Jun 23,2023 17:59

న్యూఢిల్లీ : మొట్టమొదటగా భారత్‌ తయారుచేసే చిప్స్‌ వచ్చే ఏడాది 2024 డిసెంబర్‌నాటికి మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్లు మరియు ఐటిశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ శుక్రవారం తెలిపారు. ఈ చిప్స్‌ తయారీ కోసం ఈ ఏడాదిలోపు నాలుగు లేదా ఐదు సెమీకండక్టర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న మోడీ... ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటన అనంతరం మంత్రి అశ్విని వైష్ణవ్‌ మీడియాతో మాట్లాడారు. భారత్‌ తయారు చేసే చిప్‌ వచ్చే ఏడాది 2024 డిసెంబర్‌లో విడుదల కానుందన్నారు. గుజరాత్‌లో నెలకొల్పనున్న చిప్‌ మేకర్‌ మైక్రాన్‌ సెమీకండక్టర్‌ ప్లాంట్‌కు సంబంధించి భూ కేటాయింపు, ఫ్యాక్టరీ డిజైన్‌ వర్క్‌్‌, పన్ను సంబంధిత అగ్రిమెంట్‌ పూర్తయిందని ఆయన వెల్లడించారు. దాదాపు రూ.22,450 కోట్ల పెట్టుబడితో కేంద్ర ప్రభుత్వం తొలుత గుజరాత్‌లో టెస్ట్‌ సెమీకండక్టర్‌ ప్లాంట్‌ని నిర్మించనుంది.
కాగా, మొదటి దశ ఈ ఏడాదిలో ప్రారంభమవుతుంది. ఇక రెండో దశ 500,000 చదరపు అడుగులతో ప్రణాళికాబద్దమైన నిర్మాణం 2024 చివరలో పూర్తికానుంది. ఇక మైక్రాన్‌ టెక్నాజీతో తయారయ్యే చిప్‌ తయారీల వల్ల రాబోయే రోజుల్లో ప్రత్యక్షంగా ఐదు వేల ఉద్యోగాలు, కమ్యూనిటీ పరంగా 15 వేల ఉద్యోగాలు పొందే అవకాశం ఉందని మైక్రాన్‌ తెలిపింది.