'హెడ్‌సెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేస్తే రూ.20వేల జరిమానా..' అసత్య ప్రచారం : ఏపీ రవాణాశాఖ

ప్రజాశక్తి-అమరావతి: ''ఇయర్ ఫోన్స్, హెడ్‌సెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేస్తున్నారా.. అయితే మీకు రూ.20వేల జరిమానా..'' అంటూ ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ ప్రకటించినట్లు గత రెండు రోజులుగా వాట్సాప్ సహా వివిధ సామాజిక మాధ్యమాల్లో ఈ సమాచారం తెగ వైరల్ అవుతోంది. ఈ అంశంపై తాజాగా ఏపీ రవాణా శాఖ కమిషనర్ స్పందిస్తూ.. ఇదంతా అసత్య ప్రచారమని తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకే రాష్ట్రంలో సవరించిన జరిమానాలు వసూలు చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. మోటార్ వెహికిల్ యాక్ట్ ప్రకారం ఇయర్ ఫోన్ లేదా హెడ్ ఫోన్ పెట్టుకుని వాహనం నడుపుతూ పట్టుబడితే తొలిసారి రూ. 1500 నుంచి రూ.2వేలు జరిమానా.. పదేపదే పట్టుబడితే రూ.10వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఈ నిబంధన చాలా కాలంగా అమల్లో ఉన్నట్లు చెప్పారు. హెడ్‌సెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేస్తే రూ.20వేల జరిమానా అసత్య ప్రచారమని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో చేసే అసత్య ప్రచారాలను వాహనదారులు నమ్మొద్దని కమిషనర్ సూచించారు.