
ఉత్తరప్రదేశ్ : దీపావళి పండుగ వేళ ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఏర్పాటు చేసిన పలు బాణసంచా దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. గోపాల్‌బాగ్ శివారు ఏరియాలో బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేయగా, అనూహ్యంగా మంటలు చెలరేగి ఏడు దుకాణాలకు వేగంగా మంటలు విస్తరించాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది గాయపడటంతో వారిని ఆస్పత్రికి తరలించారు. పలు వాహనాలు కూడా మంటల్లో దగ్దమయ్యాయి. ఈ ఘటనపై రయ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ అజరు కిషోర్ మాట్లాడుతూ, గోపాల్‌బాగ్ ఏరియాలో బాణసంచా అమ్మకాల కోసం ఏర్పాటు చేసిన ఏడు దుకాణాలు మంటల్లో చిక్కుకున్నాయని, తొమ్మిది మంది గాయపడ్డారని చెప్పారు. ఈ ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అనుమానిస్తున్నట్టు తెలిపారు. బాణసంచా దుకాణాలకు పర్మిట్ ఉందని చెప్పారు. ప్రమాదానికి కారణాలు, జరిగిన నష్టంపై విచారణ జరుపుతున్నామని అన్నారు.