Jun 19,2023 07:33

ఎప్పుడూ ఇలాగే
ఉంటుందనుకోలేం
ఇంకేదోలా ఉండాలని
ఊపిరి కొయ్యకు ఆశల్ని మూట గట్టుకొని
ఊరకుండనూ లేము
అడుగులకిరువైపులా
ఆరిపోయిన దీపాలుంటాయి
అరికాలిలో దిగిన ముళ్లను
మౌనంగా పెకలించడం నేర్చుకోవాలి
గుండె పగిలిన భారాన్ని
పెదవి బిగువున భరించడం సాధన చేయాలి
కొమ్మల నుంచి రాలిపడేవన్నీ పువ్వులే కాదు;
పండిపోయిన ఆకులు
ఎండిపోయిన కాయలూనూ !
కొంత ప్రయాణం తర్వాత
మిగిలేది అలసటే కాదు..
అనుభవం కూడా
ఎన్నిసార్లు కలిపి కుట్టుకున్నా
ఎవరో ఒకరు కదుపుతూనే ఉంటారు
విరిగిన ముక్కల్ని చూసి నవ్వుకుంటూ వెళ్లిపోతుంటారు
గ్రుంకిన పొద్దు అంచుపై వెలిగే ఎర్రని రవ్వలు
వేకువ ముంగిటిలో రాత్రి వేసిన మంచు ముగ్గులు
ఇప్పుడిక
ఏ తుపానుకు జడవని దఢత్వం పొందాలి
ఏ వెన్నెల వేడికి కరగని ఖచ్చితత్వాన్ని
ఆసాంతం నింపుకోవాలి !
 

 సునీత గంగవరపు
94940 84576