- ప్రధాన ఆకర్షణగా వాయుసేన విన్యాసాలు
- పాప్ సింగర్ దువా లిపా ప్రదర్శన కూడా..
అహ్మదాబాద్: ఐసిసి వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు బిసిసిఐ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఆదివారం భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌కు ముందు ప్రధాన ఆకర్షణగా వాయుసేన విన్యాసాలను నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీతోపాటు బిసిసిఐ సభ్యులు, మాజీ క్రికెటర్లు, అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నట్లు సమాచారం. అలాగే దిగ్గజ క్రికెటర్లు కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, మహేంద్రసింగ్ ధోనీ ఈ మ్యాచ్‌కు హాజరవుతారని సమాచారం. ప్రపంచంలోనే అత్యధిక సీట్ల సమర్థ్యం గల స్టేడియంలో భారత వాయుసేనకు చెందిన సూర్య కిరణ్ ఏరోబాటిక్ బృందం విన్యాసాలు చేయబోతోంది. ఈ విషయాన్ని గుజరాత్‌కు చెందిన డిఫెన్స్ పీఆర్వో ఓ ప్రకటనలో వెల్లడించారు. ఫైనల్ పోరు మొదలయ్యే పది నిమిషాల ముందు స్టేడియంలో ఈ విన్యాసాలు అభిమానులను అలరించనున్నాయి. మొత్తం తొమ్మిది ఎయిర్‌క్రాఫ్ట్‌లు రకరకాల ఆకారాలతో అబ్బురపరచనున్నాయి. ఇందుకోసం శుక్ర, శనివారాల్లో ఎయిర్‌షో రిహార్సల్స్ ఉంటాయని రక్షణ శాఖ పేర్కొంది. ఇక ఫైనల్ మ్యాచ్‌లో మరో ప్రత్యేక కార్యక్రమం కూడా ఉన్నట్లు తెలస్తోంది. గోల్బల్ పాప్ సింగర్ దువా లిపా ఫైనల్ క్లాష్‌కు ముందు ప్రదర్శన కూడా ఉండనుంది. ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడే టీమిండియా ఇప్పటికే అహ్మదాబాద్‌కు చేరుకుంది. భారత్, ఆస్ట్రేలియా ప్రపంచకప్ ఫైనల్లో తలపడనుండటం ఇది రెండోసారి. 2003 తుదిపోరులో ఆసీస్ చేతిలో భారత్ ఓడింది. ఇక ఈ ప్రపంచకప్‌లో టీమిండియా మంచి ఫామ్‌లో ఉంది. ఆడిన అన్ని మ్యాచ్‌లు గెలిచిన ఉత్సాహంగా బరిలోకి దిగుతోంది.