Aug 07,2023 08:42

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : 2023-24 నుంచి 2025-26 విద్యా సంవత్సరాలకు ప్రయివేటు ఇంజనీరింగ్‌ కళాశాలల్లో వివిధ కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఫీజులను ఖరారు చేసింది. ఆదివారం ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి జె శ్యామలరావు జివో నం.41ను విడుదల చేశారు. కనీస ఫీజుగా రూ.43 వేలను, గరిష్ట ఫీజుగా రూ.77 వేలుగా నిర్ణయించింది. 92 కళాశాలలకు కనీస ఫీజు నిర్ణయించగా, 16 కళాశాలలకు రూ.70 వేలు నుంచి రూ.77 వేల మధ్య నిర్ణయించింది. వీటితో పాటు ప్రయివేటు యూనివర్సీటీలకు కూడా ఫీజులను నిర్ధారిస్తూ మరో జివోను ప్రభుత్వం విడుదల చేసింది. క్రియా, విట్‌, ఎస్‌ఆర్‌ఎం, సెంచ్యురియన్‌, భారతీయ, మోహన్‌ బాబు, అపోలో యూనివర్సిటీల్లో బిటెక్‌, ఎంటెక్‌, డిగ్రీ కోర్సులకు ఫీజులను నిర్ణయించింది. విట్‌, ఎస్‌ఆర్‌ఎం, మోహన్‌ బాబు బ్రౌన్‌ ఫీల్డ్‌ యూనివర్సిటీలలకు రూ.70 వేలను నిర్ణయించింది. ఫీజులను నిర్ణయించడంతో సోమవారం నుంచి 12వ తేదీ వరకు ఇఎపిసెట్‌ వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ యధావిధిగా జరగనుంది. ఫీజులు నిర్ణయించకపోవడంతో కౌన్సిలింగ్‌ ప్రక్రియ ఆలస్యమైన సంగతి తెలిసిందే.