధనుంజయరెడ్డి, ఒఎస్‌డి కృష్ణ మోహన్‌రెడ్డి, కలెక్టర్‌ వి.విజరురామరాజు తదితరులు పాల్గొన్నారు.

  • సిఎం జగన్‌ పయనిస్తున్న కారుకు స్వల్ప ప్రమాదం

వేముల మండల నాయకులతో సమావేశం అనంతరం తిరిగి గెస్ట్‌హౌస్‌కు కారులో ముఖ్యమంత్రి వెళ్తున్న సమయంలో చిన్న ప్రమాదం చోటు చేసుకుంది. సిఎం కాన్వారులోని ఒక వాహనం ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని వెనుక నుంచి ఢకొీంది. అయితే, సిఎంకు ఎలాంటి ప్రమాదమూ జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యమంత్రి ఆ కారు దిగి మరో వాహనంలో వెళ్లారు.