
మెక్సికో సిటీ : మెక్సికోలోని శరణార్ధుల కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించి 39మంది మరణించారని, 29మంది గాయపడ్డారని మెక్సికో జాతీయ ఇమ్మిగ్రేషన్ ఇనిస్టిట్యూట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కేంద్రంలో మొత్తంగా 68 ఉన్నారని పేర్కొంది. వెంటనే ఈ సంఘటనపై మెక్సికో అటార్నీ జనరల్ కార్యాలయం దర్యాప్తు ప్రారంభించిందని మీడియా వార్తలు తెలిపాయి. సోమవారం అర్ధరాత్రి ఈ కేంద్రంలో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే అంబులెన్సులు, అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకోవడం కనిపించింది. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో కమ్ముకుపోవడం కనిపిస్తోంది. శరణార్ధులకు సాయం అందించడానికి ప్రభుత్వ జాతీయ మానవ హక్కుల కమిషన్ అధికారులు రంగంలోకి దిగారు. ఈ విషాదానికి దారి తీసిన చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించారు. అమెరికాలో ప్రవేశించే వారికి సియుడాడ్ జారెజ్ ప్రధాన క్రాసింగ్ పాయింట్‌గా వుంది. ఇక్కడి షెల్టర్లన్నీ వలసవాదులు, శరణార్ధులతో నిండివుంటాయి. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు అమెరికాలో ప్రవేశించడానికి వారు ఇక్కడ వేచి చూస్తుంటారు. లేదా అమెరికాలో ఆశ్రయం కోరి అనుమతి కోసం ఎదురుచూస్తున్నావారై వుంటారు. కోవిడ్ సంబంధిత నియంత్రణలు ఎత్తివేసిన తర్వాత ఇలా ఆశ్రయం కోరేవారిపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ కొత్త ఆంక్షలు విధించారు. అమెరికా సరిహద్దులు దాటి వచ్చేవారికి ఆ దేశంలో ఆశ్రయం లభించదన్నది కొత్త నిబంధనల సారాంశం.